Abn logo
Jul 11 2020 @ 14:47PM

ప్రకాశం : నిర్లక్ష్యానికి పరాకాష్టగా క్వారంటైన్ సెంటర్లు

ఒంగోలు : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ప్రకాశం జిల్లాలో క్వారంటైన్ సెంటర్లు నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారాయి. క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ అంటే ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం అని జిల్లా వాసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా.. జిల్లాలోని గిద్దలూరు పట్టణంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుకు తీసుకువచ్చిన బెడ్లు రొడ్ల పైనే దర్శనమిస్తుండటం గమనార్హం. లక్షలకు లక్షల ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ బెడ్లు ఎండకు ఎండి వానకు తడుస్తున్నా ప్రభుత్వాధికారులు పట్టించుకోవట్లేదని జనాలు మండిపడుతున్నారు. 


మరోవైపు.. ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ క్వారంటైన్‌లో పరిస్థితి అయితే మరీ అద్వాన్నంగా ఉంది. కనీసం పట్టించుకోనే నాధుడే లేడంటూ కరోనా అనుమానితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మమ్మల్ని ఎందుకిలా చూస్తున్నారు.. మేమూ మనిషులమే’ అంటూ అనుమానితులు, బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంటి పిల్లలతో ఉంటే తల్లులు , మహిళల ఆవేదన వర్ణనాతీతం అని తోటి కరోనా అనుమానితులు మీడియాకు చెబుతున్నారు. నాణ్యమైన మందులు, ఆహారం లేక పలువురు బాధితులు, అనుమానితులు అలమటిస్తున్న వైనం ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఇకనైనా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఈ విషయాలపై స్పందించి పరిస్థితి చక్కబెట్టాలని జిల్లా వాసులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement