Abn logo
Sep 24 2021 @ 23:19PM

కరోనా మహమ్మారి అడ్డుకట్టకు వేగంగా వ్యాక్సినేషన్‌

కాగజ్‌నగర్‌లో వ్యాక్సిన్‌ వేసేందుకు వాగు దాటి వెళ్తున్న వైద్య, అంగన్‌వాడీ సిబ్బంది(ఫైల్‌)

- ఫలిస్తున్న స్పెషల్‌ డ్రైవ్‌

- 6రోజుల్లో 55వేల మందికి టీకాలు

- స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ఆదివాసులు

- రాయ్‌ సెంటర్ల అవగాహనతో ఆదివాసుల్లో స్పష్టమైన మార్పు 

- 45రోజుల్లో లక్ష్యం చేరుకుంటామంటున్న వైద్యులు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

 కరోనా మహమ్మారికి శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి జిల్లాలో సరికొత్త ఊపు లభిస్తోంది. నిన్నా మొన్నటి వరకు టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహలు క్రమంగా తొలగిపోవడంతో ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సినేషన్‌ వేయించుకునేందుకు తరలివస్తున్నారు. దాంతో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు జనంతో రద్దీగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర సగటును పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాక్సినేషన్‌లో బాగా వెనుకబడింది. ఇందుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి ఏజెన్సీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదించడానికి కారణాలను విశ్లేషించింది. ఈ ఏడాది జనవరిలో కొవిషీల్డ్‌ టీకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగానే ప్రారంభమైంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రభుత్వం కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావమయ్యే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన వైద్య, పోలీసు, రెవెన్యూ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు, ఉపాధ్యాయులకు వరుస క్రమంలో దశల వారీగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని అమలు చేసింది. వారితో పాటే 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి మాత్రమే టీకాలు ఇవ్వడంతో కార్యక్రమం అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం 18ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించి పేర్ల నమోదు కోసం కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రరూపం దాల్చడంతో వేలాది మంది వ్యాక్సిన్లకోసం ఆరోగ్యకేంద్రాలకు పరుగులు తీసిన పరిస్థితి కొనసాగింది. అయితే అప్పట్లో ప్రభుత్వం పరిమితంగా వ్యాక్సిన్‌ డోస్‌లను సరఫరా చేయడంతో పరిమిత సంఖ్యలోనే టీకాలు వేయించుకున్నారు. ఇలా జనవరి నుంచి సెప్టెంబరు 15నాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తం లక్ష మందికి వ్యాక్సినేషన్‌ చేయగా ఇందులో 80వేల మందికి మొదటి, రెండో డోసులు వేశారు. వీరిని మినహాయిస్తే కొత్తగా మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న వారి సంఖ్య 20వేలు దాటలేదు. వాస్తవానికి జిల్లాలో మొత్తం3.80 లక్షల మంది 18సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సినేషన్‌ చేయించుకోవాల్సి ఉంది. జిల్లాలో కార్యక్రమం మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ ప్రక్రియలో వేగం పెంచేందుకు 45రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించింది. సగటున ప్రతీరోజు జిల్లాలో 13 వేల 8వందల మందికి వ్యాక్సినేషన్‌ వేసేలా కార్యచరణ ప్రారంభించారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 108ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, కాగజ్‌నగర్‌ మున్సిపాటీలోని 32వార్డులకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ప్రతీరోజు వంద మందికి వ్యాక్సినేషన్‌ చేయాలని తలపెట్టారు.

సత్ఫలితాలు ఇస్తున్న అవగాహన కార్యక్రమాలు..

 జిల్లాలో అత్యథికంగా ఏజెన్సీ ప్రాంతమే ఉండడంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అనుకున్న స్థాయిలో ముందుకు సాగుతుందో లేదోనని అధికార యంత్రాంగం సంశయించింది. అయితే ఆదివాసీ గ్రామాల్లో ప్రజలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు కలెక్టర్‌ వ్యూహాత్మకంగా రాయ్‌ సెంటర్ల బాధ్యులతో సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై అవగాహన కల్పించింది. దీంతో ఆదివాసీ సంఘాల నాయకులు టీకా కార్యక్రమంపై గూడాల్లో పెద్దఎత్తున ప్రచారం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆదివాసీ గ్రామాలకు వెళ్తున్న వైద్య సిబ్బందికి ఆదివాసులు స్వచ్ఛందంగా వచ్చి వ్యాక్సినేషన్‌ చేయించుకుంటుండడంతో వ్యాక్సినేషన్‌లో మరింత వేగాన్ని పెంచారు. గత ఆరు రోజుల గణంకాలే ఇందుకు నిదర్శనం. స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించిన మొదటి రోజైన సెప్టెంబరు 16న కేవలం 3వేల మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ చేయగా, 17న 5వేలు, 18న 10వేల 5వందలు, 19న 10వేల 6వందలు, 20న 11వేల 5 వందలు, 21న 15వేల మందికి టీకాలు వేశారు. ఇదిలా ఉండగా మొదటి రెండురోజులు మినహాయిస్తే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అను కున్న స్థాయిలో వేగంగా సాగుతోంది. ప్రభుత్వం నిర్ధేశించిన 45రోజుల్లోపు జిల్లాలోని ప్రతీఒక్కరికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేసి లక్ష్యాన్ని చేరుకుంటామని వైద్యులు ధీమాగా చెబుతుండడం ఎంతైనా ఇక్కడ ప్రస్తావనార్హం.