Abn logo
Jul 31 2021 @ 00:24AM

సంగీతరత్నాలూ మానవతామణులూ

హిగ్గిన్స్ భాగవతార్‌గా ప్రసిద్ధుడయిన అమెరికా సంగీత విద్వాంసుడు జోన్ హిగ్గిన్స్ ఉడుపి పట్టణాన్ని సందర్శించినప్పుడు అక్కడి కృష్ణ దేవళంలోకి ప్రవేశించేందుకు పూజారులు అనుమతినివ్వలేదు. దాంతో ఆయన ఆలయం ఎదుట వీధిలో నిలబడి ‘కృష్ణా నీ బెగాని బరో’ పాటను పదేపదే ఆలపించాడు, అపూర్వ, అనుపమేయ భక్తిభావం ఆయన గానంలో తొణికిసలాడడం ఉడుపి పూజారులను లజ్జాభరితులను చేసింది. వారు హిగ్గిన్స్‌ను సాదరంగా ఆలయంలోకి ఆహ్వానించారు. ఎంతో కష్టపడి సేకరించుకుని తమ సంగీత నిధులను ఒక ప్రజావేదికపై విశాలలోకానికి అందుబాటులో ఉంచిన వారు మానవజాతి నిజమైన మణిదీపాలు.


యూట్యూబ్ సంగీత నిధులను శోధి ంచి, ఆస్వాదించే అదృష్టం నాకు యాదృచ్ఛికంగా లభించింది. ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వారాల తరబడి నేను పడక మీదే ఉండిపోయాను. పుస్తకాలు చదవలేను. అయితే ల్యాప్‌టాప్‌ను తెరిచి, ఈ–-మెయిల్స్ పరిశీలించి, అవసరమైతే సమాధానాన్ని క్లుప్తంగా ఒక చేతి వేళ్ళతో టైప్ చేయగల స్థితిలో ఉన్నాను. ఇది, 2012 వసంతకాలం నాటి మాట. అప్పటికి కొద్ది సంవత్సరాలుగా నాకు తరచూ మలయాళ రచయిత, సంగీత విద్వాంసుడు ఎస్. గోపాలకృష్ణన్ నుంచి పోస్టింగ్స్ వస్తుండేవి. ఆయన వారానికి రెండు మూడుసార్లు ఒక శాస్త్రీయసంగీత కృతిని పంపుతుండేవారు గోపాల్ నుంచి ఈ సౌభాగ్యాన్ని పొందిన వందలాది రసికులలో నేనూ ఒకడిని కావడం నా అదృష్టం. ఆయన ఆ కృతి భావాన్ని, విశిష్టతను క్లుప్తంగా అందమైన వాక్యాలలో తెలియజేస్తుండేవారు.


ప్రభాత సమయంలో గోపాల్ సిఫారసులు మాకు అందేవి. ఆయన పంపిన స్వరబద్ధ సంగీతకృతులను ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వినేందుకు నాకు స్వేచ్ఛ ఉండేది. ప్రమాదానికి లోనుగాక ముందు నా ఉదయాలు ఎడతెగని కార్యకలాపాలతో మధ్యాహ్నంలోకి సాగిపోతుండేవి. ఆ కారణంగా గోపాల్ పంపిన సుస్వరాలను అందిన వెంటనే వినేందుకు అరుదుగా మాత్రమే తీరుబాటు ఉండేది. అయితే నా పరిశోధనావ్యాసంగాల వివరాలను కంప్యూటర్‌లో రాసుకుంటున్న వేళ, గోపాల్ పంపిన శాస్త్రీయ సంగీతకృతులు మంద్రంగా వినబడుతూ అలుపు సొలుపునకు తావులేకుండా ఉపశమనం కలిగించేవి. 


ప్రతి ఉదయమూ కబ్బన్ పార్క్‌లో వాహ్యాళికి వెళుతుండేవాణ్ణి. ప్రమాదంలో గాయపడ్డాక, మనస్సుకూ దేహానికీ కొత్త శక్తి, ఉత్సాహాన్ని ఇచ్చే ఆ విహారానికి వెళ్ళడం సాధ్యంకాదు గనుక సంగీతంతో సేదదీరడం అలవరచుకున్నాను తొలుత గోపాల్ పంపిన ఈ–-మెయిల్‌ సందేశం చదివి, లింక్ మీద క్లిక్ చేసేవాణ్ణి. ఆ సంగీతకృతులు వింటూ రాగమధురిమలలో ఓలలాడేవాణ్ణి. మనసు రంజితమయ్యేది. ప్రమాద గాయాలు సలుపుతున్న నొప్పిని మరచిపోయేవాణ్ణి. ఇలా ప్రతిరోజూ చేయడం అలవాటైన తరువాత క్రమంగా, అంతకుముందు నేనేం కోల్పోయానో తెలిసివచ్చింది. కంప్యూటర్ స్క్రీన్ ఇతర కృతుల ఆస్వాదనకు నన్ను ఆహ్వానించేది. అలా ఒకదాని తరువాత మరొకటి వింటూ ఉండేవాణ్ణి.


సంగీతాస్వాదన నాకు కొత్తేమీకాదు. అయితే ఇది నాకు కొత్త రసానుభవం. అదేవిధంగా గోపాల్ సిఫారసు చేసిన ఒక విశిష్టకృతి నన్ను, నా మొదటి యూట్యూబ్ వీనుల విందుకు తీసుకువెళ్ళింది. ఆ ఉదయం, కర్ణాటక గాత్ర విదుషీమణి ఎంఎల్ వసంతకుమారి గానం చేసిన ‘కృష్ణా నీ బెగాని బరో’ పాటకు గోపాల్ లింక్ పంపించాడు. అది నాకు ఎంతో ప్రీతికరమైన పాట. వసంతకుమారి గానంలో ఆ పాటను విన్న తరువాత, ప్రముఖ గాయని బాంబే జయశ్రీ గానం చేసిన అదే గీతానికి లింక్ చూసి అది కూడా విన్నాను.


వసంతకుమారి, జయశ్రీల గానం వింటుండగా ఆ పాటతో ప్రమేయమున్న ఒక ఆసక్తికర ఉదంతం గురించి నేను చదివింది జ్ఞాపకం వచ్చింది. అమెరికన్ సంగీతకారుడు డాక్టర్ జోన్ బోర్త్విక్ హిగ్గిన్స్ (1939–84)తో ముడివడి ఉన్న ఉదంతమది. మన దేశంలో హిగ్గిన్స్ భాగవతార్‌గా ప్రసిద్ధుడయిన ఆ సంగీత విద్వాంసుడు కర్ణాటక సంగీతరంగంలో భారతీయేతరుడిగా యశోభూషణుడయ్యాడు. ఉడుపి పట్టణాన్ని సందర్శించిన హిగ్గిన్స్‌ను అక్కడి ప్రఖ్యాత కృష్ణదేవళంలోకి ప్రవేశించేందుకు పూజారులు అనుమతించలేదు. శ్వేత జాతీయుడు కావడమే అతని అపరాధం! దాంతో ఆలయం ఎదుట వీధిలో నిలబడి ‘కృష్ణా నీ బెగాని బరో’ పాటను హిగ్గిన్స్ ఆలాపించాడు, పదే పదే. అపూర్వ, అనుపమేయ భక్తిభావం ఆయన గానంలో తొణికిసలాడడం ఉడుపి పూజారులను విస్మయపరచింది, లజ్జాభరితులను చేసింది. ఆ భక్తుడికి ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం దైవాపచారమేనని గుర్తించి సాదరంగా ఆలయంలోకి ఆహ్వానించారు. హిగ్గిన్స్ వారికి ఉద్దేశపూర్వకంగా, స్ఫూర్తిదాయకంగా ఆ కోవెల చరిత్రలోని ఒక పురాతన ఐతిహ్యాన్ని విన్నవించాడు.


16వ శతాబ్దిలో కన్నడ కవి కనకదాసను, కడమ జాతివాడనే కారణంతో ఆ గుడిలోకి అనుమతించలేదు. పూజారుల అభిజాత్యానికి గురైన కనకదాస ఆలయం వెలుపల కృష్ణగానం చేశాడు. గుడిలోని కృష్ణప్రతిమ ఆ గానానికి ప్రాణం పోసుకుని మందిరం నుంచి వెలుపలికి వచ్చి ఆలయకుడ్యాన్ని ధ్వంసించి తన భక్త శిఖామణి ఎదుట ప్రత్యక్షమయింది. పరాత్పరుడిని దర్శించి కనకదాస కృతార్థుడయ్యాడు.


