Abn logo
May 3 2020 @ 00:50AM

పేద బతుకులు–పేగు కదలని పాలకులు

పేదలను సేవకులుగానే తప్ప, మనుషులుగా చూడడాన్ని సమాజం చాలా కాలం కిందటే సౌకర్యవంతంగా మరిచిపోయింది. కాబట్టే, వలస కార్మికుల పట్ల ఇంతటి ఉదాసీనత. అంతేకాదు, సహజంగా వచ్చిన వైరస్‌ను, సమాజ నిర్మిత వర్గ, కుల, మత, జాతి పరిధులలోకి తీసుకువచ్చి, సమూహాలకు సమూహాలనే వెలివేతకు, మరణపు అంచులకు ఎలా నెట్టివేయవచ్చో ప్రపంచ పెట్టుబడికి కావాల్సినంత అనుభవం ఉంది. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. ఈ సర్వవ్యాప్త సంక్షోభంలో దృఢంగా నిలబడాల్సింది బాధితులైన ప్రజలే.


కొవిడ్ - 19 తెచ్చిన మహా సంక్షోభంలో ఇంతకాలంగా ఎంతో ఓపిక పట్టిన వలస కార్మికులు, పేదలు విసిగి, వేసారి రగులుతున్న కొలిమిల్లా వున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్  ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో నిర్మాణపు పనులలో వున్న సుమారు రెండు వేల మంది కూలీలు, తమకు జీతాలు చెల్లించకుండా, అటు ఇండ్లకు పంపకుండా నిర్బంధంగా నిలిపివేసిన యాజమాన్యం పైనా, పోలీసులపైన ఆగ్రహావేశాలతో దాడిచేశారు. ఢిల్లీ, ముంబాయి, సూరత్‌లలోనే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాలలో వలస కూలీలు తాము ఆపినా  ఇక ఆగి ఉండరని పాలకులు  గ్రహించారు. పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని అర్ధమయాక, ఎట్టకేలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన వారందరినీ, వారివారి ప్రాంతాలకు వెళ్ళేందుకు అనుమతిస్తున్నట్లుగా  ప్రకటించాయి. 


కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాగుతున్న ప్రచారాలను వింటున్నప్పుడు, అవన్నీ పట్టణ మధ్యతరగతి, ధనిక ప్రజానీకాన్ని ఉద్దేశించినవిగానే అగుపిస్తాయి. ఒకటికి పదిసార్లు సబ్బులు, శానిటైజర్లు ఉపయోగించి చేతులుకాళ్ళు కడుక్కోవడం, కూరగాయలు, పండ్లు శుద్ధి చేసుకోవడం, ఒకటి రెండు నెలలకు సరిపడా సామాన్లు ఒకే సారి తెచ్చుకోమనడం ఇత్యాది సలహాలు హోరెత్తుతున్నాయి. భౌతిక దూరాలను పాటించని, ముక్కుకు మాస్క్ ధరించని, వీధులలోకి వెళ్ళాల్సి వచ్చిన వాళ్లని దేశద్రోహులుగా భావించడం, మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు పడుతున్న తాపత్రయంగా చాలా మంది భావిస్తున్నారు. ఆరోగ్య భద్రతా చర్యలుగా చెబుతున్న ఇవన్నీ దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న, ఒక పూట తిండి కూడా దొరకని 30 కోట్ల మంది ప్రజలకి వర్తిస్తాయా? దేశంలోని శ్రమజీవులలో తొంభై శాతం మంది అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారే. అలాంటి వారికి వర్తిస్తాయా? అప్పులపాలై, ఉన్న ఊరిలో ఉపాధి దొరకక పిల్లలను, ముసలి తల్లిదండ్రులను ఇళ్ల వద్దే వదిలి, పనులు వెతుక్కుంటూ దేశం నలుమూలలకూ వెడుతున్న వలస కార్మికులకు, వర్తిస్తాయా?


ప్రపంచబ్యాంకు పేర్కొన్న దాని ప్రకారం భారతదేశంలోని పేదలలో ఎనభై శాతం మంది గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తున్నారు. దేశంలో ప్రతి ఐదు మందిలో ఒకరు పేదలే. దేశంలోనే పేదరికపు వరుసలో అగ్రభాగాన ఉన్న వారు ఆదివాసులు. ఆ తరువాత వరుసలో నిలబడ్డవారు దళితులు, ఓబీసీలు, ముస్లింలు. అతి తక్కువ ఆదాయ వనరులు వున్న, దుర్బరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నుండే ఇతర ప్రాంతాలకు వెళుతున్న వలస కూలీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.


దేశంలో సుమారు 300 జిల్లాలలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏళ్ల తరబడి నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్న ఫలితంగా పేదలలో 110 లక్షల మంది ఎప్పటికీ పేదలుగానే మిగలనున్నారు. అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ హ్యూమన్ డెవలప్ మెంట్ సర్వే, ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం పేదలలో 40 నుండి 40.3 శాతం మంది ఇక ఎప్పటికీ నిరుపేదలుగానే మిగిలిపోనున్నారు.


