Abn logo
Sep 18 2020 @ 00:51AM

కుండపోత..ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జోరువాన

Kaakateeya

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగాయి. కుంటలు, చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. వరద ఉథృతికి తాత్కాలిక వంతెనలు, రహదారులు తెగి పలు గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించింది. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లు నేల కూలాయి.


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌ : వికారాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చే శివసాగర్‌ చెరువు మూడేళ్ల తర్వాత నిండుకుండను తలపిస్తోంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరదనీరు చెరువులోకి వచ్చి చేరింది. వికారాబాద్‌ పట్టణంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం తీసిన గుంతల్లో వర్షపునీరు చేరి పెద్ద చెరువును తలపిస్తోంది. 


కాగ్నా నదికి పెరిగిన వరద ఉధృతి

తాండూరు రూరల్‌/బషీరాబాద్‌ : కర్ణాటక-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులోని కాగ్నా నది వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతంలో కురు స్తున్న వర్షాలకు నీటి ప్రవాహం పెరిగింది. అదేవిధంగా కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగుపారుతుండటంతో ఆ వరద నీరు కాగ్నా నదిలో చేరుతుంది. దీనికి తోడుగా కర్ణాటక రాష్ట్రంలోని ఎగువన ఉన్న నాగరహళ్లి, చంద్రంపల్లి ప్రాజెక్టుల్లో నీరు కూడా కాగ్నా నదిలో కలవడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా తాండూరు మండల పరిధిలోని వాగుల నీరు కూడా కాగ్నా నదిలో బ్రిడ్జికి సమానంగా నీరు పారుతోంది. 


బషీరాబాద్‌ మండలంలో దెబ్బతిన్న పంటలు

బషీరాబాద్‌ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి, కంది పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. గురువారం పర్వత్‌పల్లి, మర్పల్లి, జీవన్గి తదితర గ్రామాల్లోని పంట పొలాలను వ్యవసాయాధికారులు పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. అదేవిధంగా బషీరాబాద్‌ మండలంలోని నావల్గ, మైల్వార్‌, ఎక్మాయి తదితర గ్రామాల్లోని చెరువులు నిండి అలుగు పారాయి. 


తాండూరు-చించొళి మార్గంలో రోడ్డుకు మరమ్మతు 

తాండూరు రూరల్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాండూరు-చించొళి రోడ్డు మార్గంలోని రోడ్డంతా గుంతలమయంగా మారింది. దీంతో గురువారం కరన్‌కోట్‌ రూరల్‌ సీఐ జలందర్‌రెడ్డి, ఎస్‌ఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో కొంతమంది ఎస్కవేటర్‌(జేసీబీ) సహాయంతో ఐనెల్లి గ్రామశివారులో నాపరాతి ముక్కలు వేసి చదును చేసే పనులు చేపట్టారు. 


అలుగుపారుతున్న లక్నాపూర్‌ ప్రాజెక్ట్‌

పరిగి(రూరల్‌): పరిగి మండలపరిధిలోని లక్నాపూర్‌ ప్రాజెక్ట్‌ అలుగు పారుతుంది. భారీ వర్షాలకు ప్రాజెక్ట్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఈ సీజన్‌లో అలుగుపారటం ఇది రెండోసారి. లక్నాపూర్‌ ప్రాజెక్ట్‌కు గురువారం సందర్శకుల తాకిడి పెరిగింది. 


కొట్టుకుపోయిన రుద్రారం తాత్కాలిక వంతెన

ధారూరు: ధారూరు మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. 42.04 మిల్లీమీటర్ల వర్షపాతం నమో దైంది. దోర్నాల-ధారూరు స్టేషన్‌ గ్రామాల మధ్య ఉన్న వాగు తాత్కాలిక వంతెన వరదనీటి ఉధృతికి పూర్తిగా తెగి కొట్టుకు పోయింది. దీంతో ఆ గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ స్థంభించింది. ఎబ్బనూరు, నాగారం, అల్లీపూర్‌ చెరువులు నీటితో నిండిపోయాయి. ధారూరు మండలపరిధిలోని రుద్రారం-నాగసమందర్‌, దోర్నాల్‌-ఽ దారూరు స్టేషన్‌, రాంపూర్‌-మన్‌సాన్‌పల్లి గ్రామాల మధ్య తాత్కాలిక వంతెనలు తెగిపోవడంతో మన్‌సాన్‌ పల్లి, నాగసమందర్‌, దోర్నాల్‌ గ్రామాల వైపు నుంచి ధారూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా పలు గ్రామాల్లో భారీ వర్షానికి పంటలు నేలవాలాయి. 


మేడ్చల్‌ జిల్లాలో..

ఘట్‌కేసర్‌ :  ఘట్‌కేసర్‌ మండలంలో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. 112.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు మత్తళ్ల పరవళ్లు తొక్కాయి. భారీవర్షానికి ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని 2వ, 3వ, వార్డులలోని పలు ఇళ్లల్లోకి మురుగునీరు చేరింది. ఎన్‌ఎఫ్‌సీనగర్‌ కాలనీలో సి-2, బి-2లలో భూగర్భ డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉండ టంతో జనాలు తెల్లవారేదాకా ఇళ్లల్లోకి చేరిన మురుగు నీటిలోనే గడిపారు. అలాగే జోడిమెట్ల వద్ద హైదరా బాద్‌-వరంగల్‌ హైవేపై వరదనీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, ఘట్‌కేసర్‌లోని మాధవరెడ్డి వంతెన సమీపంలోని రోడ్డుపైనుంచి భారీగా వరదనీరు ప్రవహించింది. 


చెరువును తలపిస్తున్న అవుశాపూర్‌ అండర్‌పాస్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌ : ఘట్‌కేసర్‌ మండలం, అవుశా పూర్‌లో వరంగల్‌-హైదరాబాదు జాతీయ రహదారిపై ఉన్న అండర్‌పాస్‌ బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు నిలిచింది. అదేవిధంగా సర్వీసు రోడ్డు వద్ద నిలిచిన వర్షపు నీరు చెరువును తలపించింది. గురువారం కాంగ్రెస్‌ నాయకులు కవాడి మాధవరెడ్డి సర్వీసు రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని పరిశీలించారు.


కీసరలో భారీ వర్షం

కీసర: కీసరలో బుధవారం రాత్రి భారీ వర్షం కురి సింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మల్లిఖార్జుననగర్‌ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కరీంగూడ గ్రామంలో పిడుగు పడటంతో మల్లేష్‌గౌడ్‌, ఉమామహేశ్వర్‌గౌడ్‌, రవీందర్‌గౌడ్‌, సుధాకర్‌ ఇళ్లలోని విద్యుత్‌ పరికరాలు కాలిపోయాయి. 


రంగారెడ్డి జిల్లాలో..

 చేవెళ్ల / మొయినాబాద్‌ రూరల్‌ : చేవెళ్ల నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వర్షానికి మల్కాపూర్‌కు చెందిన చాకలి మల్లేశ్‌ పెంకుటిళ్లు కూలి పోయింది. ఆయా గ్రామాల్లోని పంట పొలాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది. మొయినాబాద్‌ మండలంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఈసీ, మూసీ వాగులు నిండుగా పారాయి. 

Advertisement
Advertisement