Abn logo
May 23 2020 @ 01:58AM

వృద్ధికి ఆర్బీఐ మంత్ర

 • కరోనా కష్టాలకు ఆర్‌బీఐ మలి ఊరట 
 • గృహ, వాహన రుణాలు మరింత చవక
 • 0.40శాతం తగ్గింపుతో 4 శాతానికి రెపో 
 • రివర్స్‌ రెపో 3.35 శాతానికి కుదింపు 
 • 2000 సంవత్సరం నాటి కనిష్ఠానికి రేట్లు 
 • ఈఎంఐ చెల్లింపులకు మరింత విరామం
 • మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు
 • ఎగ్జిమ్‌ బ్యాంక్‌కు రూ.15,000 కోట్ల రుణం 
 • సిడ్బీకి రూ.15 వేల కోట్ల రీఫైనాన్స్‌ వసతి 

అగమ్యగోచరంగా మారిన భవిష్యత్‌ స్థితిగతులతో పోరాడేందుకు ఆర్‌బీఐ అప్రమత్తంగా ఉంది. ఆర్థిక స్థిరత్వాన్ని తిరిగి సాధిస్తాం. 

- శక్తికాంత దాస్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ ముంబై: కరోనా ధాటికి పాతాళానికి పడిపోతున్న వృద్ధి రేటును పట్టి లేపేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మలి విడత చర్యలు ప్రకటించింది. బ్యాంకులకు ప్రామాణిక వడ్డీ (రెపో) రేటు 2000 సంవత్సరం నాటి కనిష్ఠ స్థాయికి తగ్గించింది. రెపో రేటులో 0.40 శాతం కోత పెట్టడంతో 4 శాతానికి దిగివచ్చింది. రివర్స్‌ రెపో రేటును సైతం 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గించింది. తత్ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత చవకగా లభించనున్నాయి. రెపో అనుసంధానిత రుణాలపై వడ్డీ రేట్లు, ఈఎంఐల భారమూ తగ్గనుంది. సాధారణ సమయాల్లో నిర్దేశిత షెడ్యూలు ప్రకారంగా నిర్వహించే ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో భాగంగా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశమై వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. కరోనా కష్టాల తీవ్రత అంచనాలకు మించిన నేపథ్యంలో జూన్‌ 3-5 తేదీల్లో నిర్వహించాల్సిన పరపతి సమీక్షను ముందుకు జరిపింది. 

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఈ నెల 20-22 తేదీల్లో భేటీ అయిన ఆరుగురు సభ్యుల ఎంపీసీ.. వడ్డీ రేట్లను మరోమారు భారీగా తగ్గించింది. రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించేందుకు ఎంపీసీలోని ఐదుగురు సభ్యులు ఓటేసినట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. వృద్ధి పునరుజ్జీవానికి అవసరమైనన్ని రోజులు సానుకూల ద్రవ్య విధానాన్ని కొనసాగించనున్నట్లు ఆయన చెప్పారు. అంటే, మున్ముందు రెపో రేట్లను మరింత తగ్గించే అవకాశముందన్నమాట. ఆర్‌బీఐ అనూహ్య ప్రకటనలతో మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపర్చడం ఇది రెండోసారి. మార్చిలోనూ షెడ్యూలు కంటే ముందే భేటీ అయిన ఎంపీసీ.. రెపో రేటును 0.75 శాతం తగ్గించింది. 


వృద్ధి మైన్‌సలోకి.. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ వృద్ధి మైన్‌సలోకి మళ్లనుందని ఆర్‌బీఐ అంచనా. ఈసారి భారత ఆర్థిక వృద్ధి రేటు పాతాళానికి పడిపోవచ్చని ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు, ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఆర్‌బీఐ కూడా ఇదే నిరాశావాదాన్ని వ్యక్తపర్చింది. గవర్నర్‌ దాస్‌ ఏమన్నారంటే.. 

 1. రెండు నెలల లాక్‌డౌన్‌తో దేశీయ ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి 
 2. దేశ పారిశ్రామికోత్పత్తిలో 60 శాతం వాటా కలిగిన ఆరు అతిపెద్ద పారిశ్రామిక రాష్ట్రాలు ప్రస్తుతం రెడ్‌ లేదా ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి
 3. దేశంలో రోజువారీ విద్యుత్‌, పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్‌ అనూహ్యంగా పతనమైంది 
 4. లాక్‌డౌన్‌తో పారిశ్రామికోత్పత్తి పడకేయడంతో పాటు మార్కెట్లో గిరాకీ కూడా క్షీణించింది
 5. దేశీయ డిమాండ్‌లో 60 శాతం వాటా కలిగిన ప్రైవేట్‌ రంగ వినియోగం పూర్తిగా కుంటుపడింది. పెట్టుబడులూ  దాదాపుగా నిలిచిపోయాయి
 6. లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది 
 7. అన్ని విధాలుగా చూస్తే, స్థూల ఆర్థిక, ద్రవ్య పరిస్థితులు అత్యంత కఠినంగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటోంది
 8. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు మాత్రమే కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. ఈసారి ఆహార ధాన్యాల దిగుబడి 3.7 శాతం పెరిగి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసుకుంది
 9. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదుకావచ్చన్న అంచనాలూ ఆశాజనకమేరూ.8 లక్షల కోట్ల దవ్య పెంపు చర్యలు 

ప్రామాణిక వడ్డీ రేట్ల తగ్గింపుతోపాటు ఇప్పటివరకు ఆర్‌బీఐ రూ.8.04 లక్షల కోట్ల విలువైన ద్రవ్య పెంపు చర్యలను ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్య లభ్యత  పుష్కలంగా ఉన్నప్పటికీ బ్యాంకులు మాత్రం రుణాలిచ్చేందుకు వెనుకాడుతున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో రుణాలిస్తే భవిష్యత్‌లో మొండి బకాయిలు మరింత పెరగవచ్చని బ్యాంకింగ్‌ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ వద్దనున్న నిధులతో రుణాలివ్వడానికి బదులు ఆర్‌బీఐ వద్ద జమ చేసేందుకే బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయి. బ్యాంకుల ప్రస్తుత వైఖరిని నిరుత్సాహపరిచేందుకే ఆర్‌బీఐ రివర్స్‌ రెపో రేటును మరింత తగ్గించింది. 


ధరల దడ!

కరోనా సంక్షోభంలో ధరల సూచీ గమనంపై తీవ్ర అనిశ్చితి నెలకొందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. పప్పు దినుసుల ధరలు గణనీయం గా పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రిటైల్‌ మార్కెట్లో ధరాఘాతాన్ని తగ్గించేందుకు ప్రస్తుత దిగుమతి సుంకాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దాస్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఈ ఏడాది ప్రథమార్ధంలో రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ సూచీ గరిష్ఠ స్థాయిలోనే కదలాడనుంది. ద్వితీయార్ధంలో కాస్త శాంతించవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్యమైన 4 శాతం దిగువకు జారుకునే అవకాశం ఉంది.మరిన్ని కీలక నిర్ణయాలు

 1. కార్పొరేట్లకు రుణాలిచ్చే బ్యాంకుల గ్రూప్‌ ఎక్స్‌పోజర్‌ పరిమితి 25 శాతం నుంచి 30 శాతానికి పెంపు
 2. విదేశీ వాణిజ్యానికి బాసటగా నిలిచేందుకు ఎక్స్‌పోర్ట్‌- ఇంపోర్ట్‌ (ఎగ్జిమ్‌) బ్యాంక్‌కు ఆర్‌బీఐ రూ.15,000 కోట్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను ప్రకటించింది. 90 రోజుల వరకు అందుబాటులో ఉండే ఈ లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను గరిష్ఠంగా ఏడాది వరకు పొడిగించుకోవచ్చు
 3. జూలై 31లోపు దిగుమతులకు చెల్లింపుల రెమిటెన్స్‌ ముగింపునకు గడువు 6 నెలల నుంచి 12 నెలలకు పెంపు
 4. ఎగుమతి రుణాల గరిష్ఠ కాలపరిమితి 12 నెలల నుంచి 15 నెలలకు పెంపు 
 5. సిడ్బీకి రూ.15,000 కోట్ల రీఫైనాన్స్‌ వసతి 90 రోజులు పొడిగింపు 


బ్యాంకింగ్‌, ఎన్‌బీఎ్‌ఫసీ షేర్లు ఢమాల్‌ 

బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగాలకు భారీ ఉద్దీపనలను ఆశిస్తున్న స్టాక్‌ మార్కెట్‌ వర్గాలను ఆర్‌బీఐ తాజా చర్యలు సంతృప్తిపర్చలేకపోయాయి. రుణాల మారటోరియం వసతిని మరో మూడు నెలలు పొడిగించడం ట్రేడింగ్‌ సెంటిమెంట్‌కు మరింత గండికొట్టింది. అమ్మకాల ఒత్తిడిలో బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీల షేర్లు 6 శాతం వరకు నష్టపోయాయి. బీఎ్‌సఈలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 5.65 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 5.08 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 4.32 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 4.20 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.52 శాతం, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 2.43 శాతం, ఎస్‌బీఐ 0.72 శాతం తగ్గాయి. ఎన్‌బీఎ్‌ఫసీల విషయానికొస్తే.. మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్స్‌ 6.31 శాతం, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ 5.78 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 4.67 శాతం తగ్గాయి. బీఎ్‌సఈలో బ్యాంకెక్స్‌ సూచీ 2.44 శాతం, ఫైనాన్స్‌ సూచీ 3 శాతం తగ్గాయి. రుచించని రేట్ల తగ్గింపు

 సెన్సెక్స్‌ 260 పాయింట్లు డౌన్‌:  ఆర్‌బీఐ అనూహ్యంగా మరో విడత పాలసీ రేటు తగ్గించడం, రుణ ఈఎంఐల మారటోరియం మరో మూడు నెలలు పొడిగించడం వంటి చర్యలపై ఇన్వెస్టర్లు పెదవి విరిచారు.  దీంతో మూడు రోజుల లాభాల ధోరణికి అడ్డుకట్ట పడింది. ఇంట్రాడేలో 450 పాయింట్ల మేరకు దిగజారిన సెన్సెక్స్‌ చివరికి 260.31 పాయింట్ల నష్టంతో 30672.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో 9039.25 వద్ద క్లోజైంది. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 425.14 పాయింట్లు, నిఫ్టీ 97.6 పాయింట్లు నష్టపోయాయి.


Advertisement
Advertisement
Advertisement