Abn logo
Oct 21 2021 @ 01:43AM

సంస్కృత శాస్ర్తాల్లో వైజ్ఞానిక తత్వాలను ప్రపంచానికి అందించండి

స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న ఛాన్సలర్‌ గోపాలస్వామి - బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు

స్వామినారాయణ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హెడ్‌ సాధు భద్రే్‌షదాస్‌ పిలుపు


తిరుపతి(విద్య),అక్టోబరు20: సంస్కృతశాస్ర్తాల్లో  దాగిఉన్న వైజ్ఞానిక తత్వాలను వెలికితీసి ప్రపంచానికి అందించాలని స్వామినారాయణ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హెడ్‌, మహామహోపాధ్యాయ సాధు భద్రే్‌షదాస్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తిరుపతిలోని జాతీయసంస్కృత విశ్వవిద్యాలయం ప్రథమస్నాతకోత్సవం ఛాన్సలర్‌ ఎన్‌.గోపాలస్వామి అధ్యక్షతన బుధవారం మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిధిగా వచ్చిన ఆయన స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. 36ఏళ్లక్రితం ఇదేరోజు దేనిపైనా శ్రద్ధాసక్తులు లేని.. అల్లరిగా తిరిగే ఒకవ్యక్తిని గురువు ప్రేమగా దగ్గరికి చేర్చి సన్యాసదీక్ష ఇచ్చారని,  ఆ వ్యక్తి విజ్ఞాన సముపార్జన చేసి ఈ రోజు ఆ గురువు ఆశయానికి అనుగుణంగా నడుచుకుంటున్నారని.. గొప్ప గురువు ద్వారా ఎంతటివారిలోనైనా మార్పు వస్తుందనడానికి తానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.మనదేశంలో ఆవిర్భవించిన సాంఖ్య, యోగ, న్యాయ, వేదాంత తదితర దర్శనాలు ఇప్పటికీ ప్రపంచ మేధావులను ఆకర్షిస్తూ ఉన్నాయని చెప్పారు.ఇక్కడి రుషివిజ్ఞానం కృషివిజ్ఞానంతో, గణితం జ్యోతిష్యంతో, నాట్యం సంగీతంతో కలబోసుకుని ఉన్నాయని, ఈ భూమిలోనే ఇవన్నీ వికసించాయని తెలిపారు.సంస్కృతం కేవలం మాట్లాడుకునే భాష మాత్రమే కాదని అన్ని భాషలకూ మూలాధారమని తెలిపారు. ఛాన్సలర్‌ పద్మభూషణ్‌ ఎన్‌.గోపాలస్వామి మాట్లాడుతూ 60సంవత్సరాల క్రితం సంస్కృత సంస్థగా ఆవర్భించి అంచెలంచెలుగా జాతీయ సంస్కృత వర్శిటీ హోదాను సంతరించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ క్రమంలో సమాజసేవ, సంస్కృతసేవలో ఎనలేని అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.వీసీ ప్రొఫెసర్‌ వి.మురళీధరశర్మ మాట్లాడుతూ గురుకుల పద్ధతిలో శాస్త్ర అధ్యయనం చేయడానికి వీలుగా పరమాచార్యశాస్త్ర పరిరక్షణకేంద్రం పేరుతో వర్సిటీలో గురుకులాన్ని ప్రారంభించి అద్వైత, న్యాయశాస్ర్తాల్లో బోధన ప్రారంభించామని తెలిపారు. విద్యాపరంగా, పరిపాలనాపరంగా వర్సిటీ సాధించిన ప్రగతిని చదివి వినిపించారు.అనంతరం 1160మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. వీరిలో 67మందికి పీహెచ్‌డీ డిగ్రీలు, 26మందికి బంగారుపతకాలను నేరుగా అందించారు. యూజీ, పీజీ, సర్టిఫికెట్లు కోర్సులు చదివిన వారికి ఆన్‌లైన్‌లో డిగ్రీలు ప్రదానం చేశారు. రిజిస్ర్టార్‌ చల్లా వెంకటేశ్వర్‌, అకడమిక్‌ డీన్‌ రాణీసదాశివమూర్తి, ఈసీ సభ్యులు విద్యాన్‌ నారాయణాచార్‌, జీఎ్‌సఆర్‌ కృష్ణమూర్తి, నరసింహాచార్‌, శ్రీపాదభట్‌, సీవోఈ సాంబశివమూర్తి, పీఆర్వో సింగరాజు దక్షిణామూర్తిశర్మ, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ చక్రవర్తిరాఘవన్‌ తదితరులు పాల్గొన్నారు. 


