Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేమూరు నుంచి.. చెన్నై రాజ్‌భవన్‌ వరకు..

 • అనంత లోకాలకు.. అజాతశత్రువు
 • గంభీరమైన స్వరం ఆయన సొంతం.. 
 • ఏ అంశమైనా అనర్గళంగా మాట్లాడగల పరిజ్ఞానం..
 • అందరినీ కలుపుకొని పోయే తత్వం.. 
 • ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సుగుణం.. 
 • ఆత్మీయ పలకరింపే ఆయన ఆభరణం 
 • ఆదర్శనీయమైన సుదీర్ఘ జీవన ప్రయాణం..  
 • జాతీయస్థాయిలో జిల్లాకే వన్నె తెచ్చిన కొణిజేటి రోశయ్య మరిక లేరు..!

 

ఆయన కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. అయినా సరే... మారుమూల గ్రామం వేమూరు నుంచి చెన్నై రాజభవన్‌ వరకు ఆయన ప్రస్థానం అద్భుతంగా సాగింది. అపర చాణక్యుడు.. రాజకీయ దురంధరుడు, పెద్దాయనగా అందరి చేత మన్ననలు అందుకున్న ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా తెలుగు జాతి గర్వించే విధంగా పనిచేశారు. ఆయనే మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా ఉన్నత పదవులను అధిరోహించిన ఆయన శనివారం ఉదయం అకస్మాత్తుగా నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. జిల్లావాసులకు, అభిమానులకు శోకాన్ని మిగిల్చారు. 


 • మారుమూల వేమూరు నుంచి.. చెన్నై రాజ్‌భవన్‌ వరకు..
 • విభిన్న పదవుల్లో ప్రతిభావంతుడు కొణిజేటి రోశయ్య
 • ఆచార్య ఎన్జీ రంగాకు అనుంగు శిష్యుడు
 • హిందూ కళాశాలలో విద్యాభ్యాసం
 • గుంటూరులో రాజీవ్‌గాంధీ భవన్‌ నిర్మాణంలో ప్రముఖ పాత్ర
 • అందరివాడిగా తెలుగు ప్రజల ఆదరాభిమానాలు
 • రోశయ్య మరణంతో జిల్లా ప్రజల దిగ్ర్భాంతి

 

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, డిసెంబరు4: రాజకీయంగా ఎటువంటి గాడ్‌ఫాదర్లు లేకుండా కేవలం తన ప్రతిభ ఆధారంగా జిల్లాలో ఎవరూ నిర్వహించనన్ని పదవులు నిర్వహించటమే కాకుండా వాటికి వన్నె చేకూర్చి ఆయా పదవుల్లో ప్రతిభావంతుడిగా దివంగతనేత కొణిజేటి రోశయ్య రాణించారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రోశయ్య ఎన్నో పదవులను అలంకరించి గుంటూరు జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటారు. 


కుటుంబ నేపథ్యం..

వేమూరు గ్రామంలో 1933 జూలై 4న సుబ్బయ్య, ఆదెమ్మ దంపతులకు జన్మించిన రోశయ్య ప్రాఽథమిక విద్యను పెరవలిలో ప్రారంభించి కొల్లూరులో పదవ తరగతి వరకు చదివారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్‌ తరువాత కామర్స్‌లో డిగ్రీ చేశారు. ఆయన తన స్నేహితుడు తిమ్మారెడ్డితో కలసి స్వాతంత్య్ర సమరయోధుడు, కర్షక నేత ఎన్జీ రంగాతో శిష్యరికం చేసి రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారు. మధ్య తరగతికి చెందిన ఆయన చదువుకుంటున్న సమయంలోనే తెనాలికి చెందినబంధువుల అమ్మాయి శివలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు శివ సుబ్బారావు, త్రివిక్రమ్‌రావు, శ్రీమన్నారాయణమూర్తి,  కుమార్తె రమాదేవి ఉన్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా స్వయంశక్తితో ఎదిగిన రోశయ్య తెలుగు రాష్ర్టాల్లో ఉత్తమ రాజకీయవేత్తగా, అందరివాడిగా ప్రశంసలు దక్కించుకున్నారు.

జిల్లా రాజకీయాల్లో ఆచితూచి..

