Abn logo
Feb 16 2021 @ 12:29PM

మైగ్రేన్‌ తలనొప్పి, కారణాలు, చికిత్స!

ఆంధ్రజ్యోతి(16-02-2021)

తరచుగా వేధిస్తూ, తట్టుకోనేంత బాధించే తలనొప్పి మైగ్రేన్‌ లేదా పార్శ్వపు నొప్పి. ఈ నొప్పి సాధారణ తలనొప్పిగా భావించకుండా వైద్యులను సంప్రతించి సరైన చికిత్స తీసుకోవాలి. 


మైగ్రేన్‌ తలనొప్పి అంటే?

తలలోని రక్తనాళాల మీద ఒత్తిడితో మొదలయ్యే మైగ్రేన్‌ నొప్పి నరాలకు సంబంధించిన వ్యాధి. తలలో ఓ వైపు మాత్రమే వేధిస్తుంది కాబట్టి పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు. తరచూ వచ్చే ఈ నొప్పి తీవ్రత ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉండే వీలుంది. పురుషుల్లో కంటే స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువ. 


లక్షణాలు

4 నుంచి 72 గంటల పాటు వేధించే ఈ నొప్పి లక్షణాలు ఇవే!


తలనొప్పి ఓ వైపు మాత్రమే ఉండడం


చీకాకు, మానసిక స్థితి సరిగా ఉండకపోవడం


ఎండ, శబ్దాలతో సమస్య తీవ్రమవడం


వాంతి చేసుకోవడం, వాంతి వస్తున్న భావనకు గురికావడం


ఈ నొప్పితో దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలగడం


కంటిచూపు సరిగా ఉండకపోవడం


కారణాలు

అనవసరపు ఆలోచనలతో గతం గురించి తీవ్రంగా ఆలోచించేవారికి ఈ సమస్య రావచ్చు. నిద్రలేమి, డిప్రెషన్‌, ఎక్కువసేపు ఎండలో ఉండడం, మహిళల్లో హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే సమయాలైన బహిష్టుకు ముందు లేదా తర్వాత ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణించేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. మైగ్రేన్‌ వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. ఈ సమస్య ఉంటే న్యూరోఫిజీయన్‌ను సంప్రతించాలి. ఎమ్మారై/సిటి స్కాన్‌, రక్తపరీక్షలు, ఇఇజి స్కాన్‌తో సమస్యను నిర్థారించుకోవచ్చు. ఈ సమస్యకు పూర్తి చికిత్స లేకపోయినా, ఉపశమనానికి చికిత్సలు ఉన్నాయి. 


ఇంటి చిట్కాలు

చీకటి గదిలో ఎటువంటి శబ్దాలు లేకుండా నిద్రపోవడానికి ప్రయత్నించాలి


చల్లని వస్తువులు, ఐస్‌ ప్యాక్‌ నుదుటి మీద పెట్టుకోవాలి.


ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.



ఆహారపు అలవాట్లు

పుదీనాలోని మెంథాల్‌కు మైగ్రేన్‌ తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి ఆహారంలో పుదీనా చేర్చుకుంటూ ఉండాలి.


అల్లంలోని జింజెరాల్‌ అనే రసాయనం కూడా మైగ్రేన్‌ను తగ్గిస్తుంది. కాబట్టి అల్లం కూడా ఆహారంలో చేర్చుకోవాలి.


మెగ్నీషియం ఎక్కువగా ఉండే పాలకూర, చిలకడదుంపలు తీసుకోవాలి.


ఈ ఆహారం తీసుకుంటూ, లక్షణాలు కనిపించినప్పుడు న్యూరోఫిజీయన్‌ను కలవాలి.

డాక్టర్‌ దుత్తా ప్రవల్లిక,

కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌, రెనోవా నీలిమా హాస్పిటల్స్‌,

(ఎమ్‌డి ఇంటర్నల్‌ మెడిసిన్‌)

డిఎమ్‌ న్యూరాలజీ (నిమ్స్‌)

ఫోన్‌: 18005998989, 9121012265