Sep 17 2021 @ 23:24PM

త్వరలో ‘ప్రేమదేశం-2’ - దర్శకుడు కదిర్‌

పాతికేళ్ల  క్రితం  వచ్చిన చిత్రం ‘ప్రేమదేశం’. 1996 ఆగస్టు నెలలో విడుదలైంది. వినీత్‌, అబ్బాస్‌, టబు ప్రధానపాత్రల్లో నటించగా, నిర్మాత కేటీ.కుంజుమన్‌ తన సొంత నిర్మాణ సంస్థ జెంటిల్‌మెన్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించారు. దర్శకుడు కదిర్‌. ఈ చిత్రం విడుదలైన 25 యేళ్ళ తర్వాత ‘ప్రేమదేశం’కు సీక్వెల్‌ రానుంది. ‘ప్రేమదేశం’కు దర్శకత్వం వహించిన దర్శకుడు కదిర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇదే విషయంపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, ‘‘తమిళంలో నిర్మించిన ‘కాదల్‌దేశం’ చిత్రాన్ని తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేశాం.


ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే సూపర్‌హిట్‌ సాధించింది. ఆ కాలంలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. అలాంటి చిత్రాలు ఇపుడు రావడం లేదు. దీంతో అనేక మంది ‘ప్రేమదేశం’ వంటి చిత్రాన్ని నిర్మించాలని కోరడం జరిగింది. దీనిపై సుదీర్ఘంగా ఆలోచన చేసి ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలన్న నిర్ణయానికి వచ్చాను. స్ర్కిప్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. యంగ్‌ టాలెంటెడ్‌ యువతీ యువకులతో పాటు సీనియర్‌ నటీనటులు, అప్‌కమింగ్‌ యాక్టర్స్‌తో ఈ సినిమా తీసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణ సంస్థతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఆ పనుల్లో బిజీగా గడుపుతున్నాను. ప్రధానంగా సీక్వెల్‌ చిత్రాన్ని తెలుగులో నిర్మించి ఆ తర్వాత తమిళంలోకి డబ్‌ చేస్తాం. అందుకే తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు నిర్మాత కోసం అన్వేషణ జరుగుతోంది’’ అని చెప్పారు.


- ఆంధ్రజ్యోతి, చెన్నై