Abn logo
Mar 6 2021 @ 12:28PM

పోస్టాఫీసుల్లో ప్రజల పొదుపు సొమ్ము గల్లంతు?

చిత్తూరు/కలికిరి : మండలంలోని పలు గ్రామీణ తపాలా కార్యాలయాల్లో వివిధ పథకాల కింద ప్రజలు చేసిన పొదుపు సొమ్ము భారీగా పక్కదారి పట్టినట్లు ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. నగరిపల్లె బీపీఎంగా 2016 నుంచి పనిచేస్తున్న బాలకృష్ణ నెల రోజుల క్రితం పదోన్నతిపై రైల్వే మెయిల్‌ సర్వీసుకు వెళ్లారు. అయితే ప్రజల పొదుపు సొమ్ములకు సంబంధించిన లెక్కలు అప్పగించకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఇన్‌చార్జిగా వున్న ఉద్యోగి వద్ద ఖాతాదారులు తమ ఖాతాల్లో జమ అయిన మొత్తాలు, నిల్వ సొమ్ము గురించి వాకబు చేయడంతో భారీగా తేడాలు వచ్చినట్లు తెలిసింది. 


సమాచారం అందుకున్న తపాలా పర్యవేక్షక అధికారులు ఖాతాదారులు తపాలా కార్యాలయాలకు వచ్చి జమ చేసిన డబ్బును నిర్ధారించుకోవలసిందిగా దండోరాలు వేయిస్తున్నారు. సేవింగ్‌, రికరింగ్‌ డిపాజిట్లు, సుకన్య సమృద్ధి యోజన, పీఎల్‌ఐ వంటి పలు రకాల ఖాతాల్లో జమచేసిన సొమ్ము గల్లంతయినట్లు తెలుస్తోంది. దీనిపై పీలేరు ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన రావును వివరణ కోరగా ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమేనన్నారు. ఖాతాలను ఆయా పోస్టాఫీసుల్లో పరిశీలించుకోవాలని దండోరా వేయిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం నుంచి తాను స్వయంగా తనిఖీలు చేపట్టనున్నట్లు వివరించారు.

Advertisement
Advertisement
Advertisement