Abn logo
Oct 9 2020 @ 02:28AM

సర్కార్‌ సారె..!

Kaakateeya

నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

 ఆడపడుచులకు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి 

 తీరొక్క రంగుల్లో చీరల తయారీ


ఆడ పడుచులకు బతుకమ్మ కానుకలు సిద్ధమయ్యాయి. నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి బతుకమ్మ చీరలను పలు రంగుల్లో ఆకట్టుకునేలా తయారు చేశారు. నాణ్యతతో తయారు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వీటిని అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుం టున్నారు. అయితే ఉమ్మడి జిల్లాకు పూర్తిస్థాయిలో చీరలు సరఫరా కాలేదు.


ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ / ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ / ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి / మేడ్చల్‌:  మరో వారంరోజుల్లో ఎంగిలి పూల బతుకమ్మ పండగ రానున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. అయితే మేడ్చల్‌లో ఈనెల 10నుంచి మహిళలకు చీరలు అందించున్నారు. ఆహార భద్రత కార్డు ఉన్న ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ కానుక అందజేయాలన్న లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. తెల్లరేషన్‌కార్డుతోపాటు ఆధార్‌కార్డు వెంట తీసుకొచ్చిన వారికి చీరలు పంపిణీ చేస్తారు. 


వికారాబాద్‌ జిల్లాలో..

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నా ఇంకా వికారాబాద్‌ జిల్లాకు పూర్తిస్థాయిలో చీరలు సరఫరా కాలేవు. 18 సంవత్సరాల వయసు పైబడిన యువతులు, మహిళలు జిల్లాలో 3,16,023 మంది ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇంతవరకు 2,84,013 చీరలు మాత్రమే జిల్లాకు చేరాయి. చీరలను వికారాబాద్‌, చంద్రకల్‌ వ్యవసాయ మార్కెటింగ్‌ గోదాములతోపాటు పరిగిలో ఇండోర్‌ స్టేడియంలో నిల్వ ఉంచారు. గ్రామ కమిటీల ఆధ్వర్యంలో బతుకమ్మ కానులు పంపిణీ చేయనున్నారు.


చీరల పంపిణీ కార్యక్రమం పర్యవేక్షించేందుకు వీలుగా మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని మునిసిపల్‌ పరిధిలో కమిషనర్‌, మండల కేంద్రాల్లో ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పర్యవేక్షించనున్నారు. నేడు వికారాబాద్‌ మునిసిపల్‌ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిసింది. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయనున్నారు.


జిల్లాలో కొవిడ్‌ నేపథ్యంలో వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటిస్తూ ఇంటింటికీ వెళ్లి చీరలు పంపిణీ చేస్తారా, లేక వార్డులు, వీధుల్లో ముఖ్యకూడళ్ల వద్ద లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేయనున్నారా అనేది ఇంకా స్పష్టత లేదు. బతుకమ్మ కానుకలు పంపిణీ చేసేందుకు అర్హులైన మహిళల జాబితాలను మునిసిపాలిటీలకు, గ్రామాలకు అందజేశారు.


రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి బతుకమ్మ చీరలను అందజేయాలని యోచిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అవకాశాన్ని బట్టి గ్రామ పంచాయతీల ద్వారా చీరలను పంపిణీ చేసేందుకు ప్రణాళిక రెడీ చేసుకున్నారు.


ప్రతి జీపీలో ఓ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు నేడు మహిళలకు చీరలను పంపిణీ చేయను న్నారు. రంగారెడ్డి జిల్లాలో 919 రేషన్‌ షాపులు ఉన్నాయి. 6,76,332 మందిని అర్హులుగా గుర్తించారు. ఇప్పటివరకు 4,96,000 చీరలు జిల్లాకు చేరగా.. వాటిని అన్ని మండలాలకు పంపించారు. 


మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ జిల్లాలో రేపటి నుంచి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. మంత్రి మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేల చేతులమీదుగా ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దనే మహిళా సంఘాల ఆధ్వర్యంలో చీరలను అందించాలని నిర్ణయించారు. మిగిలినవారెవరైనా ఉంటే రేషన్‌ షాపుల ద్వారా 15వ తేదీలోగా పంపిణీ పూర్తి చేస్తారు. జిల్లాలో 636 రేషన్‌ దుకాణాలుండగా.. 6,58,851మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇప్పటివరకు 3,84,168 చీరలు వచ్చాయి.


శామీర్‌పేట, కుత్భుల్లాపూర్‌, కాప్రాలో స్టాక్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బతుకమ్మ చీరలు శామీర్‌పేటలోని గోదాంకు చేరుకున్నాయి. అక్కడి నుంచి మేడ్చల్‌, కీసర, ఘట్‌కేసర్‌ మండలాలకు చీరలను చేరవేయనున్నారు.

Advertisement
Advertisement