నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్‌ఏఆర్‌ఎస్ వ్యవసాయ కార్మికులు
నంద్యాల, జనవరి 17: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని వైద్య కళాశాలకు కేటాయించవద్దంటూ ఆర్‌ఏఆర్‌ఎస్ వ్యవసాయ కార్మికులు కోరారు. ఆదివారం 62వ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు ఏవీ రమణ, ఖాదర్‌వలి, ఎల్లమ్మ, పుల్లయ్య, అయ్యన్న, గోపాల్, నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నంద్యాల పరిశోధనా స్థానం ఎన్నో కొత్త వంగడాలను సృష్టించి దేశ వ్యాప్త గుర్తింపు పొందిందని అన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన పరిశోధనా భూమిని ప్రజాప్రతినిధులు తమ సొంత లాభం కోసం వైద్య కళాశాల పేరుతో కేటాయింపజేసి ఆర్‌ఏఆర్‌ఎస్‌ను ఇక్కడి నుంచి తరలించాలని కుట్ర పన్నారని అన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్ భూమిని కాపాడుకునేందుకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. వ్యవసాయ కార్మికులు, ఆర్‌ఏఆర్‌ఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.