Abn logo
Jul 12 2020 @ 07:32AM

శివా.. ఓసారి మాట్లాడు!

ఉరి మెడకు బిగుస్తుండగా ప్రియుడి స్పందన కోసం ఆక్రందన

గంటన్నరలోపే వందల మెసేజ్‌లు

వేటికీ అతడు చలించకపోవడంతో ఫ్యాన్‌కు వేలాడుతూ సెల్ఫీ వీడియో

సోషల్‌ మీడియాలో సంచలనం

ప్రియుడిపై నెల్లూరు సిటీలో కేసు


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): ప్రేమ నటించి, పెళ్లి చేసుకోమంటే మొహం చాటేస్తున్న ప్రియుడి తీరు ఆమె ప్రాణాలు తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోకాల్‌ చేసినా అతడిలో చలనం లేకపోవడంతో, ఆమె అన్నంత పనీ చేసింది. ఫ్యాన్‌కు ఉరి వేసుకొంటూ ‘శివా.. ఓ సారి మాట్లాడు’ అంటూ ప్రాధేయపడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో తీవ్ర కలవరం రేపాయి. నెల్లూరు సిటీలోని బీవీనగర్‌లో ఉంటున్న వెంకటరాజు, సుబ్బమ్మ దంపతుల కుమార్తె రమ్య(21) ప్రైవేటు డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది.


వారి ఇంటి సమీపంలో ఉండే శివభార్గవ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లిచేసుకుంటానని చెబుతూ వచ్చిన శివ.. చివరికి మొహం చాటేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శుక్రవారం శివభార్గవ్‌తో మాట్లాడేందుకు రమ్య ప్రయత్నించింది. ఫోన్‌ చేసినా, వాట్సప్‌ మెసేజ్‌ పెట్టినా అతడిలో చలనం లేదు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘శివా..ఓసారి మాట్లాడు’ అంటూ వందల సంఖ్యలో మెసేజ్‌లు పెట్టింది. ఎంతకూ సమాధానం రాకపోవడంతో చివరి అస్త్రంగా.. ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.


అయినా స్పందన లేకపోవడంతో తమ ఇంట్లోని గదిలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొంటూ.. ఆ దృ శ్యాలను వాట్సప్‌ ద్వారా శివభార్గవ్‌కు పంపింది. కన్నీటితో ప్రాధేయపడుతూ.. ఉరికి వేలాడుతూ రమ్య స్పృహ కోల్పోయింది. గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే రమ్య చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. శివభార్గవ్‌కు రమ్య పంపిన మెసేజ్‌లు, వీడియోలను ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు ఆమె కుటుంబం అందించి.. ఫిర్యాదు చేసింది. కాగా, శివభార్గవ్‌ పరారీలో ఉన్నారు.


Advertisement
Advertisement
Advertisement