Abn logo
Sep 8 2020 @ 04:25AM

రెవెన్యూ ప్రక్షాళన షురూ

Kaakateeya

వీఆర్వో వ్యవస్థ రద్దుకు సర్కార్‌ మంగళం

ఉద్యోగుల్లో మొదలైన ఆందోళన

వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులన్నీ స్వాధీనం

సందడిగా మారిన తహసీల్దారు కార్యాలయాలు

ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన రిజిస్ర్టేషన్లు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రెవెన్యూ శాఖలో ప్రక్షాళన షురూ అయింది. ఇందులోభాగంగా సీఎం కేసీఆర్‌ వీఆర్వో వ్యవస్థ రద్దుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ అన్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్వోల నుంచి అన్నిరకాల రికార్డులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈనేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వీఆర్వోల నుంచి పాత పహాణీలు, ఆర్వోఆర్‌, వన్‌బి, ముటేషన్‌, రికార్డు రూము రిజిష్టర్లు, గ్రామమ్యాప్‌, పెండింగ్‌లో ఉన్న విచారణ పైల్స్‌, విచారణ పూర్తయిన ఫైల్స్‌, కుల ఆదాయ తదితర అన్ని రకాల సర్టిఫికెట్స్‌ లాంటి అన్ని రికార్డుల ఒరిజినల్స్‌ జిరాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు.


రంగారెడ్డి జిల్లాలో 606 రెవెన్యూ గ్రామాల్లో 282 మంది వీఆర్వోలు, 842మంది వీఆర్‌ఏల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. అలాగే మేడ్చల్‌ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 165 రెవెన్యూ గ్రామాలున్నాయి. ప్రస్తుతం 94 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. వీరంతా తహసీల్దార్లకు అన్ని రకాల రికార్డులను అప్పగించారు. వికారాబాద్‌ జిల్లాలో 501 రెవెన్యూ గ్రామాలు, 240 క్లస్టర్లు ఉండగా 192 మంది వీఆర్వోలు, 796 మంది వీఆర్‌ఏలు తహసీల్దారులకు రికార్డులను అప్పగించారు. 


‘సందడి’గా తహసీల్దారు కార్యాలయాలు

తహసీల్దారు కార్యాలయాలు సోమవారం సందడిగా మారాయి. అన్ని రకాల రికార్డులు అప్పగించాలని వీఆర్వోలను ప్రభుత్వం ఆదేశించడంతో వారు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇతర పనులు ఏవీ ముట్టుకోలేదు. ఫైల్స్‌ చేత పట్టుకుని తహసీల్దారు కార్యాలయం వద్దకు వెళ్లారు. ఒక్కసారిగా వీఆర్వోలంతా వెళ్లడంతో అక్కడ హడావిడిగా కనిపించింది. కొన్నిచోట్ల కార్యాలయ తలుపులు మూసుకుని రికార్డులు సరిగ్గా ఉన్నాయా? లేవా అని వీఆర్వోలు చెక్‌ చేసుకోవడం కనిపించింది. 


ఉద్యోగుల్లో మొదలైన ఆందోళన..

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు వీఆర్వోగా పనిచేసిన వారంతా ఇదే శాఖలో ఉంటారా? లేక ఇతర శాఖల్లోకి బదలాయిస్తారా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.  వీర్వోలు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. చాలాచోట్ల లంచాలు తీసుకుని ఏసీబీకి పట్టుబడిన సంఘటనలున్నాయి. రికార్డులు తారుమారు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ వీఆర్వో వ్యస్థను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


నిలిచిపోయిన రిజిస్ర్టేషన్లు..

విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్ల విషయంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రిజిస్ర్టేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ-స్టాంపుల విక్రయాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ఇప్పటికే చలానాలు చెల్లించిన వారికి ఒక్కరోజు రిజిస్ర్టేషన్లు చేసుకునే అవకాశం కల్పించారు.  


రిజిస్ర్టేషన్‌ శాఖకు సెలవులు..

ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ శాఖకు సెలవులు ప్రకటించింది. నేటి నుంచి సెలవులు వర్తించనున్నాయి. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. 


ఈ రోజు సెలవా?..కార్యాలయం మూసేశారు


బషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతుల చర్చలు

బషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం 11.30 గంటలకు మూసి ఉంచడంపై కిటికిలోంచి చూస్తున్న ప్రజలు


బషీరాబాద్‌ : ఈ రోజేమైనా సెలవా..? తహసీల్దార్‌ కార్యాయలం పనివేళలో మూసేశారంటూ ఇక్కడికి వచ్చిన రైతులు పలువురు చర్చించుకున్నారు.. వివిధ పనుల నిమిత్తం సోమవారం ఆయా గ్రామాల నుంచి బషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన రైతులకు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ప్రధాన డోరు మూసి కనిపించింది. ఇదేమిటి కార్యాలయం తెరుచుకోలేదంటూ కిటికీ లోంచి చూడగా వీఆర్వోలు రికార్డులు మూటకడుతూ హడావిడిగా కనిపించారు. దీంతో లోపలున్న అధికారులను ప్రజలు, రైతులు ఆరా తీశారు. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తుండటంపై సంబంధిత వీఆర్వోలకు ఈరోజు రికార్డులు అప్పగించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుసుకున్న ప్రజలు చెట్ల కింద సేదతీరుతూ కనిపించారు. మధ్యాహ్నం తర్వాత తహసీల్దార్‌ షౌఖత్‌అలీకి రెవెన్యూ మ్యానువల్‌ రికార్డులను వీఆర్వోలు స్వయంగా అందించారు.


రెవెన్యూ రికార్డులన్నీ స్వాఽధీనం చేసుకున్నాం..మోతీలాల్‌, జిల్లా అదనపు కలెక్టర్‌, వికారాబాద్‌ 

ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఆర్‌వోల నుంచి రెవెన్యూ రికార్డులన్నీ స్వాఽధీనం చేసుకున్నాం. మండలాల్లో వీఆర్‌వోలు తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లకు తమ రికార్డులు అప్పగించగా, వారు వీఆర్‌వోల నుంచి తాము స్వాధీనం చేసుకున్న రికార్డుల వివరాలను నమోదు చేసుకున్నారు. వీఆర్‌వోల నుంచి సేకరించిన రికార్డుల వివరాలను ప్రభుత్వానికి పంపించాము. 


నా.. సొంత భూమి విషయంలో అధికారుల చుట్టూ తిరిగా..నాగారాజు. వీఆర్‌వో, ఆమ్డాపూర్‌, మొయినాబాద్‌

రెవెన్యూశాఖలో ఉన్న లొసుగుల వల్ల అనేక సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి. గతంలో నేను కూడా సొంత భూమి విషయంలో అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. వాస్తవానికి గ్రామ రెవెన్యూ అధికారులపై రెవెన్యూ పరంగానే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. గతంలో ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా గ్రామాల్లోని భూసమస్యలను గుర్తించి పరిష్కరిం చేందుకు పట్టాదారుల నుంచి అభ్యంతరాలను తీసుకునేందుకు అవకాశం కల్పించింది. అయినా సమస్యలు పరిష్కారం కాలేదు. రెవెన్యూశాఖలో కొందరు చేసిన తప్పులకు అందరినీ బలి చేయడం సరికాదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం లేదు. సరైన నిర్ణయం కాదు.. ప్రశాంతి, వీఆర్‌వో, గోధుమగూడ, వికారాబాద్‌ మండలం 

ప్రభుత్వం ఒక్కసారిగా మా ఉద్యోగ వ్యవస్థను రద్దు చేస్తూ సాయంత్రం వరకు రికార్డులు అప్పగించాలని చెప్పడం సరైన నిర్ణయం కాదు. రికార్డులు అప్పగించేందుకు మరికొంత సమయం ఇచ్చి ఉంటే, ఉన్నంత వరకు అన్ని పనులు పకడ్బందీగా చేసి ఇచ్చే వారం. ఎవరో ఒకరు చేసిన తప్పునకు మొత్తం వ్యవస్థను తప్పుపట్టడం సరైనది కాదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగులుగా తమను ఎక్కడ పనిచేయమని చెబితే అక్కడ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 


ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం..వెంకటయ్య, వీఆర్‌వో, వికారాబాద్‌  

ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. రెవెన్యూ శా ఖను ప్రక్షాళన చేసే క్రమంలో వీఆర్‌వో వ్యవస్థను పూర్తిగా తొలగించడం సరైనది కాదు. ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ ఒక్కసారిగా విధుల నుంచి తప్పుకోవడం కొంత బాధగానే ఉంది. మాకు ఏ పని చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. 

Advertisement
Advertisement