Abn logo
Jan 21 2021 @ 00:39AM

నాలుగు దశాబ్దాల కళావెంకటరావు రాజకీయ జీవితంలో.. తొలిసారిగా..

రాజాంలో కలకలం

టీడీపీ నేత కళావెంకటరావు అరెస్ట్‌

స్వగృహంలో అదుపులోకి తీసుకున్న విజయనగరం పోలీసులు

ఇంటిచుట్టూ భారీగా మోహరింపు

బలవంతంగా వాహనంలోకి ఎక్కించి.. చీపురుపల్లి స్టేషన్‌కు తరలింపు 

‘రామతీర్థం’ సంఘటనే కీలకం 


రాజాం(శ్రీకాకుళం): జిల్లాలో టీడీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మరో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కిమిడి కళావెంకటరావును బుధవారం రాత్రి విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. భోగాపురం సీఐ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్‌ బృందాలు కళావెంకటరావును శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. గతంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడును అరెస్టు చేయడం... అంతకుముందు మరో నాయకుడు కూన రవికుమార్‌పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో వైసీపీ నేత, ఎం.పి.విజయసాయిరెడ్డి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలకు కళాను బాధ్యుడిని చేస్తూ అరె్‌స్ట్‌ చేశారు.


విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సీఐ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కళా వెంకటరావు ఇంటిని, కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. సీఐ శ్రీధర్‌తో పాటు మరికొంత మంది పొలీసులు నేరుగా కళా వెంకటరావు గృహంలోకి ప్రవేశించారు. కళా వెంకటరావుతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకులు, ఇతర సిబ్బంది చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కళాతో సీఐ శ్రీధర్‌ సుమారు 20 నిమిషాల పాటు చర్చించారు. రామతీర్ధంలో జరిగిన సంఘటనకు సంబంధించి అరెస్ట్‌ చేస్తున్నట్లు ఆయనకు వివరించారు. ఈ మాటతో అవాక్కయిన కళా వెంకటరావు వెంటనే తేరుకొని... పొలీసులకు సహకరించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయనను ఇంటి బయటకు తీసుకువచ్చారు. ఫోన్‌ చేసుకునేందుకు రెండు నిమిషాల పాటు సెల్‌ఫోన్‌ను అందజేశారు. కళా వెంకటరావు ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటి బయటకు  వస్తుండగా...   చేతిలోని సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనను వాహనం వద్దకు తీసుకువచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు  ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.


ఆయన మాట్లాడుతుండగానే బలవంతంగా వాహనంలోనికి తోసివేశారు.  కళా వెంకటరావు తనతో పాటు తీసుకువెళ్లాల్సిన లగేజీ బ్యాగు కింద పడిపోయింది. బ్యాగును ఇచ్చేందుకు వ్యక్తిగత సిబ్బంది చేసిన ప్రయత్నాన్ని సైతం పొలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన్ని తరలిస్తున్న వాహనం వెనుకడోర్‌ సైతం వేయకుండానే అక్కడి నుంచి కదిలిపోయారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి పొలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి 10 గంటలు దాటాక కూడా కళాను చీపురుపల్లి స్టేషన్‌లోనే ఉంచారు. ఇదిలా ఉండగా నెల్లిమర్ల పొలీస్‌స్టేషన్‌లో కళాపై కేసు నమోదైంది. 


తొలిసారిగా.. కళాపై కేసు నమోదు

రాజాం: సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారిగా కళావెంకటరావు అరెస్టయ్యారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన నేపథ్యంలో నెల్లిమర్ల పొలీస్‌స్టేషన్‌లో కళా వెంకటరావుపై కేసు నమోదైంది. దీంతో ఆయనను చీపురుపల్లి పొలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా.. మచ్చలేని నాయకుడిగా, సాధుస్వభావుడిగా పేరొందిన కళావెంకటరావును అరెస్ట్‌ చేయడంతో  అభిమానులు, పార్టీశ్రేణుల్లో ఆందోళన నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించిన నాటి నుంచి నేటివరకూ కళా వెంకటరావు అనేక పదవులు పొందారు. ఎన్టీ రామారావు హయాంలో వాణిజ్యపన్నులు, పురపాలక, హోం శాఖామంత్రిగా పనిచేశారు. ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఎన్టీఆర్‌ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఆయనకు ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను కొన్నేళ్లు అప్పగించారు. ప్రస్తుతం టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా కళా కొనసాగుతున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ఏనాడూ ఆయనపై ఒక్క పోలీస్‌ కేసు కూడా నమోదు కాలేదు. అటువంటి నాయకుడిపై తొలిసారిగా కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.  


ఇది ఆటవిక పాలన

జగన్‌ పాలనను ఆటవిక పాలనగా కళావెంకటరావు అభివర్ణించారు. చీకటి రాజ్యం కొనసాగుతోందని ఆరోపించారు. బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేసి బలవంతంగా తీసుకువెళ్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రామతీర్థంలో జరిగిన సంఘటనను అడ్డం పెట్టుకుని తనను అరెస్ట్‌ చేస్తున్నట్లు కళా స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో ఉన్న తన లాంటి నాయకులను కూడా జగన్‌ ప్రభుత్వం విడచిపెట్టడం లేదని ఆరోపించారు. దీనిపై ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. 


అరెస్ట్‌లతో భయపెట్టలేరు: కళా అరెస్ట్‌పై టీడీపీ నాయకులు ధ్వజం

రాజాం: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కళావెంకటరావు అరెస్ట్‌పై ఆపార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. అరెస్ట్‌లతో తెలుగుదేశం పార్టీని, నాయకులను భయపెట్టలేరని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. కళాని అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రామతీర్థం సంఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా? అని  ప్రశ్నించారు. కనీసం మాత్రలు కూడా వేసుకోనివ్వకుండా బలవంతంగా అరెస్ట్‌ చేయడాన్ని మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభాభారతి ఖండించారు. జగన్‌ ప్రభుత్వంలో అరాచకాలు ఎక్కువయిపోతున్నాయని ఆమె పేర్కొన్నారు. కళా వెంకటరావు అరెస్ట్‌ పైశాచికచర్యగా మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళి అభిప్రాయపడ్డారు. 


స్టేషన్‌ బెయిల్‌పై విడుదల

కళావెంకట్రావును చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌ నుంచి బుధవారం రాత్రి 11గంటల సమయంలో 41 నోటీసుపై విడుదల చేశారు. పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తానన్న పూచీకత్తుపై ఆయన్ను విడిచిపెట్టారు. టీడీపీ నేతలతో పోలీస్‌స్టేషన్‌ నుంచి గాంధీజీ బొమ్మవరకు ర్యాలీ చేసిన అనంతరం సోదరునితో కలిసి కళా వెంకట్రావు రాజాం వెళ్లిపోయారు. దీంతో కథ సుఖాంతమైంది.  

Advertisement
Advertisement
Advertisement