అంతర్జాతీయ కార్మిక సంఘం నివేదిక ప్రకారం దేశంలో మూడు వంతుల మంది శ్రామికులకు కనీస వేతనాలకన్నా తక్కువ చెల్లిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో చెల్లించే వేతనాలకన్న గ్రామీణ ప్రాంతాల్లో చెల్లించే వేతనాలు సగానికి సగమే. ఇక వేతనాల చెల్లింపులలో జెండర్ వ్యత్యాసం 34 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే మహిళా కూలీలకు చెల్లించే వేతనాలు సగటున 104 రూపాయలు మాత్రమే! 


ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలను చేపట్టకుండా అకస్మాత్తుగా ప్రకటించిన లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా సుమారు పదిహేను కోట్ల వలస కూలీల పరిస్థితి దారుణంగా మారింది. తొలివిడత లాక్‌డౌన్ ప్రకటించిన వారంలోగానే పట్టణ ప్రాంతాల్లో పని చేస్తున్న సుమారు 12 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని అంచనా. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 30 కోట్ల మంది జీవితాలే కాక, మరో 25 కోట్ల మంది పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. చట్ట ప్రకారం ప్రభుత్వాలు వీరి సంక్షేమం కోసం కేటాయించిన కోట్లాది రూపాయల నిధులను ఈ కరోనా కాలంలో కూడా వారి కోసం వెచ్చించడం లేదు.


వలస కార్మికులకున్న ఆర్థిక స్తోమత వారానికన్నా మించి వారికి ఆహారాన్ని సమకూర్చలేదు. ఏప్రిల్ 22 తరువాత, అప్పటి వరకూ చేసిన పనికి కూడా జీతం చెల్లించకుండా, వాళ్ళ గ్రామాలకు వెళ్ళేందుకు ఎలాంటి రవాణా కూడా ఏర్పాటు చేయకుండా అత్యంత నిర్దయగా యాజమాన్యాలు వలస కార్మికుల్ని పనుల నుండి వెళ్ళగొట్టాయి. నెలకు పైగా సాగుతున్న ఈ లాక్‌డౌన్‌లో వందకు 10 నుండి 20 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకుంటూ, వున్నవి అమ్ముకుంటూ, చివరికి తమను తాము తాకట్టు పెట్టుకుంటూ దుర్భర పరిస్థితుల్లోకి నెట్టి వేయబడుతున్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే 2030 నాటికల్లా భారత ప్రభుత్వం మరో పది లక్షల మందిని వెట్టిచాకిరి నుండి విముక్తం చేయాల్సి వస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ప్రకటించారు.


ప్రస్తుతం దేశంలో ఏడున్నర కోట్ల టన్నులకు పైగా నిర్ధారిత బఫర్ నిల్వలకంటే మూడు రెట్లు అధికంగా ఆహారనిల్వలు ఉన్నాయి. ఈసారి పంటలు బాగా పండటం వల్ల 10 కోట్ల టన్నులకు పైగా గోధుమలు, అంతకు మించి పప్పుధాన్యాలు రాబోతున్నాయి. అయినప్పటికీ పనులు లేక ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు పంచే వితరణశీలత మాత్రం మన ప్రభుత్వాలకు కొరవడింది. 2011 సెన్సెస్ ప్రకారం కోటి మందికి పైగా ప్రజా పంపిణీ వ్యవస్థలకు బైటనే ఉన్నారు. కరోనా కాలంలో ప్రభుత్వం పంచుతున్న ధాన్యం, ఆర్ధిక సహాయం వలస, పేద ప్రజలకు సక్రమంగా అందకపోవడమే కాదు, అందినా అది ఏ మూలకూ వాళ్లకు చాలదు. దేశంలో ఏటా పౌష్టికాహార లోపం వల్ల 73వేల మంది మరణిస్తున్నారు.


ఇలాంటి స్థితిలో కొవిడ్ -19 వల్ల అతలాకుతలమైన దేశ, ప్రపంచ ఆర్ధిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు మానవీయ కోణం నుండి ఆయా ప్రభుత్వాలు ఆలోచిస్తాయనే భ్రమలు ఎవరికైనా ఉంటే వదులుకోవడం మంచిది. ఈ సంక్షోభం 1929-–30లో వచ్చిన మహా మాంద్యం కన్నా అనేక రెట్లు తీవ్రమైంది. ప్రజల ఆదాయాలు దారుణంగా పడిపోనున్నాయి. ప్రపంచ బ్యాంకు చెబుతున్న దాని ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలలోనే ప్రజల దినసరి ఆదాయం 5.50 డాలర్లకు పడిపోనుందంటే, మనలాంటి దేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) అత్యవసర విభాగ డైరెక్టర్ డొమినిక్ బర్జన్ ‘పేదరికం కారణంగా ఇతర దేశాలకు అందివ్వాల్సిన ఆహార సహాయాన్ని కొన్ని దేశాలు 2007–-08 మధ్యకాలంలో అడ్డుకోవడం వల్ల అనేక మంది మరణించారు. ఈ కరోనా విపత్తు సమయంలో ఆహార సహాయాన్ని అడ్డుకోవడం జరగకూడదు’ అన్నాడు. అదే జరిగితే ఆనాడు ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియాలోని కొన్ని దేశాలలో ఆహారం కోసం జరిగిన దాడులు, కల్లోలాలు, దొమ్మీలు ప్రపంచం అంతటా సంభవించే ప్రమాదముంది.


