Abn logo
May 29 2020 @ 05:27AM

ఆర్టీసీ..ఆదాయానికి గండి

సంస్థకు కరోనా ఎఫెక్ట్‌

వనపర్తి డిపోకు సగం కూడా నమోదు కానీ ఆక్యూపెన్సీ

వస్తున్న ఆదాయం మెయింటెనెన్స్‌ ఖర్చులకే సరి..

వైరస్‌, ఎండల నేపథ్యంలో పెరగని ప్రయాణికుల సంఖ్య


వనపర్తి టౌన్‌, మే 28: ములుగుతున్న నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉంది ఆర్టీసీ పరిస్థితి. అసలే నష్టాల్లో నడుస్తున్న సంస్థకు ఇప్పుడు లాక్‌డౌన్‌ నేపథ్యంలో మరిన్ని నష్టాలు వస్తున్నాయి. ఆర్టీసీలో వనపర్తి డిపోకు ఘనమైన చరిత్ర ఉంది. నైజాం కాలంలో పురుడుపోసుకున్న సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే ప్రారంభమైన అయిదారు డిపోలలో వనపర్తి ఒకటి. అంతటి చరిత్ర కలిగిన డిపోకు ప్రస్తుతం ఆదాయం మాట అటుంచితే.. కనీసం మెయింటెనెన్స్‌కు కూడా సరిపడ ఆదాయం రావడం లేదు. 


రోజు నడుస్తున్న 90 బస్సులు

వనపర్తి డిపోలో సంస్థ బస్సులు 58, అద్దె బస్సులు 50 మొత్తం 108 ఉన్నాయి. 217 మంది డ్రైవర్లు, 190 మంది కండక్టర్లు ఉన్నారు. లాక్‌ డౌన్‌లో సడలింపుల తరువాత సగటున రోజుకు 90 బస్సుల వరకు వివిధ రూట్లలో తిప్పు తున్నారు. రాజధాని, సూపర్‌ లగ్జరీ బస్సులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులను నడపడం లేదు. డిపో పరిధిలోని నైట్‌హాల్ట్‌ బస్సులు నూ టికి నూరు శాతం నడుపుతు న్నామని, అయిన ప్పటికీ ఆదాయం రావడంలేదని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.


ఆదాయం వచ్చే రూట్లల్లోనూ అంతంతే

డిపోకు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఆత్మకూర్‌, ఘనపూర్‌, సంపట్రావుపల్లి రూట్లను ఆదాయం వస్తుంది. గడిచిన పది రోజుల నుంచి ఆయా రూట్లల్లోనూ గతంతో పోల్చుకుంటే సగానికి కూడా ఆదాయం రావడం లేదు. లాక్‌డౌన్‌కు ముందు డిపోకు రోజూ రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్య ఆదాయం వచ్చేది. ఏటా మే నెలలో పెళ్లిళ్ల సీజన్‌ ఉండటంతో అధిక ఆదాయం వస్తుండేది. ఆ ప్రకారం రోజూ డిపోలో 75 నుంచి 85 వరకు ఆక్యూపెన్సీ నమోదవుతుండేది. కానీ మే 19 నుంచి నేటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఆదాయం కనీసం రూ.6 లక్షలు కూడా దాటడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


ఆ లెక్కన చూస్తే రోజుకు 45 శాతం ఆక్యూపెన్సీ రావడం లేదు. దీనంతటికి ప్రధాన కారణం ఒకవైపు కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయాణికులు భయపడుతుంటే, మరో కారణం మండుతున్న ఎండలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల డిపో నుంచి బస్సు బయలుదేరే ముందు హైడ్రో క్లోరైడ్‌ ద్రావణంతో పిచికారి చేస్తున్నారు. మళ్లీ బస్సు డిపోకు వచ్చాక శానిటైజేషన్‌ చేస్తున్నారు. మాస్కులు ధరించాలని ప్రయాణికులకు చెబుతున్నారు. హ్యాండ్‌ శానిటైజర్‌ను ఇస్తున్నారు. ఇన్ని జాగ్రతలు తీసుకుంటున్నా మాత్రం ఆదాయం రావటం లేదు.


ఈ నెల 19 నుంచి 27 వరకు వనపర్తి డిపోకు వచ్చిన ఆదాయం వివరాలు 

తేదీ రూపాయలు

19 1,21,894

20 3,83,823

21 4,59,592

22 4,70,756

23 5,57,736

24 5,42,817

25 5,08,177

26 5,11,702

27 6,10,092

Advertisement
Advertisement