 మంత్రిగా, ఎంపీగా, సీఎంగా, గవర్నర్‌గా కొనసాగినా జిల్లా రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరించారు. కాబినెట్‌ మంత్రిగా ఉన్నా జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. రెండుసార్లు చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన జిల్లా రాజకీయాల్లో అనుచరులను కూడా ఏర్పాటు చేసుకోలేదు. టీడీపీ ఆవిర్భావానికి ముందు జిల్లాలో కాంగ్రెస్‌ రాజకీయాల్లో చేబ్రోలు హనుమయ్య, కాసు, రాయపాటి వర్గాలకు సమదూరంగా హైకమాండ్‌కు అనుకూలంగా వ్యవహరించారు. ప్రధానంగా 1980లో మంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి సీఎంగా బాధ్యతలు స్వీకరించేవరకు జిల్లా వ్యవహారాల్లో వేలుపెట్టలేదు. డీసీసీ కార్యాలయం రాజీవ్‌గాంధీభవన్‌ నిర్మాణంలో కీలకపాత్ర వహించినా... పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు.  


ప్రత్యర్థులకు ముచ్చెమటలే..

రోశయ్య ఇంట గెలిచి రచ్చ గెలిచిన నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి గుర్తింపు పొందారు. స్వపక్షంలో ఉంటే విపక్షాన్ని, విపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని రాజకీయ విజ్ఞతతో ముడివేసి ముచ్చెమటలు పట్టించడం రోశయ్యకే చెందింది.  ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తన వాగ్ధాటి, సమయస్ఫూర్తితో ఆయా పదవులకు వన్నె తెచ్చిన ఘనత రోశయ్యకే దక్కింది. రంగా శిష్యుల్లో ప్రత్యేకత కలిగిన నందిపాటి వీరాచారి, రోశయ్యల ఉపన్యాసాలు వినేందుకు కమ్యూనిస్టులు సైతం వీరి సభలకు వచ్చే వారంటే వారి ఉపన్యాస శైలిని చెప్పనక్కర్లేదు.  


 సొంత ఊరితో అనుబంధం

తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన అనంతరం రాజకీయాలకు దూరంగా కుటుంబ సభ్యులతో కలిసి పుట్టి పెరిగిన గ్రామంపై మక్కువతో అప్పుడప్పుడు వేమూరుకు విచ్చేసి తాను నిర్మించుకున్న ఇంటిలో ఒకటి రెండు రోజులు ఉండటంతో పాటు తాను కులదైవంగా పూజించే లక్ష్మీగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. ఆయన ఏ శుభకార్యం జరుగుతున్నా ముందుగా వేమూరుకు విచ్చేసి బంధుమిత్రులను కలిసి సంప్రదాయ బద్ధంగా ఆ కార్యక్రమాలను తన ఇంటిలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. 

  

రాజీవగాంధీ భవన్‌ నిర్మాణంలో కీలక పాత్ర

కొణిజేటి రోశయ్య ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించే సమయంలో తన సొంత జిల్లాల కాంగ్రెస్‌ పార్టీకి ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని తలంచారు. అప్పటివరకు కాంగ్రెస్‌పార్టీకి జిల్లా కేంద్రంలో సొంత కార్యాలయం లేదు. రాజీవ్‌ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి తాను చైర్మన్‌గా వ్యవహరించి కార్యాలయం నిర్మాణానికి విరాళాలు సేకరించారు. 1987లో శంకుస్థాపన గావించి మూడేళ్ల తరువాత ప్రారంభం చేసి కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా కేంద్రంలో  సొంత భవనం సమకూర్చిపెట్టారు. దానికే రాజీవ్‌ గాంధీగా నామకరణం చేశారు.  

    

జీవిత సాఫల్య పురస్కారం

2018 ఫిబ్రవరి 11న పి.సుబ్బరామిరెడ్డి లలితా కళాపరిషత్‌ ఆధ్వర్యంలో రోశయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రోశయ్యకు స్వర్ణ కంకణం బహూకరించారు. రోశయ్య బహుముఖ ప్రజ్ఞతను, కార్యదక్షతను కొనియాడారు. కొణిజేటి రోశయ్యను ఆంధ్రాయూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 

 

నమ్మిన బంట్లుగా రాధా, రామ్‌భాస్కర్‌ 

జిల్లాలో రోశయ్యకు నమ్మినబంట్లుగా బిజినేపల్లి రాధాకృష్ణమూర్తి, రామ్‌భాస్కర్‌లు కొనసాగారు. రోశయ్య పదవిలో ఉన్నా లేకపోయినా రాధా, రామ్‌ భాస్కర్‌లు సన్నిహిత శిష్యులుగా మెలిగారు. రోశయ్య గుంటూరు వచ్చారంటే వీరిద్దరు పక్కనే వుంటారు.

Advertisement
Advertisement