Abn logo
Oct 22 2021 @ 22:41PM

కష్టం.. నష్టం!

వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న

పంటను సంరక్షించేందుకు రైతుల అవస్థలు  

మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వం

కొనుగోలు కేంద్రాల ఊసే లేని వైనం


(పాలకొండ)

- పాలకొండ మండలం గొట్టామంగళాపురం రహదారిపై మొక్కజొన్న పోగులు ఇవి. ఇటీవల కురిసిన వర్షాలకు పంటను ఎలా సంరక్షించాలో తెలియక కంకెలను ఇలా రహదారి పక్కన పారబోశారు. మొలకలు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


- మొక్కజొన్న గింజలు తడిచిపోవడంతో జి.సిగడాం గ్రామానికి చెందిన రైతులు రాజాం-శ్రీకాకుళం ప్రధాన రహదారిపై ఇలా ఆరబెట్టారు. ఇటీవల కళ్లాల్లో నూర్పులు పూర్తిచేయగా, గింజలు వర్షాలకు తడిసిపోయాయి. మొలకలు వస్తుండడంతో వ్యయప్రయాసలతో ఆరుబయట, రహదారులపై ఆరబోస్తున్నారు. 


...ఇలా మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. పంటను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది పంట ప్రారంభం నుంచే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, పొందూరు, జి.సిగడాం, రాజాం, పాలకొండ, వీరఘట్టం, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస మండలాల్లో 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా.. తరువాత తుపాన్లతో వర్షాలు పడడంతో సాగుకు ఉపక్రమించారు. పంట బాగానే పండుతున్న సమయంలో గులాబ్‌ తుపాను.. రైతుల ఆశలను అడియాశలు చేసింది. 30 శాతం పంట దెబ్బతింది. ఈ నేపథ్యంలో పక్షం రోజుల కిందట నుంచి మొక్కజొన్న కోతలు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కళ్లాలకు పంట చేర్చి నూర్పులు చేశారు. ఈ సమయంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొలాల్లో ఉన్న కంకెలు, కళ్లాల్లో ఉన్న గింజలు తడిసిపోయాయి. మొలకలు సైతం వస్తున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రహదారులపై ఆరబెడుతున్నారు. 


శ్రమే మిగులుతోంది

మొక్కజొన్న సాగులో శ్రమే మిగులుతోంది తప్ప పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యయప్రయాసలతో కూడిన పంట అని,  పెట్టుబడితో పాటు కూలీలు కూడా అవసరమని చెబుతున్నారు. ప్రస్తుతం కూలీల కొరత అధికంగా ఉండడంతో కుటుంబంలో చిన్న పిల్లల మొదలు పెద్దవారు వరకూ పనుల్లో గడుపుతున్నారు. దీనికితోడు మొక్కజొన్న మద్దతు ధర అంతంతమాత్రంగానే ఉంది. బహిరంగ మార్కెట్‌లో క్వింటా మొక్కజొన్న రూ.1,400 నుంచి రూ.1,600 వరకు మాత్రమే ఉంది. ప్రభుత్వం ఇంతవరకూ మద్దతు ధర ప్రకటించలేదు. కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. దీంతో దళారులు ప్రవేశించి తక్కువ ధరకు అడుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్దతు ధర కల్పించాలని మొక్కజొన్న రైతులు కోరుతున్నారు.