 9గ్రంఽథాల ఆవిష్కరణ

 సామాన్య జనులకు సులభంగా అర్ధమయ్యేలా రూపొందించిన 9గ్రంధాలను  స్నాతకోత్సవ సభలో  ఆవిష్కరించారు. వైయాకరణ సిద్ధాంతలఘు మంజుషా, నైషదీయ మహాకావ్యసరళ వ్యాఖ్యానం-1,2, రఘువంశం సరళవ్యాఖ్యానం -2, శేముషి, శిశుపాలవధ మహాకావ్యసరళ వ్యాఖ్యానం-1,2, కుట్టుక, మహస్విని(ఎన్‌ఎ్‌సయూ శోధపత్రిక) గ్రంధాలను ఆవిష్కరించి, సంపాదకులను సన్మానించారు. 


బంగారు పతకాలు వీరికే

ఈ స్నాతకోత్సవంలో 26మందికిగాను 18మంది నేరుగా వచ్చి బంగారు పతకాలు అందుకున్నారు.ఒడిశాకు చెందిన నర్మదబెహెరా సాహిత్యంలో 6 బంగారుపతకాలు అందుకున్నారు.  అకడమిక్‌ డీన్‌ రాణిసదాశివమూర్తి మార్గదర్శకత్వంలో పరిశోధక విద్యార్థిగా ఉన్న ఈమె మంచి అఽధ్యాపకురాలిగా రాణించడమే తన ఆశయమన్నారు. అలాగే  ఉప్పనపల్లి శ్రీలక్ష్మి 5, ఎస్‌.విష్ణుప్రియ 4 బంగారుపతకాలు అందుకున్నారు. జి.సంపత్‌కుమార్‌ , గోపిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి , మాడుగుల నాగవెంకటసుబ్రహ్మణ్యశర్మ ,స్వర్ణాలిపాత్ర మూడేసి చొప్పున ,ఎస్‌.మీనాక్షి ,  పీఎస్‌ అంగద్‌, సాయిశ్రీహర్ష ,మనీషషాహు ,  అంజలిదొర, తరుణ్‌ రెండేసి చొప్పున,సిద్దార్థశంకర్‌పాండ ,  సందీ్‌పకుమార్‌మిశ్ర, సత్యనారాయణమహంతి , ప్రభాత్‌నారాయణ్‌పాండే, సత్యకృష్ణ ఒక్కో బంగారుపతకం అందుకున్నారు. 


మెరిసిన మనబంగారాలు

మన రాష్ర్టానికి చెందిన ముగ్గురు విద్యార్థులు పలు శాస్ర్తాల్లో బంగారు పతకాలు సాధించారు. వీరిలో తిరుపతిలోని బైరాగిపట్టెడకు చెందిన ఉప్పనపల్లి శ్రీలక్ష్మి అద్వైత వేదాంతం(పీజీ)లో 5బంగారుపతకాలు సాధించారు. సంస్కృతశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తానంటున్నారు. ప్రకాశంజిల్లాకు చెందిన గోపిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి ఆగమశాస్త్రంలో 3 పతకాలు సాధించగా..అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన మాడుగుల నాగవెంకటసుబ్రహ్మణ్యశర్మ న్యాయశాస్త్రంలో 3బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. వీరు కూడా అధ్యాపకులుగా రాణించడమే తమ లక్ష్యమంటున్నారు.