Abn logo
Sep 18 2021 @ 00:57AM

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ఒంగోలులో ఇంకొల్లు బ్యాలెట్‌ బాక్సులు ఉంచిన స్ర్టాంగ్‌ రూం

రేపు ఉదయం 8గంటల నుంచి ప్రారంభం

కేంద్రాలకు ప్రత్యేకాధికారుల నియామకం

పోటీలో ఉన్న అభ్యర్థులతో మండల ఆర్‌వోల సమావేశం

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లెక్కింపు

ఒంగోలు (జడ్పీ), సెప్టెంబరు 17: పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. లెక్కింపు చేపట్టాలని తీర్పు వచ్చిన రోజే నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్‌ఈసీ 19వతేదీ ఉదయం 8 గంటల నుంచి కొవిడ్‌ నిబంధనలను పక్కాగా పాటిస్తూ ప్రక్రియను పూర్తిచేయాలని అందులో పేర్కొంది. దానికి అనుగుణంగా కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా పరిషత్‌ యంత్రాంగం చేపట్టింది. కౌంటింగ్‌ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. కేంద్రానికి  గొడవలు జరిగే ప్రదేశాలపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మండల కేంద్రాల్లో అభ్యర్థులతో ఆర్‌వోల సమావేశం, కౌంటింగ్‌ ఏజెంట్లకు గుర్తింపుకార్డులు, సిబ్బందికి కౌంటింగ్‌ చెక్‌లిస్ట్‌పై అవగాహన, కొవిడ్‌ నిబంధనలను అనుసరించి అవసరమైన సామగ్రిని కేంద్రాలకు తరలించడం, జడ్పీ కార్యాలయంలో సిబ్బందితో ఎడతెగని సమావేశాలు.. ఇవన్నీ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం ఒక్కరోజే జరిగాయి. ఎస్‌ఈసీ కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కౌంటింగ్‌ తేదీని ప్రకటించడంతో యంత్రాంగం మొత్తం ఆగమేఘాల మీద స్పందించి ఏర్పాట్లు పూర్తి చేసింది.


ఏ మండలాలకు ఎక్కడ లెక్కింపు

కనిగిరి, పీసీపల్లి, హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం, పామూరు మండలాలకు కనిగిరిలోని ఏపీ మోడల్‌ హైస్కూల్‌లో, కందుకూరు, లింగసముద్రం, వీవీపాలెం, ఉలవపాడు, గుడ్లూరు మండలాలవి కందుకూరులోని టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాలలో లెక్కించనున్నారు. కొండపి, ఎస్‌కొండ, టంగుటూరు, మర్రిపూడి, పొన్నలూరు, జరుగుమల్లి మండలాలకు వెంగముక్కపాలెంలోని క్విస్‌ కళాశాలలోని హెచ్‌,ఐ,జే బ్లాక్‌లో, ఎస్‌ఎన్‌పాడు, ఎన్‌జీపాడు, మద్దిపాడు, చీమకుర్తి, ఒంగోలు, కొత్తపట్నంకు క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని ఏ,బీ బ్లాక్‌ల నందు లెక్కింపు జరగనుంది. మార్కాపురం, తర్లుపాడు, కె.కె.మిట్ల మండలాలకు మార్కాపురంలోని తర్లుపాడు రోడ్డుని  కమలా కాన్సెప్ట్‌ స్కూల్‌లో, కొమరోలు, రాచర్ల, కంభం, బేస్తవారపేట, అర్ధవీడు మండలాలకు మార్కాపురంలోని కమల ఎంబీఏ కళాశాలలో, చీరాల, వేటపాలెంకు చీరాలలోని సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చినగంజాం, ఇంకొల్లు మండలాలకు ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్‌ హైస్కూల్‌లో, పర్చూరు, కారంచేడు, మార్టూరు, యద్దనపూడి మండలాలకు ఒంగోలులోని పీవీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో, అద్దంకి ప్రభుత్వపాఠశాలలో అద్దంకి, సంతమాగలూరు, బల్లికురవ, జె.పంగలూరు, కొరిశపాడు మండలాల ఓట్ల లెక్కింపు జరగనుంది. దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరులకు దర్శిలోని ఏపీమోడల్‌ హైసూల్‌ నందు, వైపాలెం, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు మండలాలకు వె.ౖపాలెంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 


కౌంటింగ్‌ కేంద్రాలకు ప్రత్యేకాధికారుల నియామకం

కౌంటింగ్‌ జరగనున్న 12కేంద్రాలకు పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేక అధికారులను కలెక్టర్‌ నియమించారు. కనిగిరిలోని ఏపీమోడల్‌ హైస్కూల్‌కు బి.నారదముని, కందుకూరులోని టీఆర్‌ఆర్‌ కళాశాలకు సబ్‌కలెక్టర్‌ అపరాజిత, క్విస్‌ కళాశాలలోని హెచ్‌,ఐ, జె బ్లాకులకు డీఆర్‌డీఏ పీడీ బి.బాబురావు, ఏ,బీ బ్లాకులకు ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు. మార్కాపురంలోని కమల కాన్సెప్ట్‌ హైస్కూల్‌కు డ్వామా పీడీ శీనారెడ్డి, కమల ఎంబీఏ కళాశాలకు స్పెషల్‌ కలెక్టర్‌ సరళావందనం, చీరాల సెయింట్‌ ఆన్స్‌ కేంద్రానికి ఫిషరీస్‌ జేడీ చంద్రశేఖరరెడ్డి, ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌ కేంద్రానికి మున్సిపల్‌ కమిషనర్‌ భాగ్యలక్ష్మి, పీవీఆర్‌ హైస్కూల్‌కు ఎస్‌సీ కార్పొరేషన్‌ ఈడీ విశ్వనాథ్‌ శ్రీనివాస్‌ను ప్రత్యేకాధికారులుగా నియమించారు. అద్దంకిలోని హైస్కూల్‌కు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ గ్లోరియా, దర్శిలోని ఏపీమోడల్‌ స్కూల్‌కు జేసీ కృష్ణవేణి, వై.పాలెం ప్రభుత్వ పాఠశాల కేంద్రానికి మార్కాపురం ఆర్డీఓ లక్ష్మి శివజ్యోతి ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. 


679మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 2,443మంది సహాయకులు

కౌంటింగ్‌ జరుగుతున్న కేంద్రాలకు 679 మంది సూపర్‌వైజర్లుగా వ్యవహరించనున్నారు. 2443మంది వీరికి సహాయకులుగా విధులు నిర్వహించనున్నారు. మొత్తం 12 కేంద్రాల్లో కలిపి 2,223 బ్యాలెట్‌ బాక్సులు ఉండగా వాటిని  తెరిచి లెక్కింపు నిమిత్తం 109 హాళ్లను ఏర్పాటు చేశారు