Abn logo
Oct 22 2021 @ 00:37AM

ఉద్యోగాల పేరుతో రూ.20 లక్షల మోసం

నీటిపారుదలశాఖ ఉద్యోగులపై కేసు నమోదు 


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 21: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి రూ.20 లక్షలు తీసుకుని మోసం చేసిన ఇంజినీరింగ్‌శాఖ సిబ్బంది నిర్వాకం గురువారం వెలుగుచూసింది. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన ప్రకారం.. తిరుపతి ఎస్వీ వైద్యకళాశాల సమీపంలోని నీటిపారుదలశాఖ చీఫ్‌ ఇంజినీరు కార్యాలయంలో నాన్‌ టెక్నికల్‌ విభాగంలో పర్సనల్‌ అసిస్టెంట్‌గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేసిన రమే్‌షబాబు, అతడి డ్రైవర్‌ పురుషోత్తంరెడ్డి నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్ట్‌ భూ నిర్వాసితులకు రావాల్సి ఉద్యోగాలు త్వరితగతిన ఇప్పిస్తామంటూ ఐదుగురి నుంచి డబ్బు వసూలు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన మరళీకృష్ణ, మరో నలుగురు ఒక్కొక్కరు రూ.4 లక్షల చొప్పున రూ.20 లక్షలు ఇచ్చారు. ఎంతకాలమైనా ఉద్యోగాలు ఇప్పించకపోగా డబ్బులు తిరిగివ్వలేదు. దీంతో బాధితులు గురువారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.