Sep 17 2021 @ 21:07PM

సంఖ్య కాదు.. స్థానం కావాలి: రమ్యాపాండ్యన్

సంఖ్యాపరంగా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించడం ముఖ్యం కాదని, ఒకటీ రెండు చిత్రాల్లో నటించినప్పటికీ ప్రేక్షకుల మనస్సుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే స్థానం కావాలన్నదే తన కోరిక అని హీరోయిన్‌ రమ్యాపాండ్యన్‌ పేర్కొన్నారు. ఈమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రామన్‌ ఆండాలుం రావణన్‌ ఆండాలుం’ అనే చిత్రం ఈ నెల 24వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. 


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నేను తమిళ అమ్మాయిని కావడం వల్లే ఈ మూవీలో అవకాశం దక్కిందని భావించడం లేదు. ఇందులో ముఖానికి రవ్వంత కూడా మేకప్‌ లేకుండా కేవలం పసుపు మాత్రమే పూసుకుని పూర్తిగా డీగ్లామర్‌ పాత్రలో నటించాను. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు అరిసిల్‌ మూర్తికి ధన్యవాదాలు. తమిళ అమ్మాయిని అనే ఒకే ఒక్క అర్హత వల్లే ఇలాంటి పాత్ర దక్కిందని నేను భావిండం లేదు. నాలోని టాలెంట్‌, ఈ పాత్రకు ఖచ్చితంగా నేను సరిపోతానని దర్శకుడు భావించడమే అందుకు కారణం.. ఖచ్చితంగా ఈ పాత్ర నా సినీ కెరీర్‌లో ఓ మంచి పాత్రగా నిలిచిపోతుంది. కథాబలం లేని పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఒక యేడాది తర్వాత నేను ఈ ఫీల్డులోనే కనిపించకుండా పోతాను. అలాంటి పరిస్థితి నాకొద్దు. సినీ ప్రేక్షకుల మనస్సుల్లో మంచి స్థానం సంపాదించుకుని, ఆ పాత్ర గురించి పదికాలాల పాటు చర్చించుకునేలా ఉండాలి. అలాంటి పాత్రలు కలిగిన చిత్రాల్లో నటించేందుకు ఇష్టపడతాను. ఇకపోతే, బిగ్‌బాస్‌లో నా నటన చెప్పాలంటే, అది నా నిజస్వరూపం. అక్కడ నటించలేదు. సాధారణంగా నేను ఎలా ఉంటానో ఆ విధంగానే హౌస్‌లో ఉన్నాను. అందుకే మంచి మార్కులతో పాటు గుర్తింపు వచ్చింది.. అని వివరించారు.