Abn logo
Sep 27 2020 @ 02:53AM

కుండపోత

Kaakateeya

  • పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. పొంగిన వాగులు, వంకలు
  • రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • వాగుల్లో కొట్టుకుపోయిన వాహనాలు
  • పలువురిని కాపాడిన పోలీసులు, స్థానికులు
  • లక్షలాది ఎకరాల్లో పంట మునక
  • ప్రకాశం జిల్లాలో విద్యార్థి మృతి
  • నంద్యాలలో 25 కాలనీల్లోకి నీరు
  • కర్నూలు జిల్లాలో 269 మిల్లీమీటర్ల వర్షం


రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుంభవృష్టికి వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు, కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలపై ఉధృతంగా వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. లక్షల ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. వరద ప్రవాహంలో చిక్కుకున్న పలువురిని పోలీసులు, స్థానికులు కాపాడారు. ప్రకాశం జిల్లాలో ఇద్దరు విద్యార్థులు వాగులో కొట్టుకుపోగా, వారిలో ఒకరిని స్థానికులు కాపాడారు. మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

ప్రకాశం జిల్లాలోని అత్యధిక మండలాల్లో భారీ వర్షం పడింది. కొన్నిచోట్ల కుంభవృష్టి కురిసింది. అత్యధికంగా రాచర్లలో 186, పంగులూరు 184, ఇంకొల్లు 171, చినగంజాంలో 160 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుండ్లకమ్మ, సగిలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సగిలేరు పొంగి గిద్దలూరులో పలు కాలనీలు జలమయమయ్యాయి. పర్చూరు, అద్దంకి, గిద్దలూరు, నాగులుప్పలపాడు, ఇంకొల్లు తదితర ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగులుప్పలపాడు మండలం కొత్తకోట వద్ద లారీ, ఎక్సకవేటర్‌ వాగులో చిక్కుకున్నాయి. వాగుల ఉధృతికి ఒంగోలు-ఇంకొల్లు, కొణిజేడు- పొందూరు, నాగులుప్పలపాడు-తిమ్మనపాలెం, అద్దంకి-రేణింగవరం మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నంద్యాల-గిద్దలూరు ఘాట్‌ రోడ్డులోనూ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బల్లికురవ మండలం అంబడిపూడి వాగులో ఇద్దరు విద్యార్థులు కొట్టుకుపోగా, వారిలో ఒకరిని స్థానికులు కాపాడారు. మరో విద్యార్థి పల్లపు శ్రావణ్‌కుమార్‌ మృతి చెందాడు. కంభం మండలం రావిపాడు వద్ద వాగులో ట్రాక్టర్‌ కొట్టుకుపోగా, ముగ్గురిని పోలీసులు కాపాడారు. బేస్తవారపేట మండలం పెంచికలపాడు చెరువు కట్ట తెగిపోవడంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. నాగుల్పులపాడు మండలం చదలవాడ ఊరచెరువుకు గండి పడింది. జిల్లాలోని సుమారు 50వేల ఎకరాలకు పైగా మిర్చి, పత్తి, సజ్జ, కంది, కొర్ర పంటలు నీట మునిగాయి.

కాలనీలు జలమయం..

కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకూ 269 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, వంతెనలపై నీరు పారుతోంది. నంద్యాలలో 25 కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. 25 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లక్ష ఎకరాల్లోని వరి, పత్తి, మొక్కజొన్న, కంది, మిర్చి, ఉల్లి తదితర పంటలు నీట మునిగాయి. సిద్ధాపురం చెరువు పొంగి పొర్లుతోంది. కర్నూలు-గుంటూరు రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వెలుగోడులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నంద్యాల, మహానంది ప్రాంతంలో చామకాలువ, కుందూనది, మద్దిలేరు తదితర వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చామకాలువ, మద్దిలేరుకు వరద పోటెత్తడంతో పట్టణంలోని లోతట్టు కాలనీలు నీట మునిగాయి. రాణి-మహారాణి థియేటర్ల వద్ద ఉన్న బ్రిటీష్‌ కాలం నాటి బ్రిడ్జిపై మూడు అడుగుల ఎత్తున కుందూ వరద పారింది. దీంతో నంద్యాల-నందమూరినగర్‌, పులిమద్ది, మునగాల, పోలూరు, గడివేముల మండలం వైపు రాకపోకలన్నీ పూర్తిగా స్తంభించాయి. చామకాలువ, మద్దిలేరు, కుందూ వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోని ముఖ్యమైన వస్తువులను తీసుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నల్లమల అటవీ బేస్‌క్యాంపులో విధుల నిర్వహణకు వెళ్లిన శంకర్‌ నాయక్‌, వెంకటశివయ్య, శేఖర్‌ జలదిగ్బంధంలో చిక్కుకోగా అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. 


అనంతలో కూలిన ఇళ్లు..

అనంతపురం జిల్లాలోనూ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. యాడికిలో నాలుగు ఇళ్లు, పుట్టూరు మండలం కడవకల్లులో రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దులో, బళ్లారి-గుంతకల్లు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పెద్దవడుగూరులోని పందులవంక వాగు ఉధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, కదిరి, గుంతకల్లులో రోడ్లన్నీ జలమయమయ్యాయి. 


అమరావతి-విజయవాడ రాకపోకలు నిలిపివేత 

గుంటూరు జిల్లాలో వాగులు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి.గుంటూరు-హైదరాబాద్‌ రోడ్డులో వెన్నాదేవి వాగు ఉప్పొంగింది. రోడ్డు కోతకు గురవడంతో గుంటూరు-హైదరాబాద్‌ వాహనాలను పిడుగురాళ్ల, కొండమోడు, నరసరావుపేట మీదుగా మళ్లించారు. పెదమద్దూరు వాగు రోడ్డు పైకి ప్రవహించడంతో అమరావతి-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిపేశారు. బలిజేపల్లి వద్ద ఎద్దువాగు రహదారిపైకి పొంగింది. శావల్యాపురంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో వాహనాలను నిలిపేశారు.

శ్రీశైలం గేట్లపై నుంచి నీరు..

కృష్ణానదిలో ఎగువ నుంచి వస్తున్న వరదను అధికారులు అంచనా వేయలేకపోవడంతో శనివారం శ్రీశైలం డ్యాం గేట్లపై నుంచి నీరు ప్రవహించింది. 4,10,321 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. పది రోజుల క్రితం కూడా ఇలాగే గేట్లపై నుంచి నీరు ప్రవహించగా, అప్పటికప్పుడు పదిగేట్లను ఎత్తి నీరు వదిలారు. ప్రస్తుతం డ్యాం గేట్ల ద్వారా 3,76,670 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 35,001 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, కాగా ప్రస్తుతం  884.40 అడుగులు ఉంది. 


మరో 4 రోజులు భారీ వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం మీదుగా రెండు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తూర్పు బిహార్‌ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ఆదివారం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం, 29న రాష్ట్రం మొత్తం, 30న ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.


ఉప్పొంగిన కుందూ.. పాపాఘ్ని.. పెన్నా

కడప జిల్లాలో కుందూ, పాపాఘ్ని, పెన్నా నదులు ఉప్పొంగాయి. ఎర్రగుంట్ల మండలంలో 207 మిల్లీమీటర్లు, వీఎన్‌పల్లిలో 173, పెండ్లిమర్రిలో 168 మిల్లీమీటర్ల వర్షం పడింది. ముద్దనూరు చెరువుకు గండి పడి ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఎర్రగుంట్ల, కలసపాడు తదితర మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కృష్ణాజిల్లాలోనూ ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాపులపాడులో అత్యధికంగా 137 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ వాగులు పొంగుతున్నాయి. విశాఖ జిల్లాలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.

Advertisement
Advertisement
Advertisement