హిగ్గిన్స్ ఉదంతం గుర్తుకువచ్చిన వెంటనే ఆయన పాడిన ‘కృష్ణా నీ బెగాని బరో’ను వినేందుకు యూట్యూబ్‌ను అభ్యర్థించాను. హిగ్గిన్స్ గానాన్ని విన్న తరువాత క్రైస్తవకుటుంబంలో జన్మించిన మరో మధుర గాయకుడు కె.జె యేసుదాస్ పాడిన అదే పాటను కూడా వినాలనిపించి యూట్యూబ్‌లోనే విన్నా‌ను. అలా ఆ ఉదయం మధురమైన పాటలతో పరిమళించింది. నా శరీరంలోని నెప్పులను పూర్తిగా మరచిపోయాను.


యూట్యూబ్ నా జీవితావరణంలోకి రాకపూర్వమే నేను రసస్వరాధకుడిణ్ణి. అనేక సంవత్సరాలుగా సేకరించుకుని, పదిలపరచుకున్న జాతీయ కార్యక్రమాల కేసెట్లు, సిడిలు ఎన్నో నా దగ్గర ఉన్నాయి. నా సంగీతాస్వాదనకు వాటి మీదే ప్రధానంగా ఆధారపడేవాణ్ణి. వాద్యసంగీతం వినదలుచుకుంటే అలీ అక్బర్ ఖాన్, నిఖిల్ బెనర్జీ, రవిశంకర్, విలాయత్ ఖాన్, ఎన్.రాజం, బిస్మిల్లాఖాన్ తదితరులను వినేవాణ్ణి. గాత్రసంగీతం వైపు మనసు పోయినప్పుడు భీమ్‌సేన్ జోషి, కుమార్ గాంధర్వ, మల్లికార్జున్ మన్సూర్, మాలినీ రాజూర్కర్, కిషోరి అమోంకర్, బస్వరాజ్ రాజ్‌గురు మొదలైన వారి విమలగాంధర్వం వీనుల విందు అయ్యేది. రోడ్డుప్రమాదానికి లోనైన తర్వాత యూట్యూబ్ నాకొక కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరిచింది. అక్కడి సంగీత నిధులతో నా వ్యక్తిగత సంగీత ఆస్తులను మరింత సుసంపన్నం చేసుకున్నాను, ఇంకా చేసుకుంటూనే ఉన్నాను.

2018 జనవరిలో మరో వీనులవిందును యూట్యూబ్ నాకు అందించింది. గొప్ప సరోద్ విద్వాంసుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా కీర్తిశేషుడయిన తరుణంలో అది సంభవించింది. 1980ల్లో కలకత్తాలో విద్యార్థిగా ఉన్నప్పుడు పలుమార్లు బుద్ధదేవ్ సరోద్ ఝరిని ప్రత్యక్షంగా విన్నాను. వృత్తిరీత్యా ఇంజనీర్ అయినందున బుద్ధదేవ్ సంగీతకచేరీలు చాలవరకు ఆ బెంగాలీ మహానగరానికే పరిమితమయ్యాయి. సమకాలికులు అలీ అక్బర్ ఖాన్, అమ్జాద్ అలీఖాన్ వలే విశాలభారతావనిలోనూ, పాశ్చాత్యదేశాలలోనూ కచేరీలు నిర్వహించడానికి ఆయనకు సమయం లేకపోయింది.


2010లో బెంగలూరులో బుద్ధదేవ్ బాబు సంగీతసభ జరిగింది. నా యవ్వనంలో విన్న ఆయన సరోద్‌ శబ్దలయలు నా మనస్సును ఇంకా మంత్రిస్తుండగా నా కుమారుడిని కూడా వెంటబెట్టుకుని చౌడయ్య మెమోరియల్ హాల్‌లో ఆయన కచేరీకి వెళ్ళాను. ఆ సంగీతసమ్రాట్‌పై వయోభారం స్పష్టంగా కన్పించింది. ఆ వాస్తవాన్ని ఆయనా గుర్తించారు. కనుకనే కాబోలు తన సరోద్ నాదాన్ని ప్రారంభించే ముందు, ‘మీకు ఒకప్పుడు తెలిసిన బుద్ధదేవ్ దాస్‌గుప్త ఇప్పుడు మీ ఎదుట లేడు. అయితే బెంగలూరు నుంచి అందిన ఆహ్వానాన్ని తిరస్కరించలేను కదా’ అన్నారు. 


కొవిడ్ మహమ్మారి విజృంభించిన తరువాత నేను యూట్యూబ్‌తో ఎక్కువ కాలం గడుపుతున్నాను. క్రికెటింగ్, సాహిత్యానికి సంబంధించినవి కూడా నేను వింటున్న, వీక్షిస్తున్న వాటిలో ఉంటున్నాయి. క్రికెట్‌కు సంబంధించి షేన్ వార్న్‌, మైఖెల్ అథెర్టన్‌ల మధ్య సంభాషణ, సాహిత్యానికి సంబంధించి సిఎల్‌ఆర్ జేమ్స్, స్టువార్ట్ హాల్ మధ్య సంభాషణ నన్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే సంగీతానికి సంబంధించిన వాటినే ఎక్కువగా వినడం, వీక్షించడం జరుగుతోంది. పాశ్చాత్య శాస్త్రీయసంగీతం సుమధుర సౌరభాలు యూట్యూబ్ ద్వారానే నా హృదయాన్ని ఆవహించాయి. తరాల సంబంధిత అనుబంధాలను కూడా నేను యూట్యూబ్ వల్లే అధిగమించగలిగాను. నా యవ్వనంలో నేను ఆరాధించిన గాయనీ గాయకులతో పాటు ఇప్పటి వెంకటేష్ కుమార్, కలాపిని కొమ్కాలి, అశ్విని భిడె దేశ్‌పాండే, ప్రియ పురుషొత్తమన్ మొదలైన వారి గానమధురిమలను గ్రోలాను. ఇటీవల నా అద్భుత సంగీతానుభవాలలో ఒకటి కిరానా ఘరానా గాయని రోషన్ అరా బేగమ్ గానం. ఉస్తాద్ అబ్దుల్ కరీమ్ ఖాన్ ప్రత్యక్ష శిష్యురాలు అయిన రోషన్ బేగం దేశ విభజన అనంతరం లాహోర్‌లో స్థిరపడింది. 1982లో మరణించే వరకు ఆమె సంగీత యాత్ర సాగింది. 2009లో లాహోర్‌ను సందర్శించినప్పుడు నేను ప్రత్యేకంగా అనార్కలి బజార్‌కు వెళ్ళి రోషన్ బేగం కేసెట్లను కొనుక్కున్నాను. వాటిలో ఒకటి అద్వైత దార్శనికుడు శంకరుడి గీతావళి గానం. రోషన్ బేగం చాలా అందంగా గానం చేశారు.


ఎంతోమంది సంగీతాభిమానులు తాము సేకరించి భద్రపరచుకున్న ఎన్నో అరుదైన రికార్డులు, కేసెట్లు, సీడీలను ఇతరులూ వినేందుకు నిస్వార్థంగా యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు. ఇది ఎంతైనా ప్రశంసనీయం. వారిని మనసారా అభినందిస్తున్నాను. పేరు పేరునా అభినందించాలని ఉన్నా సంకుచిత సొంతదారులు, దురాశాపరులైన వారి న్యాయవాదుల నుంచి ఆ సంగీతాభిమానులు వేధింపులు ఎదుర్కోవలసివస్తుందనే భయం నన్ను అందుకు పురిగొల్పడం లేదు.


నా వలే, తమ సంగీతాస్వాదనకు యూట్యూబ్‌కు వెళ్ళే వారు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో గ్రహించగలరు. విద్వేషాలు-–విభేదాలు, ఈర్ష్య-–స్పర్థ, అభిమాన దురభిమానాలతో నిండిపోయిన ప్రపంచంలో ఎంతో కష్టపడి సేకరించుకుని సంరక్షించుకుంటున్న తమ సంగీతనిధులను ఒక ప్రజా వేదికపై విశాలలోకానికి అందుబాటులో ఉంచిన వారు మానవజాతి నిజమైన మణిదీపాలు.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...