Abn logo
Oct 9 2021 @ 00:44AM

యాసంగి సాగుకు విత్తనాలు సిద్ధం

మద్నూర్‌లో శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్న దృశ్యం

పంపిణీకి విత్తనాలను సిద్ధం చేసిన విత్తనాభివృద్ధి సంస్థ
సొసైటీల ద్వారా మొదలైన శనగ విత్తనాల సరఫరా
నవంబరు నుంచి వరి విత్తనాల పంపిణీ

నిజామాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో యాసంగి సాగు మొదలవుతుండడంతో విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాల సరఫరా మొదలుపెట్టింది. వరితో పాటు ఆరుతడి పంటల విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే శనగ విత్తనాల సరఫరాను మొదలు పెట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఈ విత్తనాలను సొసైటీల ద్వారా సరఫరా చేస్తున్నారు. నవంబరు నుంచి వరి సాగు మొదలుకానుండడంతో విత్తనాలను సొసైటీలకు పంపించేందుకు విత్తనాభివృద్ధి ఏర్పాట్లు చేస్తోంది.
149 సొసైటీల ద్వారా విత్తనాల పంపిణీ
విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలో విత్తనాలు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ యాసంగిలో పంపిణీ చేసేందుకు వరి, శనగ, నువ్వులు, మినుములు, పెసర విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని 149 వ్యవసాయ సహకార సంఘాల ద్వారా శనగ విత్తనాలను సరఫరా చేస్తున్నారు. ఈ విత్తనాలను కిలోకు రూ.68 చొప్పున రైతులకు అంది స్తున్నారు. ఎకరాకు 25కిలోల వరకు శనగ విత్తనాలను వినియోగించనున్నారు. ఉ మ్మడి జిల్లా పరిధిలో లక్ష ఎకరాలకుపైగా శనగపంట సాగుకానుండడంతో ముందుగానే విత్తన సరఫరాను మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లాలోని బోధన్‌, బాన్సువాడ డివిజన్‌లో ఎక్కువ మొత్తంలో శనగ పంట సాగవుతుంది. శనగతో పాటు నువ్వు విత్తనాలు కూడా అందుబాటులో ఉంచారు. ఈ విత్తనాలు అవసరమైన రైతులకు కిలో 120 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.
ఐదున్నర లక్షల ఎకరాలకుపైగా వరి సాగు
ఉమ్మడి జిల్లా పరిధిలో వరి సాగు ఐదున్నర లక్షల ఎకరాలకుపైగా అవుతోంది. వానాకాలంతో పాటు ఈ యాసంగిలోనూ నీళ్లు సమృద్ధిగా ఉండడంతో అంతే మొత్తంలో సాగవుతుందని విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు అంచనా వేశారు. ఈ సంస్థ ద్వారా రైతులకు సరఫరా చేసేందుకు 30వేల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఫౌండేషన్‌తో పాటు సర్టిఫైడ్‌ సీడ్‌ను రైతులకు సరఫరా చేయనున్నారు. వరిలో బీపీటీ, తెలంగాణ సోనా తదితర సన్న రకాల విత్తనాలను అందుబాటులో ఉంచారు. దొడ్డు రకాల్లో 1010, కేఎన్‌ఎం, 118 రకాల విత్తనాలను సంస్థ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే సహకార సంఘాల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు. నవంబరు నుంచి నారు మడులు వేసే అవకాశం ఉండడంతో రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తుగా సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎకరాకు 25కిలలోల వరకు విత్తనం అవసరం ఉండ డంతో అదే రీతిలో సరఫరా కొనసాగింనున్నారు. ప్రతీ సొసైటీ పరిధిలో సర్టిఫైడ్‌ విత్తనాలు కిలో 30 రూపాయల చొప్పున రైతులకు అందించేవిధంగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వగానే వరి విత్తనాలను రైతులకు సరఫరా చేయనున్నారు. ఇవేకాకుండా విత్తనాభివృద్ధి సంస్థ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మినుములు, పెసర, కంది విత్తనాలు కూడా అందుబాటులో ఉంచారు. యాసంగి పంటను దృష్టిలో పెట్టుకుని ఈ విత్తనాలను సరఫరాకు సిద్ధం చేశామని విత్తనాభివృద్ధి సంస్థ రీజనల్‌ మేనేజర్‌ విష్ణు తెలిపారు. ఇప్పటికే శనగ విత్తనాల సరఫరా మొదలుపెట్టామన్నారు. ఆరుతడి పంటల్లో శనగను ముందుగానే సాగుచేసే అవకాశం ఉండడంతో సరఫరా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తున్నామని ఆయన తెలిపారు.