Abn logo
Oct 22 2020 @ 00:42AM

దరఖాస్తుల వెల్లువ

Kaakateeya

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు

నియోజకవర్గంలో 1,85,803 దరఖాస్తులు

ఉమ్మడి రంగారెడ్డిలో 1,06,452 దరఖాస్తులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులందరూ నవంబర్‌ 6వ తేదీలోగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ సూచించడంతో అర్హత ఉన్నవారంతా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందులో ఎక్కువమంది ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకుంటున్నారు.


అయితే ఉమ్మడిరంగారెడ్డిజిల్లా నుంచే అత్యధికంగా దరఖాస్తులు అందాయి. నియోజకవర్గంలో బుధవారం వరకు 1,85,803 దరఖాస్తులు రాగా, ఇందులో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచే 1,06,452 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 55,535 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా హైదరాబాద్‌ జిల్లా నుంచి 23,816 మంది దరఖాస్తు చేసుకున్నారు. గడిచిన 10 రోజులుగా హైదరాబాద్‌ మహానగరంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్తంభించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇక్కడ నుంచి పెద్దగా దరఖాస్తులు రాలేదు. కొత్త జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా రంగారెడ్డిజిల్లా నుంచి 56,961 మంది దరఖాస్తు చేసుకోగా, మేడ్చల్‌ జిల్లా నుంచి 37,726 మంది, వికారాబాద్‌ జిల్లా నుంచి 11,765 మంది దరఖాస్తు చేసుకున్నారు. అతి తక్కువగా నారాయణపేట జిల్లా నుంచి 5,722 మంది దరఖాస్తు చేసుకున్నారు. గడువు సమయం దగ్గర పడుతుండడంతో దరఖాస్తులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 10వేలకుపైగానే దరఖాస్తులు అందాయి. 


ఈసారి 4లక్షలకుపైగానే ..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఈసారి ప్రధాన పార్టీలన్నీ కూడా సవాల్‌గా తీసుకుంటున్నాయి. దీంతో పోటీ పడి ఓటర్లను నమోదు చేయిస్తున్నాయి. ఇందుకోసం టీమ్‌లను కూడా ఏర్పాటు చేశాయి. అలాగే స్వతంత్రులుగా బరిలో దిగాలని భావిస్తున్న మరికొందరు  ఓటర్ల నమోదు కోసం శ్రమిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహులు కార్యకర్తలను, వాలంటీర్లను రంగంలో దింపి ఓటర్లను నమోదు చేయిస్తున్నారు.


ఓటర్ల నమోదుపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అధికారపార్టీ స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు టార్గెట్లు ఇచ్చి.. ఈమేర ఓటర్లను నమోదు చేయించాలని ఆదేశించింది. దీంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులంతా కార్యరంగంలో దిగారు. ఓటర్ల నమోదుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అలాగే మిగతా పార్టీలు కూడా దాదాపు ఇదే ప్రయత్నంలో ఉన్నాయి. దీంతో ఈసారి పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 4లక్షలు దాటే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడిరంగారెడ్డిజిల్లాలో లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 2.96లక్షల మంది ఓటర్లు ఉండగా, కేవలం 1.13 లక్షలు మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Advertisement
Advertisement