Abn logo
May 19 2020 @ 04:15AM

వాడిన పూలు

కరోనా దెబ్బకు పూల రైతులు కుదేల్‌ 

పూలు కోసినా కొనేవారు కరువు 

పొలాల్లోనే వదిలేసి దున్నేస్తున్నారు 

ఇతర పంటల వైపు దృష్టి  

పట్టించుకోని పాలకులు, అధికారులు


సమ్మర్‌ వచ్చిందంటే పూల వ్యాపారం జోరుగా సాగేది.. రైతు పూలను కోయడం, మార్కెట్‌కు తరలించడం లాంటి పనుల్లో బిజీబిజీగా ఉండేవాడు. కానీ ఈఏడాది కరోనా మహమ్మారి పూలరైతును కుదేలు చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా పూల గిరాకీ డౌన్‌ అయ్యింది. ఈసమయంలో పూలన్నీ శుభకార్యాల్లో అలంకరణగా ఉండాల్సింది పోయి.. పొలంలోనే వాడిపోతున్నాయి. కొనే దొక్కులేక.. పూల రైతు అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : వివాహ శుభకార్యాలు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, ఏ ఇతర కార్యక్రమమైనా అలంకరణకు పూలు ఉండాల్సిందే. ప్రస్తుతం పూలకు మంచి సీజన్‌. పూల సాగుతో మంచి లాభాలు వస్తుండటంతో అటువైపుగా రైతులు మొగ్గుచూపారు. కరోనా కారణంగా ఒక్కసారిగా లాక్‌డౌన్‌ విధించడంతో పూల రైతులు వాడిపోతున్నారు. రోజూ పూస్తున్న పూలను చూసి సంతోషించాల్సింది పోయి.. బదులుగా రోదించే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికంగా మల్లె, కనకాంబురం, లిల్లీ, బంతి, చామంతి, జర్బరీ వంటి తదితర పూలను వేలాది ఎకరాల్లో సాగు చేశారు.


లక్షల రూపాయలు ఖర్చు చేసి కొంతమంది రైతులు పాలీహౌస్‌ ద్వారా జర్బరీ వంటి పూలను సాగుచేశారు. అత్యధికంగా చేవెళ్ల మండలంలోని చనువల్లి, గుండాల, పామెన, ఇక్కారెడ్డిగూడ, కందాడ, పల్గుట్ట గ్రామాల్లో ఎక్కువగా పూలను సాగుచేశారు. అలాగే శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌, కొత్తూరు మండలాలతోపాటు షాద్‌నగర్‌ మండలంలోని దూస్‌కల్‌, రాయ్‌కుల్‌, బుచ్చుగూడ, మహేశ్వరం మండలంలోని నాగారం, మన్‌సాన్‌పల్లి, మహేశ్వరం మండలాల్లో పూలసాగు గణనీయంగా ఉంది. అలాగే వికారాబాద్‌లోని నవాబుపేట, మోమిన్‌పేట్‌, వికారాబాద్‌ ప్రాంతంలో గులాబీ, లిల్లీ పూలను సాగు చేశారు. మేడ్చల్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా పూల సాగు చేశారు. ఏటా సీజన్‌లో ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు పూలను ఎగుమతి చేసేవారు.


కరోనా మహమ్మారితో సభలు, సమావేశాలు, జయంతి, వర్థంతి వంటి కార్యక్రమాలు బందయ్యాయి. అలాగే దేవాలయాల్లో స్వామివారి దర్శనాలు నిలిపి వేయడంతో పూల వ్యాపారం నిలిచిపోయింది. ప్రధానంగా నగరంలోని గుడిమల్కాపూర్‌ పూల మార్కెట్‌ను మూసి వేయడంతో రైతులు పూలను కోయడమే మానేశారు. మార్కెట్‌ బంద్‌ చేయకముందు మార్కెట్‌కు పూలను తరలించగా... అక్కడ కొనేవారు లేక  అక్కడే పారబోశారు. ఈఏడాది మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో కరోనా వైరస్‌ రూపంలో పూల తోటలను సాగు చేస్తున్న రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివాహాలు, శుభకార్యాలు, చివరకు ఆలయాల్లో భక్తుల ప్రవేశాలను కూడా నియంత్రించారు. అంతరాష్ట్ర రవాణా సౌకర్యాలు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో పూలు అమ్ముడుపోక పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. గులాబీ, లిల్లీ పూలతోట సాగుకు ఎకరానికి రూ.85 వేల నుంచి రూ.95 వేల వరకు ఖర్చు చేశారు. రవాణా చార్జీలు కూడా మిగలక పోవడంతో రైతులు అప్పుల ఊబిలోకి నెట్టుకుపోయారు. కొందరు రైతులు పూల సాగును దున్నేసి కూరగాయ పంటలను వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా ఉధృతిని పరిశీలిస్తే.. ఇప్పట్లో వివాహాలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. 

