Abn logo
Jul 12 2020 @ 08:10AM

మాస్కు ధరించలేదని దాడి

ఘర్షణలో యువతి మృత్యువాత


రెంటచింతల(గుంటూరు): మాస్కు ధరించలేదంటూ ఓ కుటుంబంపై కొందరు జరిపిన దాడిలో ఓ యువతి మృతి చెందింది. ఈ దాడి ఘటన ఎనిమిది రోజుల క్రితమే జరగ్గా, గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలి మృతితో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం, రెంటచింతల మండల కేంద్రంలో ఉంటున్న కర్నాటి యలమంద రిక్షా కార్మికుడు. ఈ నెల 3న నోటికి మాస్క్‌ ధరించకుండా ఆయన బజారుకు వెళ్లారు. అన్నపరెడ్డి మల్లికార్జున, శ్రీను, వెంకటేశ్‌, సాంబ అనే నలుగురు స్థానికులు యలమందను దీనిపై మందలించారు.


అంతటితో ఆగకుండా.. అదే రోజున యలమంద ఉండే బజారులో ఆ నలుగురు మాస్కు లేకుండా తిరిగారు. యలమంద భార్య భూలక్ష్మి వారిని ఇదే విషయమై నిలదీసింది. దీనిపై మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. యలమంద కుటుంబంపై ఆ నలుగురు కర్రలతో దాడిచేశారు. వారికి సర్దిచెప్పడానికి యలమంద కుమార్తె ఫాతిమా(19) ప్రయత్నించారు. ఈ క్రమంలో కర్ర దెబ్బలు ఆమె తలకు బలంగా తగిలాయి. అప్పటినుంచి జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె మరణించారు. దాడి చేసిన నిందితులపై హత్య కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement