Abn logo
Oct 8 2020 @ 05:28AM

ఆడిట్‌లో అక్రమాలు!

Kaakateeya

 అమ్యామ్యాలతో పంచాయతీలకు క్లీన్‌చిట్‌ ఇస్తున్నట్లు ఆరోపణలు

 ఖర్చు చేసిన నిధుల్లో నాలుగుశాతం వరకు కమీషన్‌ 

 వసూలు చేసిన డబ్బులు రూ.కోట్లలో..


పరిగి : అక్రమాలను వెలికి తీయాల్సిన వాళ్లే అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్రామపంచాయతీల్లో నిధుల ఖర్చు లెక్కగట్టి మరీ కమీషన్లు వసూలు చేస్తున్నారు. పంచాయతీల్లోని నిధులు ఖర్చులపై జరుగుతున్న ఆడిటింగ్‌లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్లు ఇవ్వకపోతే ఇబ్బందులకు గురిచేస్తున్నారని వికారాబాద్‌ జిల్లాలోని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


18మండలాల్లో 565 పంచాయతీలు ఉన్న సంగతి విధితమే. నెలరోజులుగా జిల్లాలోని పంచాయతీల్లో ఆడిట్‌ జరుగుతోంది. కొన్ని పంచాయతీల్లో గతంలోని సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు నిధుల ఖర్చు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయితే ఫిర్యాదులు అందిన పంచాయతీల్లో కూడా కమీషన్‌ తీసుకుని ఆడిట్‌ అధికారులు క్లీన్‌చిట్‌ ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమ్యామ్యాలకు అలవాటుపడిన అధికారులు అడిగిన మేరకు సర్పంచులు ముడుపులు ముట్టజెప్పడంతో అంతా సవ్యంగా ఉందని తేల్చిపారేస్తున్నారు. 


కమీషన్‌ ఇస్తే అంతా సవ్యమే..

పెద్ద, చిన్న పంచాయతీలు అని తేడా లేకుండా ఆడిటింగ్‌కు వెళ్లిన అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందే.. లెక్కలు మొత్తం చూసిన తర్వాత అధికారులు బేరాలు ఆడటం మొదలు పెడుతున్నారట. దీంతో తమ పంచాయతీల్లో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా ఉండాలంటే ముడుపులు ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇలా ప్రతి పంచాయతీలో ఖర్చయిన నిధుల ప్రకారం రెండు నుంచి నాలుగు శాతం వరకు కమీషన్‌ అడుగుతున్నారని చెబుతున్నారు.


ఒకవేళ ఎవరైనా పరపతి వాడినా, లేక తాము చెప్పిన కమీషన్‌కు అంగీకరించకపోయినా అవకతవకలు బయటపెడతామని బెదిరి స్తున్నట్లు తెలుస్తున్నది. చివరికి ఎంతో కొంత బేరమాడి అందినకాడికి దండుకుని లెక్కలు మార్చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అడిగినన్ని డబ్బులు ఇస్తే పంచాయతీలకు రాకుండానే ఆడిట్‌ పూర్తి చేస్తు న్నారు. మండల పరిషత్‌ కార్యాలయాల్లో, లేదా జిల్లాలో ఉండే వారి కార్యాలయాల దగ్గరకు రప్పించుకుని కూడా ఆడిట్‌ ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం. కమీషన్‌లో తమ ఉన్నతాధికారులకు కూడా వాటాలు ఇవ్వాలని సదరు ఆడిట్‌ అధికారులు చెబుతుండడం గమనార్హం.


ఇలా జిల్లావ్యాప్తంగా పెద్ద, చిన్న అనే తేడా లేకుండా పంచాయతీల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా వసూలైన డబ్బు కోట్లలో ఉంటుందని కొందరు సర్పంచులు చెబుతున్నారు. వికారాబాద్‌ జిల్లాలోని అన్ని పంచాయతీల్లో కలిపి రూ.70 నుంచి రూ.80 కోట్ల నిధుల వరకు ఆడిట్‌ చేసినట్లు సమాచారం. అయితే ఈ లెక్కన జిల్లాలో మూడు కోట్లకుపైగా కమీషన్‌ రూపంలో అధికారులు వసూలు చేశారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 


ట్రాక్టర్ల కొనుగోలులో కూడా..

ట్రాక్టర్ల కొనుగోళ్లకు ఉపయోగించిన ఖర్చును కూడా పంచాయతీ నిధుల లెక్కలోకి తెచ్చి అధికారులు ఆడిట్‌ చేస్తున్నారు. ట్రాక్టర్ల కొనుగోలు లెక్కలపై కూడా కమీషన్‌ తీసు కుంటున్నారని కొందరు సర్పంచులు తమ తోటి ప్రజాప్రతినిధులతో చెప్పు కుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పంచాయతీ నుంచి ట్రాక్టర్‌ కొనుగోలుపై కచ్చితంగా ఆడిట్‌ చేయాలన్న నిబంధనలు లేవని కొందరు అధికారులు చెబుతున్నారు. దీనిపై సర్పంచ్‌లు వారించినా ఒక్కో ట్రాక్టర్‌పై రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


పంచాయతీలో పని చేసే సిబ్బంది జీతాలు మినహా మిగిలిన అన్ని ఖర్చులను లెక్కించి కమీషన్‌ వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడిన కొందరు ప్రజాప్రతినిధులు ముందుగానే సంబంధిత అధికారులకు అడిగినంతా ముట్టజెప్పి విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈవిషయాలు ఇతర ప్రతినిధులు, ఎమ్మెల్యేలకు తెలిసినా నేరుగా వారిని మందలించలేకపోతున్నారని, ఒకవేళ మందలిస్తే తమ అనుచరగణమైన సర్పంచులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండడంతో మౌనంగా ఉంటున్నారు. 


కొన్నిచోట్ల ఇలా..

వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలోని ఓ పంచాయతీలో రూ.25 లక్షల ఖర్చులకు ఆడిట్‌ చేస్తే రూ.60 వేలు తీసుకున్నారని సమాచారం. మరో పంచాయతీలో నిధుల ఖర్చుపై సరైన వివరాలు లేని కారణంగా సదరు సర్పంచ్‌తో బేరమాడి రూ.80 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. పరిగి మండలంలోని ఓ పంచాయతీలో రూ.16 లక్షల ఆడిట్‌కు రూ.50వేలు, కులకచర్ల మండలంలోని ఓ పెద్ద పంచాయతీలో రూ.90వేలు వసూలు చేశారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కేవలం ఒకటి, రెండు పంచాయతీల్లోనే కాదు, జిల్లాలోని అన్నిపంచాయితీల్లో వసూలు చేసినట్లు సమాచారం. ఇలా వసూలు చేసిన ముడుపులు కోట్లలోనే ఉంటాయని చెబుతున్నారు.


డబ్బులు ఎవరికీ ఇవ్వొద్దు..వీరభద్రయ్య, జిల్లా ఆడిట్‌ అధికారి

పంచాయితీల్లో ఆడిట్‌ విషయంలో అధికారులెవరికీ డబ్బులు ఇవ్వొద్దు. ట్రాక్టర్ల నిఽధులకు సంబంధించి కూడా ఆడిట్‌ చేసుకోవాల్సిందే. తమ సిబ్బంది డబ్బులు అడుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆధారాలతో తనకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఆడిట్‌లో వాస్తవాలనే పరిశీలిస్తారు.  

Advertisement
Advertisement