Abn logo
Oct 17 2020 @ 05:01AM

ఇవేం నిర్ణయాలు?

Kaakateeya

అస్తవ్యస్తంగా పుష్కర ఘాట్ల ఎంపిక

నిధుల కేటాయింపుపై విమర్శలు 

శ్మశానాన్ని ఆనుకుని పుష్కర ఘాట్‌ 

13 ఘాట్లలో పారిశుధ్యానికి రూ.2.2 కోట్లు

కేఎంసీ 7 ఘాట్లకు రూ.30 కోట్లు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: పుష్కరాల గురించి ఏడాది ముందే అధికారులు, ఎంపీ టీజీ వెంకటేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదు. సరిగ్గా రెండు నెలల ముందే నిద్ర లేచి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించింది. పుష్కరాల్లో ప్రధానమైన ఘాట్లను తొలగించి, తక్కువ ఉపయోగమున్న వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. అరకొర ఏర్పాట్లు సరిపోయే ఘాట్లకు రూ. కోట్లను మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన ఘాట్లపై శీతకన్ను వేసింది. నిండా నెల కూడా సమయం లేదు. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేయడానికా అన్నట్లు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఘాట్ల పరిశీలనలో ఉన్న జిల్లా యంత్రాంగం రెండ్రోజుల్లో పనులు ప్రారంభించబోతున్నారు. 


శ్మశానం, పెంట కుప్పల్లో పుష్కర ఘాట్లు

ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన మునగాలపాడు సమీపంలోని పుష్కర ఘాట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఘాట్‌కు అతి సమీపంలో శ్మశాన వాటిక ఉంది. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఈ ఘాట్‌కు రూ.1.80 కోట్లను ప్రతిపాదించారు. 


 నగరానికి 27 కి.మీ దూరంలో గొందిపర్ల గ్రామంలో రూ. 26 లక్షలు పుష్కరఘాట్‌ నిర్మాణానికి మంజూరయ్యాయి. ఈ ఘాట్‌ కనుచూపు మేరంతా పెంట కుప్పలు ఉన్నాయి. ఘాట్‌కు ముందు రామలింగేశ్వర స్వామి గుడి ఉన్నప్పటికీ ఘాటకు ఆనుకుని 500 మీ. మేర పెంట కుప్పలు ఉన్నాయి. 


మంత్రాలయం సంత మార్కెట్‌ వద్ద పుష్కర ఘాట్‌కు కూడా రూ.1.20 కోట్లు మంజూరు చేశారు. ఇది ఊరి శ్మశానానికి ఆనుకుని ఉంది. శ్మశానం పక్కనే ఉండే ఘాట్‌కు ఇన్ని కోట్లు వెచ్చించారంటే పుష్కరాల కాలంలో తాత్కాలికంగా శ్మశానాన్ని నిలిపివేస్తారా? అనే సందేహం భక్తుల్లో ఉంది. 


కోడుమూరు నియోజకవర్గంలోని మామిడాలపాడు గ్రామం కర్నూలు టౌన్‌కు 2 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ ఘాట్‌ హైదరాబాద్‌ జాతీయ రహదారికి దగ్గరగా ఉన్నందు వల్ల దీన్ని బాగు చేస్తే రోజుకు పది వేల మందికి పైగా భక్తులు వెళ్లవచ్చు. 


నగరంలో ఏర్పాటు చేస్తోన్న 7 పుష్కర ఘాట్లపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. అతి తక్కువ పనులతోనే పుష్కరాలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇందుకోసం పుష్కర ఘాట్ల నిర్మాణాలకు రూ.7.70 కోట్లు మంజూరు చేశారు. రూ.30 కోట్లను కర్నూలు కార్పొరేషన్‌కు కేటాయించగా.. ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయం నియోజకవర్గ పరిధుల్లోని 13 పుష్కర ఘాట్లలో పారిశుధ్య ఏర్పాట్లకు మాత్రం కేవలం రూ.2.2 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. ఈ నిధులతో ఘాట్ల వద్ద మరుగుదొడ్లు, నీటి సరఫరా ఏర్పాట్లు, సంపులు, స్ర్తీల వస్ర్తాలు మార్చుకునే గదులు తదితరాలు సంబంధిత ఇరిగేషన్‌ అధికారులే చూస్తారు. 


దేవదాయశాఖ, రెవిన్యూ, అర్‌అండ్‌బీ, హెల్త్‌, ఫుడ్‌ అండ్‌ అండ్‌ కంట్రోలర్‌, విద్యుత్‌ శాఖకు కూడా ప్రత్యేకంగా మరిన్ని నిధులు మంజూరు కానున్నాయి. 


ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందవరం మండలం గురుజాల రామలింగేశ్వరస్వామి ఆలయం దగ్గర, మరోటి నాగలదిన్నె గ్రామంలోని బ్రిడ్జి దగ్గర తుంగభద్ర పుష్కరఘాట్లను ఎంపిక చేశారు. ఇందుకుగాను గురుజాలలో ఘాట్‌ నిర్మించేందుకు రూ. 1 కోటి, నాగలదిన్నె దగ్గర నిర్మించేందుకు రూ. 1.10 కోట్లు నిధులు కేటాయించారు. అయితే నిధులు కేటాయింపుపై భక్తులు, ప్రజలు పెదవి విరుస్తున్నారు. గత పుష్కరాల సమయంలో గురజాలలో ఘాట్ల ఏర్పాటుకు రూ.60 లక్షలు కేటాయించారని, ప్రస్తుతం రూ. 1కోటి కేటాయించటం ఎంతవరకు సమంజసమని ప్రజలు అంటున్నారు. భక్తులు అంతంత మాత్రంగానే వచ్చె నాగలదిన్నె దగ్గర పుష్కరఘాట్లకు గురజాల కన్నా ఎక్కువగా రూ. 1.10 కోట్లు కేటాయించారు. 

 

అక్కడ అధిక నిధులు 

మంత్రాలయంలో పుష్కరఘాట్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. మంత్రాలయంలో నదిని ఆనుకుని ఎన్‌ఏపీ స్కీం దగ్గర రూ. 1.30 కోట్లతో, సంత మార్కెట్‌ దగ్గర రూ. 1.20 కోట్లతో, వినాయక ఘాట్‌ దగ్గర రూ. 1.30 కోట్లతో ఘాట్లు నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. అలాగే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్వగ్రామమైన రాంపురంలోని రామలింగేశ్వరస్వామి ఆలయం దగ్గర ఓ ఘాట్‌కు రూ. 2 కోట్లు, అదే గ్రామంలో మరో ఘాట్‌ నిర్మాణానికి రూ. 1.50కోట్లు నిధులు కేటాయించారు. అలాగే కాచాపురం రైల్వే బ్రిడ్జి దగ్గర ఘాట్‌ నిర్మాణానికి రూ. 1.50 కోట్లు కేటాయించారు.


అయితే భక్తులు అత్యధికంగా పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి వెలసిన ప్రాంతంలో పుష్కర స్నానాలకు ఆసక్తి చూపుతారు. ఫలితంగా పలు రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా వస్తారు. అటువంటి ప్రాంతంలో మరో రెండు పుష్కర ఘాట్లు నిర్మించకుండా భక్తులు అంతంత మాత్రంగానే వచ్చి స్నానాలు ఆచరించే ప్రాంతంలోని రాంపురంలో రెండు ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేగాక మంత్రాలయంలో మూడు ఘాట్ల ఏర్పాటుకు సంబంధించి రూ. 3.80 కోట్లు కేటాయించగా ఎమ్మెల్యే స్వగ్రామమైన రాంపురంలో రెండుఘాట్లకు రూ. 3.50 కోట్లు కేటాయించారు. మంత్రాలయంలో ఎన్‌ఏపీ స్కీం ప్రాంతంలో ఏర్పాటు చేసే వీఐపీ ఘాట్‌ దగ్గర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మొత్తం మీద ఘాట్ల నిర్మాణంలో అస్తవ్యస్తమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement