Abn logo
Sep 17 2021 @ 00:06AM

ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలి

సదస్సులో మాట్లాడుతున్న ఐఎఫ్‌టీయూ జాతీయ కార్యదర్శి ప్రసాద్‌

  • ప్రైవేటీకరణ వ్యతిరేక సదస్సులో వక్తలు

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 16: నరేంద్రమోదీ ప్రభుత్వం అను సరిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల, ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలని పలువురు వక్తలు అన్నారు. గురువారం రాజమహేంద్రవరం విక్రమహాలులో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు ఉపసంహరించాలని, సెప్టెంబరు 27న జరిగే భారత్‌బంద్‌ విజయవంతం చేయాలని కోరుతూ సదస్సు నిర్వహించారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి జేజే వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఐఎఫ్‌టీయూ జాతీయ కార్యదర్శి పి.ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాంగ్రెస్‌ కంటే దుర్మార్గంగా కార్మికుల హక్కులను హరిస్తోందన్నారు. కార్మికులను కట్టుబానిసలుగా మార్చేలా కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా సవరించారని విమర్శించారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడానికి ఐక్యపోరాటాలతో ముందకుసాగాలన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని, వీటిని కాపాడుకోవాలని కోరారు. భారత్‌ బంద్‌ విజయవంతం చేయాలని, 29న విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరిగే ర్యాలీ, బహిరంగ సభ విజయవంతం చేయాలని, తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని తదితర తీర్మానాలను ఏక్రగీవంగా ఆమోదించారు. ఈ సదస్సులో ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పొలారి, రాష్ట్ర కోశాధికారి యు.వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ మాట్లాడారు. కె.జోజి, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు సత్తిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకట్‌ నాయుడు పాల్గొన్నారు.