Abn logo
Sep 19 2020 @ 00:42AM

ఎవరి కోసం ప్రైవేట్ వర్సిటీలు?

Kaakateeya

ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు లక్ష్యం ఉన్నత విద్యను సామాన్యులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడమే అయితే ఆ విశ్వవిద్యాలయాలలో విధిగా రిజర్వేషన్లు అమలుచేయాలి.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టాలి. ఈ అభ్యుదయ మార్పుల కోసం దళితులు, ఆదివాసీలు, బీద బడుగు వర్గాలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయడం వల్లనే, చేసినప్పుడు మాత్రమే మన సమాజం సమున్నత స్థాయిలో విద్యావంతమవుతుంది. తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది.


ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు బిల్లును తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. దీని ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్‌ విధానం, ఫీజు రియింబర్స్‌మెంట్ ఉండదని రాష్ట్ర విద్యామంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. జనాభాలో సామాజికంగా, ఆర్థికంగా అణచివేయబడ్డ వర్గాలే అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. మరి ఉన్నత విద్యారంగంలో రిజర్వేషన్ వంటి సదుపాయాలను నిరాకరించడం సామాజికన్యాయాన్ని సమాధి చేయడమే కాదా? ఉన్నత విద్యను పేదవర్గాల వారికి మరింత అందుబాటులోకి తీసుకురావడానికే ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ విషయమై తమ ప్రభుత్వం 2018లోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చిందని విద్యామంత్రి చెప్పుకొచ్చారు. గౌరవనీయ మంత్రికి గుర్తు లేని ఇంకొక విషయం ఏమిటంటే, కరోనా వైరస్‌ రాష్ట్రంలో వేగంగా విస్తరించి ప్రజల ప్రాణాలను బలిగొంటున్న సమయంలో, శాసనసభ సమావేశాలు లేని తరుణంలో రాష్ట్ర గవర్నర్‌ ఆగమేఘాల మీద ఐదు ప్రైవేట్‌ యూనివర్సిటీలకు మే 20న అనుమతినిచ్చారు. అంతకుముందు మే 16న కేబినెట్‌ మంత్రుల సబ్‌ కమిటీ సమావేశమై ప్రైవేటు యూనివర్సిటీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సబ్‌కమిటీ ప్రభుత్వ పెద్దలు కొందరికి యూనివర్సిటీలను కట్టబెట్టడం విస్మయం కలిగిస్తోంది. వీటిలో ఒకటి అదే జిల్లాలోని దూలపల్లి దగ్గర మల్లారెడ్డి యూనివర్సిటీ పేరుతో కొనసాగుతోంది. మేడ్చల్‌ జిల్లాలో ఘట్కేసర్‌ సమీపంలో ఉన్న వెంకటాపురంలో అనురాగ్‌ యూనివర్సిటీ అనే ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఛీప్‌విప్‌కు అను మతి ఇచ్చారు. మూడో ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలంలోని అనంతసాగర్‌ దగ్గర ఏర్పాటు చేయనున్నారు. టిఆర్‌ఎస్ నాయ౬కుడు ఒకరు నెలకొల్పనున్న ఈ విశ్వ విద్యాలయం పేరు ‘యస్‌ ఆర్‌ యూనిర్సిటీ’. నాలుగో ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని పూనాకు చెందిన ఐటీ కార్పొరేట్‌ కంపెనీ టెక్‌ మహేంద్ర ఏర్పాటు చేస్తోంది. మేడ్చల్‌ జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో ఈ ప్రైవేట్ వర్శిటీని నెలకొల్పనున్నారు. ఐదో యునివర్సిటీని స్థాపించడానికి వోక్స్‌ అనే వ్యాపారసంస్థకు అనుమతి ఇచ్చారు. ఈ సంస్థ ఇప్పటికే మెదక్‌ జిల్లాలోని సదాశివపేటలో స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సంస్థను నడుపుతోంది. ఈ ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో మూడు యూనివర్సిటీలు అధికార పార్టీ నాయకులవే కావడం గమనార్హం. 


ఉన్నత విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇంకొకవైపు వీటిలో రిజర్వేషన్‌ ఫీజు రీయింబర్స్ మెంట్ ఉండవని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రవేశం లేకుండా చేయడమేనా విద్యను మరింత అందుబాటులోకి తేవడం అంటే? ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రభుత్వం కల్పించిన నీరు, విద్యుత్, రోడ్లు మొదలైన మౌలిక సదుపాయాల్ని వాడుకుంటాయి. అయినా దళితులకు, ఇతర పీడిత కులాలకు రాజ్యాంగమిచ్చిన రిజర్వేషన్‌ హక్కుల్ని కల్పించేందుకు నిరాకరిస్తున్నాయి. రాజ్యాంగంలోని 46వ అధికరణ ప్రకారం రాజ్యం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారి ప్రయోజనాలను కాపాడాలి. అధికరణ 15(5) ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభ్యున్నతికి ప్రైవేట్ విద్యాసంస్థలలో రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఈ రాజ్యాంగ నిర్దేశాలను పాటించని పైవేట్ విశ్వవిద్యాలయాల్ని ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నారు? ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో స్థానిక విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయిస్తామని చట్టంలో పేర్కొన్నారు. సామాజిక రిజర్వేషన్లు లేని వీటిలో ఆ 25 శాతం సీట్లు డబ్బు కుమ్మరించగలిగిన వారికే పెట్టి చదువు కొనుక్కో గలిగినవారికే దక్కుతాయనడంలో సందేహం లేదు. అగ్రకులాలలోని పేదలకు కూడా విద్యను దూరం చేసి, ధనికులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు.


కంపెనీ చట్టం 2013లోని ఎనిమిదవ సెక్షన్‌ కింద ఈ ప్రైవేటు యూనివర్సిటీలు నమోదవుతున్నాయి. వీటిలో నాణ్యమైన విద్య అందించడం సాధ్యం కాని పని. ఎందుకంటే ప్రైవేట్‌ సంస్థ అంటేనే లాభం కోసం, అందులోనూ అత్యధిక లాభం కోసం నడిచే సంస్థ. ఉత్పత్తి వ్యయం తగ్గించుకుంటేనే కానీ వాటికి ఎక్కువ లాభం రాదు. మౌలిక వసతుల మీద ఖర్చులు తగ్గించుకోవడం, ఉపాధ్యాయులకు తక్కువ జీతాలు ఇవ్వడం ద్వారా అధిక లాభాలు సంపాదించుకుంటారు. తక్కువ జీతాలకు ఉపాధ్యాయులను నియమించినప్పుడు అర్హత లేని ఉపాధ్యాయులను నియమించే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ నిరుద్యోగం ఎక్కువగా ఉండటం వల్ల అర్హత కలిగిన టీచర్లు కూడా తక్కువ జీతానికే వచ్చినా వాళ్లు నిజాయితీగా, సృజనాత్మకంగా పని చేయలేరు. పిహెచ్‌.డి. చేసి అర్హత కలిగిన ఉపాధ్యాయులకు బయట లక్షల రూపాయల జీతం వస్తుండగా ప్రైవేట్ యూనివర్సిటీలో 30 లేదా 40 వేలు మాత్రమే ఇస్తే వారు సృజనాత్మకంగా మనసుపెట్టి పని చేయడమెలా సాధ్యమవుతుంది? అటువంటప్పుడు వాటి నుంచి నాణ్యమైన విద్య ఆశించడం అత్యాశ అవుతుంది.


ఈ యూనివర్సిటీల యజమానులు ఇప్పటికే ఇంజనీరింగ్‌ కళాశాలలను నడుపుతున్నారు. వాటి బోర్డులు తుడిచేసి విశ్వవిద్యాలయాలు అని రాసుకుంటున్నారు. అయినా వాటిలో ఇంతకుముందు చెప్పిన కోర్సులే కొనసాగిస్తారు .ఇక కొత్త కోర్సుల విషయానికొస్తే మార్కెట్‌లో డిమాండ్‌ ఉందని చెప్పి ఇంజనీరింగ్‌, ఫార్మసీ, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ లాంటి కొన్ని కోర్సులను ప్రవేశపెడతారు. మార్కెట్లో యథార్ధంగా ఏ ఏ కోర్సులకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో, ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయో ఈ ప్రైవేట్ వర్శిటీల వద్ద శాస్త్రీయమైన అధ్యయనం ఉండదు. తాము భోదించే కోర్సులు చదివితే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని వ్యాపార ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులవుతున్న దాదాపు మూడున్నర లక్షల మంది తల్లిదండ్రులు వీరి మార్కెట్‌. ఆ తల్లిదండ్రుల్ని, ఆ విద్యార్థుల్ని భ్రమల్లో ముంచి లక్షలరూపాయల ఫీజులు వసూలు చేస్తారు. నిజానికి మనదేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో డిమాండ్‌ ఉన్న కోర్సులని భావించి లక్షలు చెల్లించి చేరిన విద్యార్థులు ఆ కోర్సులు పూర్తి చేశాక ఎవరో ఒకరిద్దరికి మినహా 99 శాతం మందికి ఉద్యోగాలు రావడం లేదనేది ఒక కఠోర వాస్తవం. ప్రజల సమస్యల గురించి, మౌలిక సామాజిక, ప్రకృతి శాస్త్రాల గురించి ఈ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలలో బోధన ఉండదు. కార్పొరేట్‌ కంపెనీలు నడుపుతున్న ఇతర పరిశ్రమలలో అనైతిక పద్ధతుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేసి లాభాలు ఎలా సంపాదించాలో, ఉత్పత్తి అయిన వస్తువుల్ని ఎలా అమ్ముకోవాలో అనేవే ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో పరిశోధనాంశాలుగా ఉంటాయి. ఇక్కడ జరిగిన పరిశోధనలకు కూడా సహజంగానే పేటెంట్‌హక్కుల్ని పొంది డబ్బులు సంపాదించడమే పరమావధిగా భావిస్తారు. యునివర్సిటీ ప్రొఫెసర్లు ఆ పేటెంట్‌లను తమ సొంత ఆస్తిగా మార్చుకోవచ్చు. ఇదే పరిశోధనాత్మక విద్య. విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు కావలసిన నైపుణ్యాలను కోర్సులుగా మార్చడమే ప్రపంచ స్థాయి విద్య! నిజమైన అర్థంలో యూనివర్సిటీలు కనుమరుగైపోయే ప్రమాదం ఉంది.


తెలంగాణలో 6 స్టేట్‌ యూనివర్సిటీలు 11 స్పెషలైజ్డ్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. (ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ తో పాటు జవహర్‌ లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ,నల్సార్‌ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలు ఉన్నాయి.) ఈ యూనివర్సిటీలలో సుమారు 2000 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఆరు సంవత్సరాలలో ఒక ప్రొఫెసర్‌ పోస్టు కూడా భర్తీ కాలేదు. హాస్టల్‌ వసతులు సరిగ్గా లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. కరోనా సందర్భంగా ఇదొక పెద్ద ప్రమాదంగా పరిణమిస్తోంది. లైబ్రరీలకు పుస్తకాల్ని, ల్యాబ్‌లకు అవసరమైన పరికరాల్ని కొనలేక యూనివర్సిటీలు అంతర్గతంగా కూలిపోతున్నాయి. 2017–18 సంవత్సరంలో యూనివర్సిటీ విద్యకు 421 కోట్లు కేటాయిస్తే 2018 -19లో 210 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు తక్షణమే స్వస్తి చెప్పాలి. స్టేట్‌ యూనివర్సిటీలలో, స్పెషలైజ్డ్, ప్రత్యేక యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న వేలాది అధ్యాపక పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలి. లైబ్రరీలు, ల్యాబ్స్‌ సత్వరమే అభివృద్ధి పరచాలి. అలాగే కొత్త హాస్టళ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరగాలి. 


ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు లక్ష్యం ఉన్నత విద్యను సామాన్యులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడమే అయితే ఆ విశ్వవిద్యాలయాలలో విధిగా రిజర్వేషన్లు అమలు చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టాలి. ఉస్మానియా, కాకతీయ వర్శిటీలలో వసూలు చేసినంత ఫీజులు మాత్రమే వసూలు చేయాలి. ఇలాంటి అభ్యుదయ మార్పుల కోసం దళితులు, ఆదివాసీలు, బీద బడుగు వర్గాలు, విద్యార్థులు, అధ్యాపకులు ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయడం వల్లనే, చేసినప్పుడు మన సమాజం సమున్నతస్థాయిలో విద్యావంతమవుతుంది. తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. 


ప్రొఫెసర్ కె. లక్ష్మినారాయణ

తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, 

కార్యనిర్వాహక కార్యదర్శి

Advertisement
Advertisement
Advertisement