Abn logo
Aug 6 2020 @ 01:06AM

పి.వి: ‘ఫిలాసఫర్‌ కింగ్‌’

తత్వవేత్తలకు అధికారం అప్పచెపితే వాళ్లకుండే జ్ఞానం వలన, విశాల దృక్పథం వలన అధికారం ఒక మెరుగైన రూపాన్ని సంతరించుకుంటుందని ప్లేటో ప్రతిపాదించాడు. జ్ఞానానికి అధికారానికి ఉండే సంబంధాన్ని పరిశీలిస్తే జ్ఞానం అధికారాన్ని ప్రభావితం చేస్తుందా లేక అధికారమే జ్ఞానాన్ని నిర్దేశిస్తుందా అంటే అధికారానిదే పై చేయి అవుతుంది. నిజానికి జ్ఞానం అధికారానికి ఊడిగం చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. పి.వి. దానికొక ఉదాహరణ.


పి.వి.నరసింహారావు 1970లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌ గ్రామాల్లో వరసగా మాట్లాడుతున్నారు. నేను మా పరిశోధన బృందం, ఎన్నికల తీరుతెన్నుల మీద అధ్యయనం చేస్తూ ప్రచార తీరును పరిశీలిస్తున్నాం. ఒక మీటింగ్‌ నుండి ఇంకొక మీటింగ్‌కు వెళ్తూ మార్గ్గమధ్యంలో ఆయన కొంతసేపు ఆగారు. ఎన్నికల తీరుతెన్నులు ఎలా ఉన్నాయని అడిగితే, ప్రజలలో కాంగ్రెస్‌ పార్టీ పట్ల ఎనలేని విశ్వాసమున్నదని, పార్టీయే ప్రజల ఆకాంక్షల స్థాయికి తగినంతగా స్పందించలేదని, ప్రజలని పార్టీ ఎంత పట్టించుకోవాలో అంత పట్టించుకోలేదని, ఐనా ప్రజల స్పందన చైతన్యం చూస్తే ప్రజాస్వామ్య పునాదులు దృఢంగానే ఉన్నాయని అన్నారు. ఇది ఒక విధంగా రాజకీయాలకు బయట ఉన్న ఒక విద్యావేత్త మాట్లాడినట్లనిపించింది. పి.వి.కి అనుభవాన్ని సూత్రీకరించే ప్రావీణ్యత ఉండేది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ విరమణ చేసిన తరువాత తమ గ్రామంలో ఏదో కుటుంబ కార్యక్రమానికి వచ్చారు. అది తెలిసి సొసైటీ ఫర్‌ సోషల్‌ సైన్సెస్ తరఫున సంస్థ నిర్వహించే సదస్సులో ప్రసంగించవలసిందిగా కోరినప్పుడు, తర్వాత ఎప్పుడైనా వస్తానని సున్నితంగా అంటూ రాష్ట్ర రాజకీయాలమీద కొంత చర్చచేశారు. తాను భూసంస్కరణలు చేపట్టినందుకే ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాననీ, గ్రామీణ వ్యవస్థలో ఆధిపత్య సంబంధాలు మారాలంటే భూసంస్కరణల అవశ్యకత ఉన్నదన్నారు. 1948 తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాడుగా, ‘గొల్ల రాములమ్మ’ కథను వ్రాసిన వాడుగా, గ్రామీణ ప్రాంతాల్లో రావలసిన మౌలిక మార్పుల గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉన్నవాడే. అలా అని పట్టుదలతో రాజీపడకుండా భూసంస్కరణలను అమలు చేయాలనుకున్నాడనేది అనుమానస్పదమే. కొన్ని విశ్లేషణల ప్రకారం పి.వి. ప్రవేశపెట్టిన భూసంస్కరణల వ్యతిరేకతే, జై ఆంధ్ర ఉద్యమానికి ముఖ్యకారణమని వాదించిన వారు ఉన్నారు.


ఇక 1980లలో కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత పి.వి. నన్ను కలుస్తానని తన సన్నిహితుడు ఒకరితో కబురు పంపారు. ఆయనను కలవాలనే సంసిద్ధత ఎందుకో నాకు లేదు. నన్ను కలసిన పెద్ద మనిషి రెండవసారి వచ్చి పి.వి. కలుస్తానంటే కలువకపోవడం మర్యాద కాదని వాదిస్తే ఒప్పుకున్నాను. నేను పి.వి.ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు, మంచం మీద పడుకునే దాదాపు గంట, గంటన్నర సేపు మాట్లాడారు. నన్ను ఇబ్బంది పెట్టాలనేది తన ఉద్దేశం కాదని, తన భూములలో నక్సల్స్‌ జండాలు పాతారనో, తమ ఇంటి మీద దాడి చేసారనో తాను మాట్లాడదల్చుకోలేదని అవి చరిత్ర గమనంలో ఏ ప్రాధాన్యత లేని అంశాలన్నారు. నక్సల్‌ ఉద్యమం ఒక విధంగా చరిత్ర గర్భంలో నుంచి పుట్టిన ప్రత్యామ్నాయ రాజకీయమని, చరిత్ర గమనాన్ని, భవిష్యత్తును అలాంటి రాజకీయాలే ప్రభావితం చేస్తాయని, ప్రత్యామ్నాయ రాజకీయాలు దారి తప్పితే లేదా లోపభూయిష్ఠంగా ఉంటే చరిత్రకు అన్యాయం జరుగుతుందనే ఒక చారిత్రక కోణాన్ని పేర్కొన్నారు. తన ఆలోచనని ఒక చారిత్రక చట్రంలో పెట్టడం చూసి నేను కొంత ఆశ్చర్యపోయాను.


నేను దేశంలో పెరుగుతున్న పేదరికాన్ని గురించి, అసమానతల గురించి, వివక్ష గురించి ప్రస్తావిస్తూ కొన్ని రోజుల ముందు తెనాలిలో ఒక దళిత కుటుంబంతో ఒక పగలు గడిపానని, అభివృద్ధి ఎవరి కొరకు జరిగింది అనే ప్రశ్న అడగక తప్పదన్నాను. దానికి ఆయన స్పందిస్తూ అభివృద్ధి వ్యక్తుల, పార్టీల మీద కాక దానికంటూ ఒక చలనం ఉంటుందని, ఆ దిశలో మన ప్రమేయం లేకుండా అది సాగుతుందని, వ్యక్తులు కొంత వరకు మాత్రమే ప్రభావం చేయగలరని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత, తాను రాజకీయాల నుండి విరమణ తీసుకుని, సమయాన్ని పూర్తి కాలం పరిశోధనకు, గ్రంథ రచనకు వినియోగించాలని ఆలోచిస్తున్నానని, దానికి రామనంద తీర్థ ఇన్‌స్టిట్యూట్‌ని అభివృద్ధి చేద్దామనుకుంటున్నానని, ఆ సంస్థ బాధ్యతలు తీసుకుంటారా అని అడిగారు. నేను ఇటీవలే ‘సెస్‌’ నుండి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మారానని చెబుతూ, బోధనలో ఉన్న సంతృప్తి వల్ల, మళ్ళీ పరిశోధనా సంస్థకు రావడం ఇష్టం లేదన్నాను. రాజకీయాలలో తనకు ఆసక్తి తగ్గుతున్నదంటూ తన అనుభవంలోని ఒకటి రెండు సంఘటనలు పి.వి. ఆ సందర్భంలో చెప్పారు. తాను విద్యామంత్రిగా నూతన విద్యా విధానాన్ని రూపకల్పన చేసానని దానిని అమలు చేయాలనే ఉత్సాహంతో ఉన్నప్పుడు రాజీవ్‌ గాంధీ తనను సంప్రదించకుండా విద్యాశాఖ నుండి విదేశీ శాఖకు మార్చారని చెపుతూ, ఒక విధానాన్ని అమలు చేస్తున్న సందర్భంలో అలా పోర్టుఫోలియోలు మార్చడం సరియైంది కాదన్నారు. ఇదే మాట తాను రాజీవ్‌గాంధీతో అన్నానని, దానికి రాజీవ్‌గాంధీ తాను చైనా పర్యటించాలని నిర్ణయించుకున్నానని, విదేశాంగ మంత్రిగా తనకు తోడ్పడాలని పోర్టుఫోలియోను మార్చానని జవాబు ఇచ్చారని పివి చెప్పారు. 


పి.వి.కుండే అవగాహన, చారిత్రక కోణం చూసిన నాకు ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎలాంటి దృక్పథం అవలంబిస్తారోననే ఆసక్తి ఉండేది. ‘ఇంత పెద్ద బాధ్యతమీద పడింది, ఆయన ఏం చేయబోతున్నాడు’ అని పి.వి.కి చాలా సన్నిహితుడైన కాళోజీని అడిగితే ‘లేక లేక స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం వచ్చింది ఏం చేస్తాడో చూద్దాం’ అని కాళోజీ అన్నారు. పి.వి.ని నిజానికి కార్పొరేటు పెట్టుబడి ఎన్నుకుంది. మేధోపరంగా చురుకై రాజకీయంగా బలహీనుడిని ప్రోత్సహించడం సామ్రాజ్యవాద పెట్టుబడి వ్యూహంలో భాగం. ఇదే కారణం వలన మన్మోహన్‌సింగ్‌ కూడా ప్రధాని అయ్యారు.


పి.వి. కుటుంబ సభ్యులు ఆయన స్మారకోపన్యాసం ఇవ్వాలని కొంత ఒత్తిడి పెట్టినపుడు అంగీకరించి కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసం ఇచ్చాను. అ ప్రసంగంలో ప్లేటో ‘ఫిలాసఫర్‌ కింగ్‌’ భావనని పి.వి.కి అన్వయిస్తే ఎలా ఉంటుంది అనే దానిని ప్రధాన అంశంగా చేస్తూ మాట్లాడాను. తత్వవేత్తలకు అధికారం అప్పచెపితే వాళ్లకుండే జ్ఞానం వలన, విశాల దృక్పథం వలన అధికారం ఒక మెరుగైన రూపాన్ని సంతరించుకుంటుందని ప్లేటో ప్రతిపాదించాడు. జ్ఞానానికి అధికారానికి ఉండే సంబంధాన్ని పరిశీలిస్తే జ్ఞానం అధికారాన్ని ప్రభావితం చేస్తుందా లేక అధికారమే జ్ఞానాన్ని నిర్దేశిస్తుందా అంటే అధికారానిదే పై చేయి అవుతుంది. నిజానికి జ్ఞానం అధికారానికి ఊడిగం చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. పి.వి. దానికొక ఉదాహరణ.


పి.వి.కి భూసంస్కరణల మీద ఆసక్తి ఉండవచ్చు, లేదా అసమానతలు తగ్గించాలి అనే కోరిక ఉండవచ్చు, రామానంద తీర్థ ప్రభావం ఉండవచ్చు, తెలంగాణ పోరాట ప్రభావం ఉండవచ్చు. కాని తీరా ప్రధాన మంత్రి పదవిలో కూర్చుంటూనే వీటన్నింటిలో దేనితో ప్రమేయం లేకుండా నియో లిబరల్‌ పాలసీలని పెద్ద ఎత్తున, అలాగే అంతకుముందు మానవ వనరుల మంత్రిగా ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని అమలు చేసాడు. ఆ రెండిటిలో కూడా ఆయన ఆలోచనకి ఆచరణకి మధ్య కొట్టవచ్చినంత దూరం కనిపిస్తుంది. నూతన విద్యా విధానం కొఠారి కమిషన్‌ స్ఫూర్తిని దాదాపు తిరస్కరిస్తూ విద్యలో అంతరాలను సృష్టించింది. అది విద్యారంగ ప్రైవేటీకరణకు దారి తీసి రెండు భిన్న ప్రపంచాలను సృష్టించింది. అందరికి సమానమైన, నాణ్యమైన, ఉచితమైన విద్య అందించాలనే ఆశయాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసింది. నియో లిబరలిజం దేశ ఆర్థిక వ్యవస్థని దాదాపు సామ్రాజ్యవాద గుప్పిట్లోకి నెట్టింది. ఆయన ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందని, ఆ సంక్షోభం నుండి పి.వి. మన్మోహన్‌ సింగ్‌ జోడీ దేశాన్ని కాపాడారని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ ప్రశంసించే వాళ్ళు ఈ ఆర్థిక వ్యవస్థ ఎందుకు సంక్షోభంలో పడిందనే ప్రశ్న అడగరు. నిజానికి 1980వ దశకంలో దేశ మార్కెట్‌ను ప్రపంచ పెట్టుబడికి తెరిచినప్పుడు దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గడంతో విదేశీ మారక ద్రవ్యనిధుల్లో తీవ్ర లోటు ఏర్పడింది. ఈ లోటు ప్రపంచీకరణ ఫలితమే. ప్రపంచీకరణే నిజమైన కారణమైనప్పుడు మరింత ఉధృతమైన సంస్కరణలు సంక్షోభానికి పరిష్కారమెలా అవుతాయనే ప్రశ్న అడగడమే తప్పుగా భావించిన రోజులవి. దాని పర్యవసానాన్ని చూస్తూనే ఉన్నాం.


చరిత్ర వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా అంచనా వేస్తుంది. ఏ విధానాలు అవలంబించారు అనే ప్రశ్న కంటే దీర్ఘకాలంలో వాటి పర్యవసానాలని బట్టి అంచనాలుంటాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ అమలు చేసిన అభివృద్ధి నమూనా ప్రభావం రెండు, మూడు దశాబ్దాలు ఉన్నా, నియో లిబరలిజంతో ఆయన నిర్మించిన సంస్థలు, వ్యవస్థలు నిర్వీర్యపరచడమేకాక ప్లానింగ్‌ కమిషన్‌ లాంటి సంస్థలను రద్దు చేసారు. ఇవ్వాళ అధికారంలో ఉండే పార్టీ విధానాలన్నీ చరిత్ర పరీక్షకు నిలవడం కష్టం. సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం లాంటి ఉదాత్త ఆశయాలు, ఆచరణ వ్యక్తులను చరిత్రలో నిలబెడతాయి. ఇవి పి.వి.కి తెలియవని కాదు. చారిత్రక అవగాహన ఉన్నవాడే కాని తనకు చరిత్ర అందించిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవడానికి ఆయన వ్యక్తిగత పరిమితులే కాక ఆయనే చెప్పినట్లు చరిత్ర నిర్దేశించిన హద్దులు కూడా దానికి కారణం. ఫిలాసఫర్‌ కింగ్‌ అవుతే సమాజాలకు ప్రయోజనం ఉంటుదన్న ప్లేటో సూత్రీకరణ ప్రాయోజికత పరిమితులను స్పష్టంగా పి.వి. అనుభవం నుండి చూడవచ్చు.

ప్రొ.జి. హరగోపాల్‌

Advertisement
Advertisement
Advertisement