కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో మూతపడిన సినిమా థియేటర్లు శుక్రవారం తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో, కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ థియేటర్ యాజమానులు ఎట్టకేలకు తెరపై బొమ్మను ప్రదర్శించారు. కరోనా కాలంలో సెల్ఫోన్లు, లాప్‌టాప్‌ల్లో సినిమాలు చూసేసిన జనం థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురు చూశారు. సినిమా సెలబ్రిటీలకు ఇందులో మినహాయింపు లేదు. ‘టెనెట్’ ఆంగ్ల చిత్రంతో మల్టీప్లెక్స్ థియేటర్లు తెరుస్తున్నట్లు ప్రకటించగానే . ఎంతో కాలంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిన సాధారణ జనం సహా హీరోలు, దర్శకులు థియేటర్ బాట పట్టారు. శుక్రవారం విడుదలైన ‘టెనెట్’ను వీక్షించేందుకు హీరోలు సాయిధరమ్‌తేజ్, నిఖిల్, దర్శకులు మారుతి, నాగ అశ్విన్ ప్రసాద్ ఐమాక్స్‌లో సందడి చేశారు. చాలాకాలం తర్వాత థియేటర్లో సినిమా చూసిన ఆనందాన్ని పంచుకున్నారు. ‘టెనెట్’ సినిమాను వీక్షించేందుకు ఇంటి నుంచి బయలుదేరి థియేటర్లో అడుగుపెట్టిన దృశ్యాన్ని సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దాదాపు ఎనిమిది నెలల తర్వాత బిగ్ స్ర్కీన్‌పై సినిమా చూడటం కొత్త అనుభూతిని కలిగించింది. వెండితెరపై సినిమాను చూడటమంటేనే అద్భుతమైన వినోదం. చాలామంది ఇలాగే భావిస్తారు. ప్రతి ఒక్కరూ తిరిగి థియేటర్లకు రండి. సినిమాను మళ్లీ సెలబ్రేట్ చేసుకుందాం’’ అని తేజ్ అన్నారు. థియేటర్‌కు వచ్చే ముందు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని తేజ్ సూచించారు. సాయి ధరమ్ తేజ్‌తో పాటు దర్శకుడు మారుతి కూడా ఐమ్యాక్స్‌కు వచ్చి సినిమా చూశారు. ‘‘చాలాకాలం తర్వాత థియేటర్లోకి వస్తే మళ్లీ మా జీవితాల్లోకి వచ్చిన అనుభూతిని కలిగించింది. ప్రేక్షకులంతా కూడా థియేటర్లలో సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి’’ అని మారుతి పిలుపునిచ్చారు. ‘‘చాలా అంటే చాలా రోజుల తర్వాత థియేటర్‌కి వెళ్లాను. భారీ తెరపై ‘టెనెట్’ అద్భుతంగా ఉంది. ఏఎంబీ సినిమాస్‌లో థియేటర్ హౌస్‌ఫుల్ కావడం సంతోషంగా ఉంది’’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. ‘‘టెనెట్’ సినిమాను థియేటర్లో చూడాలనుకుంటున్నా. చాలాకాలం తర్వాత థియేటర్లో అడుగుపెట్టడం కొత్త అనుభూతిని కలిగించింది’’ అని హీరో సుశాంత్ అన్నారు. యువ కథానాయకుడు విశ్వక్సేన్ ‘వి ఆర్ బ్యాక్’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దర్శకుడు నాగ అశ్విన్ కూడా ఐమాక్స్ థియేటర్లో సందడి చేశారు. ‘వెల్కమ్ టు థియేటర్స్’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల ట్వీట్ చేశారు.