Abn logo
Oct 25 2020 @ 15:33PM

చైనా దురాక్రమణకు ప్రభుత్వం, ఆరెస్సెస్ వత్తాసు : రాహుల్ గాంధీ

Kaakateeya

న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించుకున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్‌కు తెలుసునని, అయినప్పటికీ, దీనిని ఎదుర్కొనడానికి భయపడుతున్నారని ఆరోపించారు. మరోవైపు మోహన్ భగవత్ దసరా సందర్భంగా మాట్లాడుతూ, భారత దేశం సైనికపరంగా చైనాకు వ్యతిరేకంగా మెరుగ్గా సిద్ధం కావలసిన అవసరం ఉందన్నారు. 


రాహుల్ గాంధీ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘గుండె లోతుల్లో, మోహన్ భగవత్‌కు సత్యం తెలుసు. ఆ సత్యం ఏమిటంటే, మన భూమిని చైనా ఆక్రమించింది. భారత ప్రభుత్వం, ఆరెస్సెస్ అందుకు వత్తాసు పలికాయి’’ అని ఆరోపించారు. ఈ ట్వీట్‌కు విజయ దశమి సందర్భంగా మోహన్ భగవత్ ప్రసంగం తాలూకు న్యూస్ క్లిప్పింగ్‌ను జత చేశారు. 


మోహన్ భగవత్ విజయ దశమి సందర్భంగా మాట్లాడుతూ, చైనా సామ్రాజ్యవాద దేశమని ఆరోపించారు. చైనాకు వ్యతిరేకంగా నేపాల్, శ్రీలంక వంటి పొరుగు దేశాలతో కూటమిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. భారత రక్షణ దళాలు, ప్రభుత్వం, ప్రజలు దృఢంగా వ్యవహరిస్తున్నారని, మన భూభాగాలను ఆక్రమించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై ఘాటుగా స్పందిస్తున్నారని చెప్పారు. తాము అందరితో స్నేహం కోరుకుంటామని, అది తమ స్వభావమని చెప్పారు. 


Advertisement
Advertisement