Advertisement
Advertisement
Abn logo
Advertisement

వలసదారులకు Driving license.. కువైత్‌లో కొత్త రూల్!

కువైత్‌ సిటీ: వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో గల్ఫ్ దేశం కువైత్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. దీనిలో భాగంగా యూనివర్శిటీ డిగ్రీ ఉండి, నెలకు 600 కువైటీ దినార్ల(రూ.1.49లక్షలు)కు తగ్గకుండా శాలరీ ఉన్న ప్రవాసులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ఇటీవల ట్రాఫిక్ అధికారులతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రవాసులకు మంజూరైన లైసెన్స్‌ల డేటాను సమీక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. 

సంబంధిత మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా వలసదారులకు మంజూరు చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్‌లను ఫిల్టర్ చేయాలని అల్ నవాఫ్ ట్రాఫిక్ రంగాన్ని సూచించారు. వేతనాలకు సంబంధించిన షరతులు, అర్హతలు అలాగే జీతం స్థితికి సంబంధించిన నిబంధనలలో పేర్కొన్న మినహాయింపులతో సహా పలు విషయాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఓ ప్రవాస అకౌంటెంట్ యూనివర్శిటీ డిగ్రీ కలిగి ఉండి, నెలకు 600కేడీ శాలరీ తీసుకుంటున్నాడనుకోండి. కానీ, అతడు రెండో యజమానికి మారే సమయంలో జీతం 400కేడీలకు తగ్గితే ఆ అకౌంటెంట్ డ్రైవింగ్ లైసెల్స్ ఉపసంహరించాల్సి ఉంటుందని ట్రాఫిక్ విభాగానికి అండర్ సెక్రటరీ సూచించారని తెలుస్తోంది. 

దేశంలో గత కొంతకాలంగా భారీగా పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, సాంద్రతను తగ్గించే క్రమంలో కువైత్ ఇలాంటి సంచలన నిర్ణయాలకు శ్రీకారం చూడుతోందని అక్కడి మీడియా చెబుతున్న మాట. ఇక వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ట్రాఫిక్ విభాగం ప్రవాసులే లక్ష్యంగా మూడో దశ 'స్మార్ట్ లైసెన్స్' జారీ ప్రక్రియను మొదలు పెట్టనుంది. దీనిలో భాగంగానే తాజాగా తెరపైకి తెచ్చిన కొత్త రూల్‌ను పరీక్షించాలని అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విధానం కనుక అమలులోకి వస్తే భారీ సంఖ్యలో ప్రవాసులు తమ డ్రైవింగ్ లైసెన్లను కోల్పోవడం ఖాయమని నిపుణుల అభిప్రాయం.   

Advertisement
Advertisement