హైదరాబాద్: ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవించేది హిందూ సమాజమని, అలాగే ప్రపంచానికి దారి చూపగలిగినది కూడా భారతదేశమని రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కాలకూట విషాన్ని కూడా గరళంలో ఉంచుకుని శివుడు ప్రపంచాలను కాపాడాడని, అదేవిధంగా ప్రపంచంలో కలిగే అనేక వికృతులు, విపత్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడగలిగేది భారతదేశమనే విషయాన్ని అన్నీ దేశాలు గుర్తిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ రచించిన విశ్వభారతం గ్రంథ ఆవిష్కరణ సభలో మోహన్ భాగవత్ మాట్లాడారు.
ధర్మానికి కేంద్ర బిందువైన భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడినా నేటివరకు అశాంతి, అలజడితోనే ఉన్నాయని మోహన్ భాగవత్ చెప్పారు. దేశం నుండి విడిపోయిన భూభాగాలు భవిష్యత్తులో తిరిగి భారత్‌లో కలవవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అంతకుముందు ద్వి సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ కార్యక్రమ విశిష్టతను వివరిస్తూ ఈ భూమండలమంతా ఒకప్పుడు భారత ధర్మమే విస్తరించి ఉండేదని చెప్పారు. అటువంటి ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి భుజస్కందాలపైనా ఉందని అన్నారు.
మోహన్ భాగవత్ చేతుల మీదుగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్కృత విశ్వవిద్యాలయం మాజీ డీన్ రాణీ సదాశివ మూర్తి, పద్మశ్రీ బిరుదాంకితులు రమాకాంత్ శుక్లా విచ్చేశారు. ఆర్.ఎస్.ఎస్ నాయకులు శ్యామ్ కుమార్, అఖిలభారతీయ ధర్మజాగరణ సమన్వయ సహసంయోజక్ దూసి రామకృష్ణ, దక్షిణ మధ్య క్షేత్ర సహ సంఘచాలక్ సురేందర్ రెడ్డి, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ సుధీరా, దక్షిణమధ్య క్షేత్ర ప్రచారక్ కాచం రమేష్, తెలంగాణ ప్రాంత కార్యవహ దేవేందర్, తెలంగాణ ప్రాంత ప్రచారక్, అన్నదానం సుబ్రహ్మణ్యం, ఇతర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు.