Abn logo
Aug 6 2020 @ 23:37PM

నిర్మల్‌ బొమ్మల నేపథ్యంలో...

తెలంగాణ సంస్కృతిలో భాగమైన నిర్మల్‌ బొమ్మల నేపథ్యంలో రూపొందుతోన్న సందేశాత్మక ప్రేమకథా చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్‌, ముస్కాన్‌ సేథీ జంటగా టీడీ ప్రసాద్‌వర్మ దర్శకత్వంలో పుప్పాల సాగరిక నిర్మిస్తున్న చిత్రమిది. పుప్పాల కృష్ణకుమార్‌ నిర్మాణసారథి. దర్శకుడు శ్రీనివాసరెడ్డి అందించిన స్ర్కీన్‌ప్లేతో, ఆయన దర్శకత్వ పర్యవేక్షణ, సమర్పణలో తెరకెక్కుతోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకు సిద్ధంగా ఉందీ సినిమా. పుప్పాల కృష్ణకుమార్‌ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఆదిలాబాద్‌ అటవీ ప్రాంతంలో లభించే పొనికి చెక్కతో ప్రాణం పోసుకునే నిర్మల్‌ బొమ్మ, ప్లాస్టిక్‌ బొమ్మల తాకిడితో కుదుపులకు లోనయ్యింది. నిర్మల్‌ బొమ్మల తయారీ పరిశ్రమపై ఆధారపడిన కళాకారుల ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ప్రేమకథతో సినిమా రూపొందించాం’’ అన్నారు. అలీ, కృష్ణభగవాన్‌, అన్నపూర్ణమ్మ తదితరులు నటించిన ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ఎం.ఎం. శ్రీలేఖ సంగీత దర్శకురాలు.

Advertisement
Advertisement
Advertisement