Abn logo
Sep 21 2021 @ 23:55PM

భారమైపోతున్నదమ్మా!




సచివాలయాలకు నెలకు రూ.5 వేల ఖర్చు

పైసా విదల్చని ప్రభుత్వం

భారం మోయలేమంటున్న పంచాయతీలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

సచివాలయాల నిర్వహణ భారం గ్రామ పంచాయతీలపై పడుతోంది.  స్టేషనరీ, కంప్యూటర్‌, ప్రింటర్లు, బయోమెట్రిక్‌ యంత్రాల నిర్వహణ, నెట్‌ చార్జీలు, కరెంటు బిల్లుకు నెలకు సగటున ఒక్కో సచివాలయానికి రూ.5 వేల వరకూ ఖర్చు అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 1194 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటి పరిధిలో 835 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఏడాదికి జిల్లా వ్యాప్తంగా సచివాలయాల నిర్వహణకు రూ.5 కోట్ల వ్యయం అవుతోంది. ఈ భారం పూర్తిగా గ్రామ పంచాయతీలపైనే పడుతోంది. అరకొర నిధులతో అవస్థలు పడుతున్న గ్రామాల్లో పాలనపై పడుతుందని అధికారులు చెబుతున్నారు. సచివాయాల సేవల ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదని, పంచాయతీలకు అదనపు నిధులు మంజూరు చేయకపోతే వాటి నిర్వహణ మరింత ఇబ్బందిగా మారుతుందనేది అధికారుల వాదన.

సేవా రుసుములు వస్తున్నా

సచివాలయాల ద్వారా 545 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఒక్కో సేవకు ఒక్కో విధంగా రుసుము వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేసిన వాటిని ప్రభుత్వానికి జమ చేస్తున్నారు. కానీ తిరిగి నిధులు సచివాలయాలకు కేటాయించడం లేదు. దీంతో నిర్వహణ భారం పంచాయతీలపైనే పడుతోంది. సచివాలయాల ద్వారా వచ్చే ఆదాయం వినియోగించలేక, వాటి నిర్వహణ భారం మోయలేక పంచాయతీలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. ఆదాయం లేని పంచాయతీల పరిస్థితి మరింత దయనీయం. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు సచివాలయాల నిర్వహణ తలనొప్పిగా మారింది. ప్రజలకు మేలు చేస్తామని వస్తే..ఈ భారం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సచివాలయాల నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. 

పంచాయతీలే భరిస్తున్నాయి

 సచివాలయాల నిర్వహణకు ప్రస్తుతానికి గ్రామ పంచాయతీల్లోని సాధారణ నిధుల నుంచి వెచ్చిస్తున్నాం. విద్యుత్‌, నెట్‌ బిల్లులు, స్టేషనరీ, కంప్యూటర్‌ ప్రింటర్ల మరమ్మతులకు అయ్యే ఖర్చును పంచాయతీ నిధుల నుంచే ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.

వి.రవికుమర్‌, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం.