Apr 16 2021 @ 15:15PM

మరో 'కుమారి 21ఎఫ్' కావాల్సిందే..!

టాలీవుడ్ హీరోలలో కొంతమందికి స్టార్ స్టేటస్ వచ్చినట్టే వచ్చి అనూహ్యంగా పడిపోయింది. మళ్ళీ సాలీడ్ హిట్ కోసం ఈ హీరోలంతా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ సాలీడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. వరస అవకాశాలున్నాయి. కానీ అకౌంట్‌లో హిట్ ఎప్పుడు చేరుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఆ లిస్ట్‌లో ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్. 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోగా మారిన రాజ్ తరుణ్.. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన 'కుమారి 21 ఎఫ్' సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సస్ తర్వాత టాలీవుడ్‌లో ఈ కుర్ర హీరో క్రేజ్ బాగా పెరిగి వరసగా అవకాశాలు వచ్చాయి. 'సినిమా చూపిస్త మావ', 'అంధగాడు', 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'రంగుల రాట్నం', 'రాజుగాడు' సినిమాలు చేశాడు.

అయితే ఈ సినిమాలన్నీ ఈ యంగ్ హీరో కెరీర్‌కి పెద్దగా ఉపయోగపడింది లేదు. కాస్త గ్యాప్ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఇద్దరిలోకం ఒకటే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే చాలా ఏళ్ళ తర్వాత కొండా విజయ్ కుమార్ దత్శకత్వం వహించిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాతో ఒక మోస్తారు హిట్ అందుకున్నాడు. కానీ 'కుమారి 21ఎఫ్' లాంటి హిట్ మాత్రం కాలేదు. ప్రస్తుతం 'పవర్ ప్లే' సినిమా చేస్తున్న రాజ్ తరుణ్ చేతిలో 5 సినిమాలున్నాయి. వీటిలో ఓ మూడు సినిమాల షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చిందట. ఈ సినిమాల లిస్ట్‌లో అన్నపూర్ణ సంస్థ నిర్మించే సినిమా కూడా ఉండటం విశేషం. మరి వీటిలో ఒక్కటైనా కుమారి 21ఎఫ్ లాంటి సాలీడ్ హిట్ పడుతుందా లేదా వేచి చూడాలి.