 

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న, వరి, కంది రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుంది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తుంది. పండ్ల రైతులను కూడా ఆదుకుంటుంది. బత్తాయి కొనుగోళ్ల కోసం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పూల రైతులు పడుతున్న కష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని పూల రైతులు కోరుతున్నారు. ఎకరానికి కనీసం రూ. 20 వేల పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. 


 తీవ్ర నష్టాల్లో పూల రైతు

లాక్‌డౌన్‌తో పూల రైతుల బతుకులు టోటల్‌ డౌన్‌ అయ్యాయి. బషీరాబాద్‌ మండలం అల్లాపూర్‌ పంచాయతీలో బట్టి శ్రీను, ప్రేమ్‌రాజ్‌ ఇద్దరు రైతులు ఒక్కొక్కరు ఎకరం చొప్పున జర్మనీ (చామంతి) పూలతోటను సాగు చేశారు. ఎకరానికి రూ. 50 వేల పెట్టుబడి పెట్టి మూడు నెలలుగా ఇంటిల్లిపాది కష్టపడ్డారు. తోటలో కాసిన పూలవనం, సోయగం చూసి రైతులు మురిసిపోయారు. ఇక తమ బతుకులకు ఎలాంటి ఢోకా లేదనుకున్నారు. అంతలోనే కరోనా మహమ్మారి చుట్టుముట్టడంతో పూల రైతుల ఆశలు ఆవిరయ్యాయి. రెండు నెలలుగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో రైతులు చేతికొచ్చిన పూలను మార్కెట్‌కు తరలించి విక్రయించుకునే వీలులేకుండాపోయింది. దీంతో పొలంలోనే కాసిన పూలన్నీ కళ్లెదుటే ఎండి వాడిపోతుండటంతో ఆ రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.  


పూల రైతులను ఆదుకునేలా చర్యలు 

పూల రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం టాం. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌ డౌన్‌ విధించడంతో పూల మార్కెట్లు మూసి వేశారు. దీంతో జిల్లాలో పూల సాగుచేసిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో ఎక్కువగా లిల్లీ, గులాబీ, జర్జరి రకం పూలు ఎక్కువగా వేశారు. పూలు సిద్ధంగా ఉన్నా.. కొనేవారు లేక పొలాల్లోనే కోయకుండానే వదిలేస్తున్న న్యూస్‌ ఇప్పటికే పత్రికల్లో చూస్తున్నాను. 

- డాక్టర్‌ సునందరాణి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి 


పొలంలోనే పూలు వాడిపోతున్నాయి

పెళ్లిళ్ల సీజన్‌లో పూ లకు మంచి డి మాండ్‌ ఉంటుందని ఎంతో ఆశతో ఎకర పొలంలో లిల్లీ, గులాబీ సాగు చేశాను. అయితే కరోనా వైరస్‌ మూలంగా మార్కెట్‌కు పూలను తీసుకెళ్లినా కొనేవారే లేరు. దీంతో పొలాల్లోనే పూలను కోయ కుండా వదిలేశాం. దీంతో పూలు ఎక్కడిక్కడ వాడిపోతున్నాయి. పూల రైతులను ఆదుకు నేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

- కిష్టయ్య, రైతు, దేవునిఎర్రవల్లి పూల రైతులకు కన్నీలే మిగిలాయి


కష్టపడి పూల మొక్కలను సాగు చేసిన రైతులకు కరోనా వైరస్‌ మూ లంగా కన్నీళ్లే మిగి లాయి. పూలు కొనే వారు లేకపోవడంతో పొలంలోనే కోసి పారబోస్తున్నాం. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోతున్నాయి. 

 - గోపాల్‌రెడ్డి, రైతు, దేవునిఎర్రవల్లి


Advertisement
Advertisement