ఓంకారమే పరబ్రహ్మ స్వరూపమని, ప్రణవం చేతనే చెప్పదగింది పరమాత్మ తత్త్వమని.. మాండూక్యోపనిషత్తు చెబుతోంది. ఈ ఉపనిషత్తు ఓంకార తత్త్వాన్ని వివరింగా తెలియజేసింది. దాని ప్రకారం.. శబ్దాలన్నీ ఓంకారమందే ఉద్భవించాయి. మూడు కాలాలు ప్రణవమందే అణిగి, పరమపురుషుని దేహమయ్యాయి. అట్టి బ్రహ్మము.. నాలుగు పాదాలు కలిగి ఉన్నది. స్థూలమైన బ్రహ్మాండాన్ని సృష్టించగలిగిన వేళ బ్రహ్మమునకది మొదటి పాదం. జాగరిత స్థానమై బాహ్యప్రజ్ఞగా ఒప్పారుతోంది. అప్పుడు భగవంతుడు వైశ్వానరుడు. అనగా విశ్వమంతటినీ నడుపుతున్నవాడు. సృస్టి అంతా స్థితిలో కొనసాగుతున్నప్పుడు పరమేశ్వరుడికి అది ద్వితీయపాదం. భగవంతుడు అంతఃప్రజ్ఞ యందు ఉంటాడు. తైజసుడుగా లోలోపల స్వయంప్రకాశమై వెలుగొందుతుంటాడు. జీవునికి స్వప్నం వంటిదే పరమేశ్వరునికి సృష్టి పోషణ. జీవకోటికి తమ కర్మలననుసరించి సుఖదుఃఖాలు పరమేశ్వరునిచే ప్రసాదింపబడడాన్ని స్థితిగా భావించాలి. గాఢనిద్రలో మనిషి కలలు కూడా లేకుండా సుఖంగా నిద్రిస్తాడు. అది సుషుప్తి. పరబ్రహ్మకు మూడో పాదం. సృష్టి కార్యమంతా తీరిపోయిన ప్రళయకాలంలో జ్ఞానమే తానైన బ్రహ్మము.. ప్రజ్ఞానఘనుడై ఆనందమయుడుగా ఉంటాడు. అట్టి సర్వేశ్వరుణ్ని సర్వజ్ఞుడుగా, సర్వభూతాలయందు వెలుగువానిగా తెలుసుకోవాలి. బ్రహ్మమునకు నిజంగా బాహ్య ప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ అంటూ లేవు. ఎందుకంటే అతని ప్రజ్ఞ కనిపించనిది. వాక్కుకు అందనిది. అంతులేనిది. ఇంద్రియాలకు అతీతమై, చింతనకు దొరకని, పేరుతో పిలవరాని, వ్యాపకతత్త్వమై వెలుగుతూ జగానికంతటికీ శాంతిస్థానమైనది. అదే తురీయం.
వాస్తవరూపం.
పాదకల్పనతో చెప్పబడిన బ్రహ్మమే ప్రణవ రూపం. ‘ఓం’నందలి మాత్రలే పరమాత్మయందలి పాదకల్పన. సృష్టి జరిగేవేళ వ్యాప్తికి అదే ఆది కాబట్టి బ్రహ్మమునకు ‘ఓం’కారంలోని మొదటి మాత్ర ‘అ’కారం అవుతోంది. వర్ణమాలలో ‘అ’కారమే ఆది. ‘అ’కారమే సకలమై వాక్కునందు వ్యాపిస్తోంది. ఇక, మధ్యలో ఉన్నది ‘ఉ’కారం. అది ఉత్కృష్టమైనది. బ్రహ్మమునకు స్వప్నస్థానమైనది. ప్రణవమందు ‘మ’కారం.. పదం యొక్క అంతాన్ని తెలుపుతుండగా.. బ్రహ్మము సుషుప్తిస్థానంలో చేరి ఉంటాడు. ఈ సృష్టి అంతా ఆయనయందే లయమవుతుంది. జీవులు, ప్రకృతి.. అంతా సూక్ష్మమై బ్రహ్మమునందు చేరి ఉంటుంది. ప్రణవమందలి మూడు మాత్రలు పరమాత్మయందలి మూడుపాదాలని తెలిసినవాడు ముక్తుడు. నాలుగోది తురీయపాదం. సత్యరూపం. అది కారణం లేకుండా ఉన్నది. నాశరహితం, పూర్ణమైనది.
- జక్కని వేంకట రాజం