‘కరోనా వైరస్ సోకక ముందే మేము ఆకలితో చనిపోతామేమో’ అని దేశంలో వలస కూలీలు, పేదలు వాపోతున్నారు. నిజమే మరి. ఎందుకంటే ఇది అసలే రోగగ్రస్థ వ్యవస్థ. పెట్టుబడి, దోపిడి, లాభం దాని గుండె చప్పుడు. వినదలుచుకోని, మాట్లాడదలుచుకోని, చూడదలుచుకోని వాళ్ళ వాకిట నిలబడి మనం మాట్లాడుతున్నప్పుడు, అన్నింటికీ సమాధానం లాఠీలతోనే చెప్పాలనుకుంటున్న వాళ్లకి మన అభ్యర్ధనలను వినిపిస్తున్నప్పుడు, మనం వాళ్ళ నుండి ఏమి ఆశించగలం? కొవిడ్ -19 వల్ల కోల్పోయిన జీవితాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే, కరోనా సమాధుల మీదుగా, ఆకలి కడుపులే పునాదిగా, నూతన వ్యాపారాలకు, పెట్టుబడుల పునరేకీకరణ ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ఐఎమ్ఎఫ్, జీ- 20 దేశాలు పేద దేశాలకు అప్పులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. అవి ఎటువంటి షరతులను విధిస్తాయో గత అనుభవాలు మనకున్నాయి. మన దేశంలోనూ జియో, ఫేస్‌బుక్ మధ్యే కాకుండా, అనేక నూతన పరిశ్రమల ఏర్పాట్ల కై బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. జీతాలలో, కరువుభత్యాలలో కోతలు, 12గంటల పని, కార్మిక సంఘాల నిషేధం తో సహా అనేక కొత్త ఆర్డినెన్స్ లు అతి త్వరలో రానున్నాయి.


కొవిడ్ 19 వైరస్ వల్ల నిరాశ్రయులుగా మారిన వలస కూలీలు కొందరు వందల మైళ్ళు నడిచి వారి సొంత గ్రామాలకు వెళ్ళేందుకు సాహసించారు. అలాంటి వారిని మధ్యలోనే ఆపి వేశారు. కొన్ని చోట్ల దారుణంగా చితకబాదారు. ఇళ్లలో కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా క్వారంటైన్‌ను పాటిస్తూ జీవించే అర్హత డబ్బున్న వారి సొత్తని, అలాంటి వారు ఎంత దూరంలో ఉన్నా వాళ్ళని వారి వారి ఇండ్లకు పంపేందుకు అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తారని, మునుపెన్నడూ లేని విధంగా యావత్ సమాజం నిట్టనిలువుగా రెండు భిన్న ప్రపంచాలుగా చీలి ఉందని కరోనా కాలం మనకు పాఠం నేర్పింది.


‘అమెరికన్ సమాజంలో ఓ లక్ష మంది చస్తే మాత్రం ఏమిటి?’ అన్న నాయకుడికీ, ‘పేదరికాన్ని నిర్మూలించడం కన్నా అది కనపడకుండా గోడ కడితే చాలన్న’ అధినాయకునికీ వలస కార్మికులు, పేదలు కరోనా కాలంలో కలిసి వచ్చిన కారు చౌక శ్రామికులు మాత్రమే. సేవకులుగానే తప్ప, మనుషులుగా వారిని చూడటాన్ని సమాజం సౌకర్యవంతంగా మరిచిపోయి చాలా కాలం అయింది. కాబట్టే, వలస కార్మికుల పట్ల ఇంతటి ఉదాసీనత. అంతే కాదు సహజంగా వచ్చిన వైర‍స్‌ను, సమాజ నిర్మిత వర్గ, కుల, మత, జాతి పరిధులలోకి తీసుకు వచ్చి, సమూహాలకు సమూహాలనే వెలివేతకు, మరణపు అంచులకు ఎలా నెట్టి వేయవచ్చో ప్రపంచ పెట్టుబడికి కావాల్సినంత గత అనుభవం ఉంది. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. ఎటుతిరిగీ ఈ సర్వవ్యాప్త సంక్షోభంలో దృఢంగా నిలబడాల్సింది బాధితులైన ప్రజలే.

విమల

సామాజిక కార్యకర్త, రచయిత

Advertisement
Advertisement
Advertisement