Abn logo
Sep 28 2020 @ 03:18AM

నాడు ముంచుడు.. నేడు వదులుడు

ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో కథ

నాడు బాబు ఇల్లే టార్గెట్‌గా సర్కారు వ్యవహారం

బ్యారేజీ గేట్లు ఎత్తకుండా దాన్ని ముంచే యోచన

పైగా ముంపు పేరిట రాజధాని తరలింపు ఎత్తుగడ

ఇప్పుడు వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు 

అధికారులను ప్రశ్నించగానే బాబు ఇంటికి నోటీసు


(విజయవాడ-ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం వరద పోటెత్తుతోంది. ఈ దృశ్యం ఏడాది కింద జరిగిన ఓ కీలక పరిణామాన్ని అందరికీ గుర్తుచేస్తోంది. బ్యారేజీ గరిష్ఠ నీటి మట్టం 12 అడుగులు దాటినా.. ఆనాడు వరద నీటిని కిందకు వదిలేయకుండా.. రాజధాని గ్రామాలను ముంచెత్తి.. ఆ సాకుతో రాజధానిని అమరావతి నుంచి తరలించేయాలని వైసీపీ ప్రభుత్వ పెద్దలు వ్యూహరచన చేశారన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా బాబు నివాసం అక్రమ కట్టడమని నోటీసులిచ్చి ఖాళీ చేయించడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ముగ్గురు మంత్రు లు స్వయంగా అక్కడకు వెళ్లి నానా హడావుడి చేశారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత రెండు నెలలకే కృష్ణా నదికి వరద వచ్చింది. రాజధానిగా అమరావతి సురక్షిత ప్రాంతం కాదని నిరూపించడానికి ఈ వరదను వాడుకోవాలని ఆయన ప్రభుత్వం ఎత్తులు వేసింది. ముందుగా చంద్రబాబు నివాసాన్ని ముంచేస్తే, తర్వాత ఎలాగూ నదిని ఆనుకుని ఉన్న చిన్నచిన్న గ్రామాలు మునిగిపోతాయని ప్రభుత్వ పెద్దలు భావించారు. అప్పట్లో ఎగువ నుంచి ఎన్ని లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా.. బ్యారేజీ గేట్ల నుంచి 2, 3లక్షల క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేయలేదు.


చంద్రబాబు ఇంటితోపాటు రాజధాని గ్రామాల్లోకి  వరద నీరు చేరేలా ఈ విధంగా చేశారని తెలుస్తోంది. అయితే ఉండవల్లి, తాడేపల్లి వైపు వరద రాలేదు. దీంతో పెద్దల ఎత్తుగడ బెడిసికొట్టింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం 5.81లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దిగువకు 5.06లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ నదికి దిగువన ఉన్న పంటపొలాలు, లంకలు మునిగాయి తప్ప.. ఉండవల్లి, తాడేపల్లి వైపు ఎలాంటి మునకలు కనిపించడం లేదు. దీనినిబట్టి జగన్‌ సింహాసనం ఎక్కీఎక్కగానే రాజధానిని తరలించడానికి ప్రణాళికలు వేసుకున్నారని.. ఇందులో భాగంగానే చంద్రబాబు ఇంటిని, పలు గ్రామాలను ముంచడానికి వీలుగా ఎగువ నుంచి వస్తున్న వరదను పూర్తిస్థాయిలో దిగువకు వదల్లేదన్న విమర్శలకు ప్రస్తుత పరిస్థితి బలం చేకూర్చుతోంది.


నిరుడు ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో ఆ ప్రవాహానికి ఇబ్రహీంపట్నం నుంచి ఒక ఇనుప బోటు కొట్టుకొచ్చింది. ఇది బ్యారేజీ గేటు మధ్య ఇరుక్కుపోయింది. దీనిని తొలగించడానికి అధికారులకు నెలరోజుల పైనే సమయం పట్టింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ అంశాలపై ఇరిగేషన్‌ అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం వివరణ కోరగా.. అప్పటికప్పుడు చంద్రబాబు నివాసానికి వరద హెచ్చరిక నోటీసులు జారీ కావడం కొసమెరుపు!


ఉండవల్లి కరకట్టపై ఇళ్లకు నోటీసులు 

తాడేపల్లి: ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ఉధృతి భారీగా పెరగడంతో ఆదివారం బ్యారేజీ ఎగువన ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న అన్ని గృహాలకు నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరిక నోటీసులు అందజేశారు. మాజీ సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఉన్న పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌కు సదరు నోటీసును అంటించారు. వరదనీరు నదీతీరం వెంబడి నివాస గృహాలను చుట్టుముట్టే అవకాశం ఉన్నందున, అక్కడ నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.

Advertisement
Advertisement
Advertisement