మాట్లాడుతున్న ఆర్డీవో ఖాజావలి
ఆర్డీవో ఖాజావలి
మచిలీపట్నం టౌన్, జనవరి 17 : పేదరికం చదువుకు అడ్డం కాదని, విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగితే విజయాలు సాధించ వచ్చని ఆర్డీవో ఖాజావలి అన్నారు. సర్వశిక్షా అభియాన్ నేతృత్వంలో ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థుల ప్రేరన కార్యక్రమంలో ఆర్డీవో ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. తన తండ్రి టైలరింగ్ చేసే వారని, తల్లి కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించే వారన్నారు. తండ్రి అనారోగ్యం కారణంగా తల్లి కూలి పని చేసిన సంపాదనతో తాను చదువుకున్నానన్నారు. కుటుంబ పోషణ కోసం తాపీ పనికి సైతం వెళ్లానన్నారు. కొంత మంది దాతల సహకారంతో ఇంటర్, బీఏ చదువుకున్నానన్నారు. పిల్లలకు ట్యూషన్ చెబుతూ విద్యను కొనసాగించానన్నారు. ముందుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టానని, ఆ తరువాత గ్రూప్స్ రాసి ఆర్డీవో స్థాయికి ఎదిగానన్నారు. తాను ఇచ్చిన స్ఫూర్తితో పలువురు దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ అధికారి నగేష్, సర్వశిక్షా అభియాన్ సహ విద్య కో ఆర్డినేటర్ రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.