Abn logo
Apr 28 2020 @ 21:54PM

‘వైజయంతి మూవీస్‌’కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

‘‘ప్రేక్షకులుగా, మీరు మాకు చాలా ఇచ్చారు. కాబట్టి ప్రతిగా, మీకు ఇష్టమైన సినిమాలు, నటీనటులు, పాటలు మొదలైన కొన్ని ఆసక్తికరమైన, తెలియని కథలను మీ ముందుకు తీసుకువస్తాము. ఈ సమయంలో మేము చేయగలిగినది మీకు వినోదాన్ని ఇవ్వడమే. తప్పకుండా అది అందిస్తామని మేము హామీ ఇస్తున్నాము..’’ అంటూ వైజయంతి మూవీస్ ‘వింటేజ్ వైజయంతి’ పేరుతో కొన్ని స్టోరీలను తెలిపేందుకు సిద్ధమైంది. తొలి స్టోరీని రానా దగ్గుబాటి వాయిస్‌తో చెప్పిస్తూ ఓ వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ వీడియోలో వైజయంతి మూవీస్ బ్యానర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? ఎవరు ఆ పేరు పెట్టారు? వంటి విషయాలను రానా దగ్గుబాటి తెలియజేశారు.


‘‘గత 5 దశాబ్ధాలుగా.. ప్రతి జనరేషన్‌కి తగ్గట్టూ బ్లాక్‌బస్టర్‌లిస్తూ వస్తున్న సంస్థ వైజయంతి మూవీస్. కానీ ఈ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చిందో? ఎవరు ఆ పేరు పెట్టారో తెలుసా? 1974లో చలసాని అశ్వనీదత్ 21 సంవత్సరాల వయసులో కె. విశ్వనాధ్ గారి ‘ఓ సీత కథ’తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ ఆ కుర్రోడి స్వప్నం ఇంకెంతో పెద్దది. నటరత్న నందమూరి తారక రామారావుగారంత పెద్దది. ఎన్టీఆర్‌గారితో సినిమా సాధ్యమేనా? పట్టువదలని విక్రమార్కుడిలా.. మొండితనమో.. పట్టుదలో కానీ చివరికి ఎన్టీఆర్‌గారి అపాయింట్‌మెంట్ సాధించారు. ఆయనతో సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారో ఎన్టీఆర్ అడిగి, అతని మాటలకు ముచ్చటేసి ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. అంతవరకు అశ్వనీదత్‌గారు బ్యానర్ కూడా స్థాపించలేదు. ఎన్టీఆర్‌గారు అడిగిన మొదటి ప్రశ్నే అది. బ్యానర్ ఏమిటి? అని. విజయా సంస్థలాంటిదేదో అయితే బాగుండు అని దత్తుగారి మనసులో ఉంది. కానీ బయటపెట్టలేదు. క్షణం ఆలోచనలో పడి.. ఆ మహనీయుడి ఎన్టీఆర్ మనసులో మరో అద్భుతమైన ఆలోచన గుప్పుమంది. అక్కడే ఉన్న కృష్ణుడి ఫొటోని చూపించి శ్రీకృష్ణుడి మెడలో ప్రతి క్షణం పరిమళాలను వెదజల్లుతూ.. ఎన్నటికీ వాడిపోని వైజయంతి. అదే నీ సంస్థ అని చెప్పారు. ఆ క్షణం తన సువర్ణ హస్తాలతో ‘వైజయంతి మూవీస్’ అని తన అందమైన దస్తూరితో రాశారు. కేవలం రాయడమే కాదు, వైజయంతి ఎప్పటికీ వాడిపోని, వన్నెతరగని ఘన విజయాలను అందించే సూపర్ పవర్ అని అప్యాయంగా విన్నవించారు కూడా. ఆయన ఆ సంస్థలో చేసిన మొదటి సినిమా ‘ఎదురులేని మనిషి’. ఆ తారకరాముని దివ్యసంకల్పంతో పెట్టిన ఆ పేరు.. ఏ వేళా విశేషమో.., ఆ మహానుభావుడి హస్తవాసో.. ఆనాటి నుంచి వైజయంతి మూవీస్ ఈనాటి వరకు ఎదురులేని సంస్థగా నిలిచింది..’’ అని వైజయంతి మూవీస్ సంస్థ యొక్క ఫస్ట్ స్టోరీని రానా దగ్గుబాటి తెలిపారు. 



Advertisement
Advertisement
Advertisement