పత్తికొండ మార్కెట్‌కు వచ్చిన టమోటా
- టమోటా రైతుల కష్టాలు
- పంట వెనక్కి తీసుకెళ్లిన రైతులు
పత్తికొండ, జనవరి 17: టమోటా రైతులు వ్యాపార మాయజాలానికి బలవుతూనే ఉన్నారు. గత కొద్దిరోజుల క్రితం టమోటా కిలో రూపాయి కూడా పలకలేదు. ఆగ్రహించిన రైతులు టమోటాలను వీధుల్లో పార బోశారు. దీంతో మార్కెట్ యార్డు కిలో టమోటా రూ. 2 నుంచి రూ. 5లకు కొనుగోలు చేయడానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు తమకు అవసరమైన మేరకే పంటను కొనుగోలు చేస్తామని, మిగిలిన పంట తమకు సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో పొలాల్లో పంట కోసం రవాణా చార్జీలు పెట్టుకుని మార్కెట్‌కు తెచ్చిన టమోటాను ఏంచేయాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో కిలో రూ.2 నుంచి రూ.5.40 దాకా కొనుగోలు చేశారు. సాయం త్రం 4గంటల తరువాత మార్కెట్‌కు వచ్చిన పంటను కొనడానికి వ్యాపారులు ముందుకు రాలేదు. అదేమని రైతులు ప్రశ్నిస్తే తమ వాహనాలకు సరిపడినంత కొన్నామని, మిగిలిన టమోటాతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దీంతో కడుపు మండిన కొందరు రైతులు పంటను పారబోసి పోగా మరికొందరు చేసేదేమీ లేక రవాణా ఛార్జీలు పెట్టుకుని తిరిగి ఆటోలో గ్రామాలకు తీసుకెళ్లిపోయారు.
ఇబ్బంది పెడుతున్నారు
30 గంపల టమోటా నలుగురు మనుషులు కోశారు. రూ.300 ఆటో బాడుగ పెట్టి మార్కెట్‌కు అమ్మకానికి తెచ్చాం. కాయ దోరగా ఉందని కొనలేమని వ్యాపారులు చెప్పారు. ఏదో ఒక రూపంలో రైతులను వ్యాపారులు ఇబ్బందులు పెడుతున్నారు.
- రంగడు, పత్తికొండ
ఎద్దుల మేత కోసం తీసుకెళుతున్నా
ముగ్గురు మనుషులం కోత కోసి 14 గంపలు అమ్మకానికి మార్కెట్‌కు తెచ్చాం. వ్యాపారులు కొనమని తేల్చి చెప్పడంతో పంటను పారబోయలేక పశువుల దాణకైనా వస్తుందని తీసుకెళ్లుతున్నాం.
- బజారి, చిన్నహుల్తి
రూ.3 నుంచి రూ.5 కొంటాం
గిట్టుబాటు ధరపై మాపై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. పంట బాగుంటే రూ.3 నుంచి రూ.5 దాకా గిట్టుబాటు ధరను కల్పిస్తూ పంటను కొనుగోలు చేస్తాం. అంతకంటే ధర ఎక్కువ పడితే వ్యాపారులకు వదిలేస్తాం. వ్యాపారులు కొనుగోలు చేయని పక్షంలో మిగిలిన పంటను మేమే కొనుగోలు చేస్తాం. రేపటి నుంచి పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అమలు చేస్తాం.
- శ్రీనివాసులు, మార్కెట్‌యార్డు కార్యదర్శి