Abn logo
Jul 7 2020 @ 03:22AM

అందుకే...సచిన్‌ తొలి బంతిని వద్దనేవాడు

వెల్లడించిన గంగూలీ 

న్యూఢిల్లీ:  సచిన్‌ టెండూల్కర్‌-సౌరవ్‌ గంగూలీల ఓపెనింగ్‌  జోడీకి అంతర్జాతీయ క్రికెట్‌లో తిరుగేలేదు. ప్రత్యర్థి బౌలర్లు ఎంతటి ఉద్ధండులైనా వీరిద్దరూ పరుగుల వరద పారించేవారు. భారత్‌ తరఫున సచిన్‌-దాదా ద్వయం 136 వన్డే ఇన్నింగ్స్‌లో 6,609 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇదంతా బాగానే ఉన్నా ఓ విషయంలో మాత్రం అభిమానులకు ఎన్నో సందేహాలుండేవి. ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ తొలి బంతిని ఎదుర్కొనేందుకు సచిన్‌ ఎందుకు ఆసక్తి చూపడో వారికి అర్ధమయ్యేదికాదు. సచిన్‌ ఎప్పుడూ నాన్‌స్ట్రయిక్‌ ఎండ్‌లోనే ఉండగా, దాదానే మొదట ఇన్నింగ్స్‌ను ఆరంభించేవాడు. దీని వెనకున్న రహస్యాన్ని మయాంక్‌ అగర్వాల్‌తో జరిపిన వీడియో చాట్‌లో గంగూలీ వెల్లడించాడు. ‘అవును. సచిన్‌ ఎప్పుడూ ఇన్నింగ్స్‌ ఆరంభించే వాడు కాదు. కొన్నిసార్లు నేను అతడిని స్ట్రయికింగ్‌ చేయమనేవాణ్ణి. కానీ దీనికి అతడి దగ్గర రెండు సమాధానాలు సిద్ధంగా ఉండేవి. ఒకవేళ తాను ఫామ్‌లో ఉంటే అది అలాగే కొనసాగేందుకు నాన్‌స్ట్రయికర్‌గా ఉండడమే మేలని చెప్పేవాడు. ఇక ఫామ్‌లో లేకపోతే కాస్త ఒత్తిడి తగ్గేవరకు నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉంటాననేవాడు. ఇలా ఫామ్‌లో ఉన్నా, లేకపోయినా అవతలి వైపు ఉండేందుకే ఇష్టపడేవాడు. కానీ ఒకట్రెండు సార్లు అతడికంటే ముందే క్రీజులోకి వెళ్లి నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లో నిలబడ్డాను. దీంతో టీవీల్లో కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సచిన్‌ తొలి బంతి ఆడాడు’ అని దాదా వివరించాడు. 

Advertisement
Advertisement
Advertisement