Abn logo
Oct 13 2021 @ 01:23AM

కోతలు మొదలు..

బొగ్గు కొరతతో విద్యుత్‌ గండం

ఇప్పటికే గ్యాస్‌ కొరతతో కోనసీమ, జీఎంఆర్‌ మూత

జల విద్యుత్‌ కేంద్రాలే ఆధారం 8 సోలార్‌ అంతంత మాత్రమే

రాత్రి ఆరు నుంచి పది గంటల వరకూ ఆక్వాకు సరఫరా బంద్‌

త్వరలో ఇండస్ట్రీ, వ్యవసాయానికి కూడా ఇబ్బందులు రావొచ్చు

గృహ వినియోగదారులకు కోత లేదంటున్న ఎస్‌ఈ మూర్తి

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

బొగ్గు కొరతతో విద్యుత్‌ గండం ఏర్పడింది. జిల్లాలో ఇప్పటికే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయి. ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు అధికారికంగా ఆక్వా రంగానికి ప్రతీ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ విద్యుత్‌ సరఫరాకు కోతపెట్టారు. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. త్వరలో ఇండస్ర్టీలకు, వ్యవసాయరంగానికి కూడా కోత ఉండే అవకాశం ఉంది. ఈలోగా సమస్య పరిష్కారమైతే ఓకే. కానీ గృహ వినియోగదారులకు మాత్రం ఏమాత్రం  ఇబ్బందిలేకుండా పూర్తిగా విద్యుత్‌ సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ బొగ్గు కొరత వల్ల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో సమస్య ఏర్పడింది. మన జిల్లాలో గతంలో ఉన్న విద్యుత్‌ ప్రాజెక్టులు చాలావరకూ మూతపడిపోయాయి. గతంలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ పరిశ్రమలు జిల్లాలో బాగా వెలిశా యి. కానీ గెయిల్‌ సంస్థ ఇక్కడ గ్యాస్‌ను పూర్తిగా సరఫరా చేయలేకపోయింది. ఇతర ప్రాంతాలకు ఎక్కువ గ్యాస్‌ తరలిపోతోంది. గతంలో అనేకమంది గ్యాస్‌ ఆధారిత పరిశ్రమల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ గ్యాస్‌ను సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పలు పరిశ్రమలు పురిట్లోనే ఆగిపోయాయి. కోనసీమ విద్యుత్‌ ప్రాజెక్టు గ్యాస్‌ ఆధారంతో పనిచేసేది. జిల్లాలో ఇంచుమించు గ్యాస్‌ సరఫరా ఆగిపోయింది. దీనితో కోనసీమ విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయింది. దానిని అమ్మే ప్రయత్నం కూడా చేయడం గమనార్హం. వేమగిరి జీఎం ఆర్‌ పరిస్థితి కూడా అదోలా ఉంది. అక్కడ కూడా ఉత్పత్తి ఆగిపోయినట్టే. జీవికేలో సమస్య ఏర్పడింది.  కొద్దిగా మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. కాకినాడ స్పెక్ట్రమ్‌కు కూడా గ్యాస్‌ సమస్య ఉన్నట్టు సమాచారం. జిల్లాకు సంబంధించి ఏజె న్సీలో నీటి ఆధారంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న సీలేరు ఒకటే పనిచేస్తోంది.  బొగ్గు, గ్యాస్‌ కన్నా జలవిద్యుత్‌ కేంద్రాలే కాపాడగలుగుతున్నాయి. ఈ పరిస్థితులలో పోలవరం విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తి చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. జిల్లాలో ఇంకా చిన్నచిన్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పటికీ గ్యాస్‌ కొరత వల్ల ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపఽథ్యంలో వీటి నుంచి విద్యుత్‌ సరఫరా ఏమీ ఉండదు. అందువల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యుత్‌ మనకు ఆధా రం. బొగ్గుకొరత వల్ల కొద్దిరోజులు ఈ సమస్య ఉండవచ్చని అర్థం అవుతోంది. కరోనా సమయంలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోవడం, పైగా అప్పుడు పరిశ్రమలు కూడా ఆగిపోవడంతో దీని అవసరం పెద్దగా కనిపించలేదు. ఇటీవల అన్ని పరిశ్రమలు తిరిగి మొదలయ్యాయి. విద్యుత్‌ వినియోగం కూడా పెరిగింది. కానీ బొగ్గు కొరత తీరలేదు. దీంతో విద్యుత్‌ సమస్య ఏర్పడింది. ఇక జిల్లాలో గత ప్రభుత్వాలు సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటును బాగా ప్రోత్సహించాయి. ఇళ్లలోనూ, పరిశ్రమల్లోనూ, చివరకు వ్యవసాయ రంగంలో కూడా సోలార్‌ వినియోగం పెంచే ప్రయత్నం చేశారు. కానీ వీటి ద్వారా ప్రస్తుతం 10 మెగావాట్ల వరకే సోలార్‌ విద్యుదుత్పత్తి అవుతోంది. ఓఎన్‌జీసీ వంటి సంస్థలు సొంతంగా సోలార్‌ ప్లాంట్లు పెట్టుకున్నాయి. జిల్లా సోలార్‌ ప్రాజెక్టులకు భూ సమస్య ఉంది. విలువైన భూమి కావడంతో ఎక్కువ భూమిలో ఈ ప్లాంట్లను పెట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.

‘గృహాలకు కోత లేదు..’

‘ఆంధ్రజ్యోతి’తో ఈపీడీసీఎల్‌   ఎస్‌ఈ మూర్తి

బొగ్గు కొరత వల్ల విద్యుత్‌ ఇబ్బందులు ఉండడం నిజమే. కానీ గృహ వినియోగదారులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూస్తు న్నాం. గ్రామాల్లో కూడా కోత విధించడం లేదని ఏపీఈపీడీసీఎల్‌ రాజమహేంద్రవరం సర్కిల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌ మూర్తి చెప్పారు. మంగళవారం సాయంత్రం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి మాత్రం ప్రతీరోజు సాయంత్రం 6 గం టల నుంచి రాత్రి 10 గంటల వరకూ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. జిల్లాలో 18 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయని, వాటిద్వారా సాధారణ రోజుల్లో 16 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ వినియోగిస్తారన్నారు. ప్రస్తుతం 15 మిలియన్‌ యూనిట్ల నుంచి 16 మిలియన్‌ యూనిట్ల వరకూ వినియోగం ఉందన్నారు. వేసవిలో ఇది 18 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని చెప్పారు. ప్రతీరోజు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటలలోపు 600 మెగావాట్ల వినియోగం వరకూ ఉండేదని, ఇప్పుడు 720 మెగావాట్ల వరకూ పెరిగిపోతోందన్నారు. ఆక్వాకు ఆపడం వల్ల 40 మెగావాట్లు కలసివస్తుందన్నారు. ఈ సమయంలో ఆక్వాకు ఆపడంతోపాటు, పరిశ్రమలు, ఆఫీసులు, ఇళ్లలో కూడా ఏసీలు ఆపేస్తే మరింత విద్యుత్‌ సద్వినియోగం అవుతుందన్నారు. ఇండస్ర్టీలు కూడా ఈ సమయం లో కొన్ని మోటార్లు ఆపి తర్వాత ఉపయోగించుకోలన్నారు. జిల్లా లో మొత్తం 18 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, అందులో 16 లక్షలు గృహ వినియోగ కనెక్షన్లేనన్నారు. మొత్తం 55 నుంచి 60 శాతం వినియోగం గృహాలకే ఉంటుందని తెలిపారు. ఏసీలు తక్కువగా వాడడం మంచిదని, ఒక ఏసీ 25 ఫ్యాన్లకు సమానమన్నారు. వినియోగదారులు ప్రస్తుత పరిస్థితిని గమనించి, అవసరమైన మేరకే విద్యుత్‌ను వినియోగించుకోవాలని ఆయన కోరారు.