Abn logo
Aug 1 2021 @ 01:02AM

బ్యారేజీకి మళ్లీ వరద

ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా అంచనా

రేపు ఉదయానికి బ్యారేజీకి చేరే అవకాశం

అప్రమత్తమైన అధికారులు


విజయవాడ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ఉధృతి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రానికి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో నీరు పూర్తిస్థాయికి దగ్గరగా ఉంది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో 43.06 టీఎంసీల నీరు ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నీరు ఆదివారం సాయంత్రానికి నాగార్జునసాగర్‌కు చేరుతుంది. అప్పటికి పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు పెరుగుతుంది. అక్కడ నీటిని విడుదల చేస్తే, అది పులిచింతల ద్వారా సోమవారం ప్రకాశం బ్యారేజీకి వస్తుంది. ఆ నీరు బ్యారేజీ ద్వారా సముద్రంలోకి వెళుతుంది. ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో వారంపాటు కొనసాగుతుంది. ఈ వర్షాకాలంలో ఐదు లక్షల క్యూసెక్కుల నీరు రావడం ఇదే ప్రథమం. ఎగువ నుంచి నీరు అధికంగా రావడంతో రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులను కలెక్టర్‌ నివాస్‌ అప్రమత్తం చేశారు. అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి శనివారం ఆయన జూమ్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద నీరు ఐదు కాల్వల ద్వారా నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున ఇసుక బస్తాలను సిద్ధం చేసి, ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.