Abn logo
Sep 28 2020 @ 04:19AM

బీసీలకు పెద్దపీట

లోక్‌సభ స్థానాల కమిటీలకు

టీడీపీ అధ్యక్షుల ప్రకటన

పార్టీకి పునరుత్తేజం దిశగా నియామకాలు


అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గ కమిటీల అధ్యక్షులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. వీరిలో బీసీలకే ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్ష పదవుల్లో పది వారికే దక్కాయి. రెండు ఎస్సీ వర్గానికి, ఒకటి ఎస్టీ వర్గానికి, ఒకటి ముస్లిం మైనారిటీ వర్గానికి ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కలిపి సగానికి పైగా లభించాయి. పార్టీకి ఆరంభం నుంచి ఉన్న బీసీ వర్గాల మద్దతు తగ్గడం వల్లే గత ఎన్నికల్లో నష్టపోయామన్న అభిప్రాయంలో ఉన్న టీడీపీ అధిష్ఠానం.. దానిని అధిగమించే దిశగా అడుగులు వేసింది. అలాగే ఎస్సీలకిచ్చిన రెంటిలో ఒకటి మాల సామాజిక వర్గానికి, మరొకటి మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారు. గిరిజనుల సంఖ్యాబలం అధికంగా ఉన్న అరకు లోక్‌సభ స్ధానం అధ్యక్ష పదవిని ఎస్టీ వర్గాలకు చెందిన మహిళా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి ఇచ్చారు. 25 మంది అధ్యక్షుల్లో ముగ్గురు మహిళలు. నరసాపురం లోక్‌సభ స్ధానం అధ్యక్ష పదవి మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మికి, అమలాపురం పదవి శాసనమండలి వైస్‌ చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం సతీమణి అనంతకుమారికి ఇచ్చారు. కమిటీల అధ్యక్షుల్లో నవతరంతోపాటు సీనియర్లు కూడా ఉన్నారు.


విజయనగరం లోక్‌సభ స్ధానం అధ్యక్ష పదవి 32 ఏళ్ల యువకుడు కిమిడి నాగార్జునకు ఇచ్చారు. ఈయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు సోదరుడు గణపతిరావు, మాజీ మంత్రి కిమిడి మృణాళినిల కుమారుడు. కాకినాడ అధ్యక్ష పదవి యువ నేత జ్యోతుల నవీన్‌, బాపట్ల అధ్యక్ష పదవి యువ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు లభించాయి. ఎమ్మెల్యేల్లో ఏలూరికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఎమ్మెల్సీల్లో బుద్ధా నాగజగదీశ్వరరావు (అనకాపల్లి), సంధ్యారాణి (అరకు)కు అవకాశం లభించింది. ముగ్గురు మాజీ మంత్రులు కేఎస్‌ జవహర్‌ (రాజమండ్రి), నెట్టెం రఘురాం (విజయవాడ), కాల్వ శ్రీనివాసులు (అనంతపురం) అధ్యక్షులయ్యారు. మాజీ ఎంపీల్లో కొనకళ్ల నారాయణరావు (మచిలీపట్నం) ఉన్నారు. దళిత సామాజిక వర్గాల్లో తెనాలి శ్రావణ్‌కుమార్‌ (మాల), జవహర్‌ ( మాదిగ)కు అవకాశం దక్కింది. నెల్లూరు మేయర్‌గా చేసిన అబ్దుల్‌ అజీజ్‌కు నెల్లూరు పార్లమెంటు అధ్యక్ష పదవి లభించింది. కొన్ని చోట్ల ఆసక్తికర ఎంపికలు జరిగాయి. శ్రీకాకుళం పార్లమెంటు అధ్యక్ష పదవికి.. ఆమదాలవలసలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం బావమరిది, ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన మాజీ విప్‌ కూన రవికుమార్‌ను ఎంపిక చేశారు. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన గౌరు వెంకటరెడ్డికి నంద్యాల అధ్యక్ష పదవి లభించింది. పార్టీ పదవికి పోటీ ఉన్న విశాఖ అధ్యక్ష పదవిని మాజీ ఎమ్మెల్యే, బీసీ వర్గాల నేత పల్లా శ్రీనివాసరావు యాదవ్‌కు ఇచ్చారు.


