Abn logo
Jul 11 2020 @ 22:26PM

అమెరికాలో మళ్లీ పూర్తిస్థాయి ఆంక్షలు విధించాలంటున్న నిపుణులు

వాషింగ్టన్: అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికా వ్యాప్తంగా 66,627 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క ఒకేరోజు కరోనా కారణంగా 802 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో మరోమారు పూర్తిస్థాయి ఆంక్షలు విధించాలంటూ గవర్నర్లపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికాలో మరోమారు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలంటూ ప్రముఖ వైద్యనిపుణులు ఆంటని ఫాసీ సూచించడంతో దేశవ్యాప్తంగా ఇదే మాట వినిపిస్తూ వస్తోంది. గతంలో అత్యవసర సేవలకు తప్ప మిగతా వ్యాపార కార్యకలాపాలను మూసివేయడం వల్ల లక్షలాది మంది కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 


దీంతో అమెరికాలో మరోమారు ఆంక్షలు విధిస్తేనే కరోనా కేసులు తగ్గే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలో ముఖ్యంగా అరిజోనా, ఫ్లోరిడా, లూజియానా, సౌత్ కెరోలినా, జార్జియా రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారాయి. ఈ రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడాన్ని ఆప్షన్‌గా చూడకూడదని.. ఆంక్షలను తప్పనిసరి చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆయా రాష్ట్రాల గవర్నర్లు మాత్రం లాక్‌డౌన్ విధించడానికి సుముఖంగా లేరు. ఆర్థిక రంగాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని వారంతా లాక్‌డౌన్ విధించడానికి ఇష్టపడటం లేదు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 33,18,707 కేసులు నమోదు కాగా.. కరోనా కారణంగా ఇప్పటివరకు 1,36,995 మంది మరణించారు. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు దాదాపు పది లక్షల మంది పూర్తిగా కోలుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement