Abn logo
Sep 12 2020 @ 00:42AM

ప్రజావేదిక

దేశంలో ప్రజాస్వామ్యం బాగానే వర్ధిల్లుతున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణలో ఉభయసభలు సమావేశమయ్యాయి. మహమ్మారి కరోనా వల్ల ఉత్పన్నమయిన పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ చేశారు. తొలి ఎన్నికల మేనిఫెస్టోలోనే వాగ్దానం చేసిన సమూల రెవెన్యూ సంస్కరణలు ఒక కొలిక్కి వచ్చి చట్టరూపం ధరిస్తున్నప్పుడు ఎంతో ఉదారంగా ఒక రోజంతా చర్చ జరిగింది. ప్రభుత్వం ఇంకా ఆమోదింపజేసుకోవలసిన బిల్లులు ఉంటాయి. వారు ప్రజలకు చెప్పదలచుకున్న విషయాలను ధారాళంగా చెప్పుకుంటారు. మరో మూడు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు కూడా జరగనున్నాయి. అక్కడ కూడా పదిహేను రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీలు కానీ, పార్లమెంటు కానీ, ఆరునెలలకో సారి తప్పనిసరిగా సమావేశం కావాలి. అంటే సమావేశాల మధ్య వ్యవధి ఆరునెలలకు మించకూడదు. సరిగ్గా, అట్లా మించకుండా, జాగ్రత్తపడుతూ సమావేశాలు జరుగుతాయి.


ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడడానికి ప్రజాప్రతినిధులకు పెద్దగా ఆసక్తి ఉండని రోజులు వచ్చాయి. ప్రజలు ఏమి భావిస్తున్నారో, ఏ అంశాలపై వివరణలు, సందేహ నివృత్తులు కోరుతున్నారో తెలుసుకునే ఉద్దేశ్యం కూడా వారిలో ఉన్నట్టు కనిపించదు. ప్రజాస్వామ్యం ఎంతో చురుకుగా, చైతన్యవంతంగా ఉన్నదని నిరూపించే తరహా గంభీరమైన చర్చలు కూడా ఇటీవలి కాలంలో జరగడం లేదు. నియమాల ప్రకారం జరగాలి కాబట్టి జరపడమే తప్ప, సభల వల్ల పెద్ద ప్రయోజనం ఏమున్నదని పెద్ద పెద్ద నేతలే భావించే రోజులివి. అధికారపక్షానికి ప్రజలను ఎట్లా మెప్పించాలో, లేదా మభ్యపెట్టాలో, లేదా దారికి తెచ్చుకోవాలో తెలుసు. పరిపాలనకు కావలసిన ముఖ్యమైన దినుసుల్లో సభలూ చర్చలూ ఉంటాయన్న నమ్మకం వారికి ఉండదు. ఇక ప్రతిపక్షం, అసలే చేవచచ్చి ఉంటుంది. కష్టపడి పనిచేసి, ప్రజాసమస్యలను చర్చకు రప్పించి అభిమానం పొందడం వంటి సుదీర్ఘ ప్రక్రియకు వారికి ఓపిక లేదు. కాబట్టి, ప్రజల గుండెకు గొంతు దొరకదు. మరి ఏమి చేయాలి? మన దేశంలో, రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచమంతా అదే తీరు. క్షేత్రస్థాయి వాస్తవికత ఏలికల దాకా వెళ్లి, ప్రజల ఆకాంక్షలు విధానరూపం తీసుకుని, అందరి బాధలు వినే, అందరి మనసులూ తెలుసుకునే వేదిక లేకపోతే, ప్రజాస్వామ్యం ఎట్లా మనుగడ సాగిస్తుంది?


అందుకే, ఇటీవల తెలంగాణ పౌరసమాజం నిర్వహించిన ‘ప్రజా అసెంబ్లీ’ని అభినందించాలి. ప్రజల చేతిలో ఉండవలసిన చట్టసభలు ప్రజలకు ఎడం అయిపోతే, ఆ దూరాన్ని భర్తీ చేయడానికి ప్రజలే పూనుకోవాలి. తెలంగాణ శాసనసభల సమావేశాల ప్రారంభ తేదీ సెప్టెంబర్‌ 7కు మూడు రోజుల ముందు నుంచి ఈ ప్రజాఅసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రంగాల సమస్యల లోతుపాతులను చర్చించి, ఆచరణకు ఉపయోగపడే మార్గదర్శకాలను ఈ సదస్సు విడుదల చేసింది. చివరి రోజున వివిధ రాజకీయపక్షాల నేతలను ఆహ్వానించి, ప్రజాకాంక్షల పత్రాన్ని (పీపుల్స్‌ చార్టర్‌)ను నివేదించింది. నిరుద్యోగం, సహజవనరుల వినియోగం, వ్యవసాయ, గ్రామీణ జీవనాధారాలు, విద్య, వైద్యం, ఆహారం, సాంఘిక భద్రత, అణగారిన వర్గాల హక్కులు, ప్రజాస్వామిక హక్కులకు ఎదురవుతున్న సవాళ్లు– ఈ అంశాల మీద చర్చ జరిగింది. గ్రామీణ, పట్టణ సామాజిక సేవకార్యకర్తలు, ఉద్యమ, ప్రజాసంఘాలు, అసంఘటిత కార్మికుల ప్రతినిధులు, ట్రాన్స్‌జెండర్‌లు, గృహకార్మికులు– వీరందరూ ఈ చర్చల్లో తమ తమ భావాలను, వైఖరులను వ్యక్తపరిచారు. ఉనికిలో ఉన్న అధికారిక చట్టసభలలో లేని ప్రాతినిధ్యాలకు కూడా ఈ వేదికలో చోటు దొరికింది. 


ఆరేళ్ల కిందట ఇంగ్లండ్‌లో ‘వినే పార్లమెంట్‌’ కోసమని ఒక ప్రయత్నం జరిగింది. వివిధ ప్రజావర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు కొందరు కలిసి, ఎట్లా పార్లమెంటు సభ్యులకు ప్రజాభిప్రాయాన్ని చేరవేయాలి? అని చర్చించారు. విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలు రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని, ప్రశ్నించే చైతన్యం తెచ్చుకుంటేనే భాగస్వామ్య ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని ‘వినే పార్లమెంట్‌’ ఉద్యమకారులు భావించారు. మన దేశంలో శాసనసభలు ఉద్దేశించిన లక్ష్యాలను నెరవేర్చలేకపోవడానికి అనేక వ్యవస్థాగత అంశాలతో పాటు, ప్రజలలో ఉన్న అవగాహనారాహిత్యం, విముఖత కూడా కారణాలుగా ఉన్నాయి. పశ్చిమదేశాలలో యువజన పార్లమెంట్‌లు, నమూనా పార్లమెంట్‌ వంటివి విద్యార్థి యువజనుల కోసం నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా యువజనులు రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలని కోరుతూ, 2019లో జాతీయ యువజన పార్లమెంటును నిర్వహించడానికి కారణమయ్యారు. వివిధ ప్రజా ఉద్యమాలు కూడా ఆయా సందర్భాలలో ‘మాక్‌ చట్టసభ’లను నిర్వహించడం, అవి అధికారిక సభల కంటే వేడిగా ఆలోచనాత్మకంగా జరగడం తెలిసిందే. వాటిని ఉద్యమరూపాలుగా తీర్చిదిద్దడమే జరగవలసింది. 


హైదరాబాద్‌లో జరిగిన ప్రజా అసెంబ్లీ కూడా మరింత ఆచరణాత్మకంగా జరిగి ఉండవలసింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముందుగా జరుపుతున్నారు కాబట్టి, ఏయే అంశాలు చర్చకు వస్తాయో ఊహించి, వాటి మీద ప్రజాదృక్పథాన్ని, సమాచారాన్ని అందిస్తే, అది శాసనసభ్యులను కూడా ప్రభావితం చేసి ఉండేది. అతి ముఖ్యమైన కరోనా వ్యాధి, వ్యాప్తి, ప్రజారోగ్య అంశాలపై ప్రభుత్వం స్పల్పకాలిక చర్చకే మొగ్గుచూపితే, ప్రజా అసెంబ్లీ కూడా ఒకానొక అంశంగా మాత్రమే స్వీకరించింది. అదే విధంగా, వ్యవస్థ మౌలిక అంశాల వివరణ, చర్చ నిరంతర చైతన్యీకరణ ప్రయత్నంలో భాగం కావాలి కానీ, ప్రజా అసెంబ్లీలో తక్షణ సమస్యలపైనే దృష్టి నిలపాలి. 


అధికారపక్షాలు వినడానికి నిరాకరిస్తున్నప్పుడు, ప్రతిపక్షాలు మాట్లాడలేనప్పుడు– తమ బాధలు అరణ్యరోదనం కాకుండా, ప్రజలు సృజనాత్మకమైన మార్గమేదో ఆశ్రయించాలి. అటువంటి చైతన్యశీలమైన, ప్రజాస్వామిక వేదికగా ముందుకు వచ్చిన ‘ప్రజా అసెంబ్లీ’ని అభినందించి, కొనసాగించవలసి ఉన్నది.

Advertisement
Advertisement
Advertisement