ఇప్పటివరకూ జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారిలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు), శ్రీనివాసరెడ్డి (రాజంపేట), పులివర్తి నాని (చిత్తూరు), బీకే పార్థసారథి (హిందూపురం), తోట సీతారామలక్ష్మి (నరసాపురం), జీవీ ఆంజనేయులు (నరసరావుపేట), జ్యోతుల నవీన్‌ (కాకినాడ) లోక్‌సభ స్థానాలకు అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఇతరుల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఐదు, రెడ్డి సామాజిక వర్గానికి మూడు, కాపులకు రెండు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారికి ఒకటి ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అమలాపురం, మచిలీపట్నం, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, హిందూపురం అధ్యక్ష పదవులు బీసీ వర్గాలకు.. రాజమండ్రి, గుంటూరు అధ్యక్ష పదవులు ఎస్సీలకు.. అరకు ఎస్టీ వర్గానికి.., నెల్లూరు ముస్లిం మైనారిటీకి.. కర్నూలు వైశ్య సామాజిక వర్గానికి.. ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, బాపట్ల, చిత్తూరు కమ్మ సామాజిక వర్గానికి.. కడప, రాజంపేట, నంద్యాల రెడ్డి సామాజిక వర్గానికి.. కాకినాడ, నరసాపురం కాపులకు కేటాయించారు. వీరు గాక మరో 13 మంది సీనియర్‌ నేతలను రెండేసి లోక్‌సభ స్థానాలకు ఇన్‌చార్జులుగా నియమించారు. అరకు లోక్‌సభ స్ధానానికి మాత్రం ఒకరినే పెట్టారు.


లోక్‌సభ నియోజకవర్గానికి..

కూన రవికుమార్‌(శ్రీకాకుళం), కిమిడి నాగార్జున(విజయనగరం), పల్లా శ్రీనివాసరావు(విశాఖ), బుద్ధా నాగ జగదీశ్వరరావు(అనకాపల్లి), గుమ్మడి సంధ్యారాణి(అరకు), జ్యోతుల నవీన్‌(కాకినాడ), రెడ్డి అనంత కుమారి(అమలాపురం), కేఎస్‌ జవహర్‌(రాజమహేంద్రవరం), గన్ని వీరాంజనేయులు(ఏలూరు), తోట సీతారామలక్ష్మి(నరసాపురం), కొనకళ్ల నారాయణరావు(మచిలీపట్నం), నెట్టెం రఘురాం(విజయవాడ), తెనాలి శ్రావణ్‌ కుమార్‌(గుంటూరు), జీవీ ఆంజనేయులు(నర్సారావుపేట), ఏలూరి సాంబశివరావు(బాపట్ల), డాక్టర్‌ నూకసాని బాలాజీ(ఒంగోలు), షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌(నెల్లూరు), జి. నర్సింహ యాదవ్‌(తిరుపతి), పులివర్తి వెంకట మణి ప్రసాద్‌(నాని)(చిత్తూరు), రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి(రాజంపేట), మల్లెల లింగారెడ్డి(కడప); కాల్వ శ్రీనివాసులు(అనంతపురం), బీకే పార్ధసారధి(హిందూపురం), సోమిసెట్టి వెంకటేశ్వర్లు(కర్నూలు), గౌరు వెంకటరెడ్డి(నంద్యాల).  


రెండేసి లోక్‌సభ నియోజకవర్గాలకు..

నిమ్మకాయల చిన రాజప్ప(విశాఖపట్నం, అనకాపల్లి), సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి(కడప, రాజంపేట), బండారు సత్యనారాయణమూర్తి(కాకినాడ, అమలాపురం), పితాని సత్యనారాయణ(నర్సరావుపేట, బాపట్ల), ధూళిపాళ నరేంద్ర(ఏలూరు, విజయవాడ), నక్కా ఆనందబాబు(అరకు), పీవీజీఆర్‌ నాయుడు(గణబాబు)(శ్రీకాకుళం, విజయనగరం), గద్దె రామ్మోహన్‌(రాజమండ్రి, నర్సాపురం), కొండపల్లి అప్పలనాయుడు(మచిలీపట్నం, గుంటూరు), ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి(తిరుపతి, చిత్తూరు), వి. ప్రభాకర్‌ చౌదరి(కర్నూలు, నంద్యాల), బీటీ నాయుడు(అనంతపురం, హిందూపురం), బీసీ జనార్ధనరెడ్డి(ఒంగోలు, నెల్లూరు).

Advertisement
Advertisement
Advertisement