‘మా’ ఎన్నికల్లో రౌడీషీటర్లు

ఆధారాలతో ఎన్నికల అధికారికి ప్రకాష్‌రాజ్‌ లేఖ


‘‘మా’ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. చాలామంది రౌడీషీటర్లు ‘మా’ ఎన్నికలని ప్రభావితం చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడు నూకల సాంబశివరావు పోలింగ్‌ బూత్‌లో విష్ణు మంచు వెంట ఉన్నాడు. అతనిపై రౌడీ షీట్‌ ఉంది’’ అని ప్రకాశ్‌రాజ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆధారాలతో ఎన్నికల అధికారికి ప్రకాష్‌రాజ్‌ లేఖ రాశారు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షపదవికి మంచు విష్ణుతో పోటీపడిన ప్రకాష్‌రాజ్‌ తన ఓటమి తర్వాత  ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దానికి బలం చేకూర్చుతూ పోలింగ్‌ బూత్‌లో అలాగే మోహన్‌బాబు ఫ్యామిలీతో నూకల సాంబశివరావు ఉన్న ఫొటోలను ఆయన శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ‘‘సాంబశివరావు పలు క్రిమినల్‌ కేసుల్లో నిందితుడు. ఓ హత్యకేసులో ప్రధాన నిందితుడు.


నోట్ల రద్దు సమయంలో కోట్ల రూపాయలు తరలించినట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. జగ్గయ్య పేట పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై రౌడీషీట్‌ ఉంది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇది ఆరంభం మాత్రమే. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ సీసీటీవీ ఫుటేజీ ఇస్తే, ‘మా’ ఎన్నికల్లో అక్రమాలు బయటపెడతాను. ఈ నెల 14న ఎన్నికల అధికారిని సీసీ ఫుటేజి అడిగినా ఇప్పటిదాకా స్పందన లేకపోవడం విచార కరం’ అన్నారు. దీనిపై స్పందించిన కృష్ణమోహన్‌ ‘‘సీసీటీవీ ఫుటేజి ఇప్పుడు నా పరిధిలో లేదు. ఫుటేజి ఇవ్వాలా వద్దా అనేది ‘మా’ అధ్యక్షుడు నిర్ణయించుకోవాలి’ అని స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement